మానసిక వైద్యసేవలు ప్రతిఒక్కరి హక్కు

మానసిక సమస్యలతో ఉన్న ప్రతిఒక్కరూ మెరుగైన వైద్య సదుపాయం పొందేందుకు వీలుగా రాష్ట్రాలు ప్రత్యేక చొరవ చూపాలని కేంద్రం ఆదేశించింది.

Published : 11 Jun 2024 05:39 IST

చికిత్సలో గోప్యత.. గౌరవం పాటించాలి 
‘మానసిక ఆరోగ్య చట్టం’ సవరణల అమలుపై కేంద్రం ఆదేశాలు 

ఈనాడు, హైదరాబాద్‌: మానసిక సమస్యలతో ఉన్న ప్రతిఒక్కరూ మెరుగైన వైద్య సదుపాయం పొందేందుకు వీలుగా రాష్ట్రాలు ప్రత్యేక చొరవ చూపాలని కేంద్రం ఆదేశించింది. మనోవ్యాధులతో బాధపడే వారికి గౌరవంగా జీవించే హక్కును కల్పించడంతోపాటు క్రూరమైన, అవమానకరమైన చికిత్స నుంచి రక్షణ కల్పించేలా ‘మానసిక ఆరోగ్య చట్టం-2017’లో కేంద్రం గతంలో మార్పులు చేసింది. శారీరక అనారోగ్యంతో ఉన్న వారితో సమానంగా చికిత్స పొందేందుకు వీరూ అర్హులేనని స్పష్టం చేసింది. ఎలక్ట్రోకన్వెల్సివ్‌ థెరపీ(ఈసీటీ) అనస్థీషియా ఇవ్వకుండా నిర్వహించకూడదని, మైనర్లకు ఈసీటీ చేయొద్దని చట్టంలో నిర్దేశించింది. ఇందులో భాగంగా రాష్ట్రస్థాయిలో మానసిక ఆరోగ్య అథారిటీతోపాటు జిల్లాస్థాయిలో కమిటీని ఏర్పాటు చేయాలని తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. 

చట్టం నిబంధనలు ఇవీ.. 

  • రాష్ట్రస్థాయిలో ముఖ్యకార్యదర్శి లేదా కార్యదర్శి నేతృత్వంలో మెంటల్‌హెల్త్‌ అథారిటీని ఏర్పాటు చేయాలి. ఇందులో సభ్యులుగా సంయుక్త కార్యదర్శి, వైద్య విద్య డైరెక్టర్‌(డీఎంఈ), నామినేటెడ్‌ నాన్‌ అఫిషియల్‌ సభ్యులను మూడేళ్ల పదవీ కాలంతో నియమించాలి.  
  • రాష్ట్రంలోని ప్రతి మానసిక ఆరోగ్య విభాగం ఈ అథారిటీ వద్ద విధిగా నమోదు చేసుకోవాలి. చట్టంలోని నిబంధనల మేరకు వాటికి అనుమతులిస్తారు. ఏడాది పూర్తయిన తర్వాత తిరిగి పునరుద్ధరణ చేయించుకోవాలి. 
  • కలెక్టర్, మానవహక్కుల కమిషన్‌ ప్రతినిధి, ప్రభుత్వ సేవల్లోని సైకియాట్రిస్ట్, ఎన్జీఓ ప్రతినిధి సభ్యులుగా జిల్లాలోనూ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలి. ఈ కమిటీ ఫిర్యాదుల ఆధారంగా లేదా సమోటోగా ఆయా ఆరోగ్య విభాగాలను తనిఖీ చేయొచ్చు.
  • వారిని సాధారణ వ్యక్తులతో సమానంగా పరిగణించాలి, పని చేయమని బలవంతం చేయకూడదు. ప్రతి బీమా సంస్థ మానసిక   చికిత్సకు వైద్య బీమా సదుపాయం కల్పించాలి. 

సైకియాట్రిస్ట్‌ల కొరత తీర్చడంపై దృష్టి

- బి.ఎన్‌.గంగాధర్, ఎన్‌ఎంసీ ఛైర్మన్, నిమ్‌హాన్స్‌ పూర్వ డైరెక్టర్‌

సాధారణంగా లక్ష మందికి ఒక సైకియాట్రిస్ట్‌ అందుబాటులో ఉండాలి. ఈ లెక్కన దేశంలో 15 వేల మంది అవసరం కాగా 10 వేల మందే ఉన్నారు. దీని పరిష్కారంపై జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసీ) ఇప్పటికే దృష్టిసారించింది. ప్రతి వైద్య కళాశాలలో సైకియాట్రీ విభాగానికి అనుమతిస్తున్నాం. దేశంలో 50 దాకా మానసిక వైద్య బోధన ఆసుపత్రులు ఉన్నాయి. వీటిలో ఇప్పటికే చాలా వరకు సైకియాట్రీ పీజీ ప్రారంభించాం. పలు   జనరల్‌ ఆసుపత్రుల్లోనూ సైకియాట్రీ పీజీ ప్రారంభించాం. ప్రతి    వైద్యుడికి మానసిక వైద్యంలో నైపుణ్యం అందించడంపైనా ఎన్‌ఎంసీ దృష్టిపెట్టింది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని