రేవంత్‌రెడ్డిపై ఫిర్యాదును చట్టప్రకారం విచారించండి

పార్లమెంటు ఎన్నికల సందర్భంగా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించి చట్టప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలంటూ కింది కోర్టుకు హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది.

Published : 11 Jun 2024 05:37 IST

కింది కోర్టుకు హైకోర్టు ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: పార్లమెంటు ఎన్నికల సందర్భంగా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించి చట్టప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలంటూ కింది కోర్టుకు హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. రేవంత్‌రెడ్డిపై ఇచ్చిన ఫిర్యాదులోని అంశాల జోలికి వెళ్లకుండా జులై 6కు వాయిదా వేయడాన్ని తప్పుబట్టింది. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మే 4న కొత్తగూడెంలో కాంగ్రెస్‌ జనజాతర సభ నిర్వహించింది. అందులో భాజపాకు 400 సీట్లు ఇస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని, రాజ్యాంగాన్ని మార్చేస్తారంటూ సీఎం రేవంత్‌రెడ్డి నిరాధారమైన ఆరోపణలు చేశారని.. పార్టీ ప్రతిష్ఠ దెబ్బతీశారని ఇచ్చిన ప్రైవేటు ఫిర్యాదుపై నాంపల్లి కోర్టు పరిధిలోని జూనియర్‌ ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ విచారించకపోవడాన్ని సవాలు చేస్తూ భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వెంకటేశ్వర్లు పిటిషన్‌ దాఖలు చేసిన విషయం విదితమే. దీనిపై జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది డి.విజయ్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ రేవంత్‌రెడ్డిపై మే 14న కోర్టులో ఫిర్యాదు చేశామన్నారు. మే 22కు వాయిదా వేయగా ఫిర్యాదుదారు హాజరుకాలేదని, కొంతసేపటికి వాయిదా వేయాలని న్యాయవాది కోరారన్నారు. అయినా కోర్టు.. న్యాయవాది విజ్ఞప్తిని తోసిపుచ్చి జులై 6వ తేదీకి వాయిదా వేసిందన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి ఫిర్యాదులోని అంశాలను పరిశీలించి అందులో ఆధారాలుంటే విచారణకు పరిగణనలోకి తీసుకుని నోటీసులు జారీ చేయడం, లేదంటే దర్యాప్తు నిమిత్తం పోలీసులకు పంపడం వంటివి చేయాల్సి ఉండగా కేవలం వాయిదా వేయడం సరికాదని పేర్కొన్నారు. ఫిర్యాదుపై తగిన నిర్ణయం తీసుకోవాలని కింది కోర్టుకు ఆదేశాలు జారీ చేస్తూ పిటిషన్‌పై విచారణను మూసివేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని