ఎట్టకేలకు టీచర్ల సీనియారిటీ జాబితా

ఉపాధ్యాయుల పదోన్నతులకు సోమవారం రాత్రి సీనియారిటీ జాబితా వెల్లడైంది. షెడ్యూల్‌ ప్రకారం.. మల్టీ జోన్‌-1, 2లో బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ఈ నెల 8వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సి ఉంది.

Published : 11 Jun 2024 05:40 IST

మల్టీ జోన్‌-2 ఆశావహుల్లో వీడిన ఉత్కంఠ
గెజిటెడ్‌ హెచ్‌ఎంలుగా పదోన్నతి పొందనున్న స్కూల్‌ అసిస్టెంట్లు

ఈనాడు, హైదరాబాద్‌: ఉపాధ్యాయుల పదోన్నతులకు సోమవారం రాత్రి సీనియారిటీ జాబితా వెల్లడైంది. షెడ్యూల్‌ ప్రకారం.. మల్టీ జోన్‌-1, 2లో బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ఈ నెల 8వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. మల్టీ జోన్‌-2లో జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలల్లో పనిచేసే స్కూల్‌ అసిస్టెంట్లకు గెజిటెడ్‌ హెచ్‌ఎంలుగా పదోన్నతి కల్పించేందుకు తుది సీనియారిటీ జాబితాను సోమవారమే ప్రదర్శించాలి. అయితే సోమవారం రాత్రి ప్రాథమిక సీనియారిటీ జాబితాను మాత్రమే విద్యాశాఖ వెబ్‌సైట్లో ఉంచారు. 

ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులు జరుగుతాయా? అని గత రెండు రోజులుగా ఆశావహులు ఆందోళన చెందారు. పాఠశాల విద్యాశాఖ అధికారులకు ఫోన్లు చేసి ఆరాతీశారు. ఈసారైనా ప్రక్రియ పూర్తవుతుందా? అనే సందేహాలూ వ్యక్తమయ్యాయి. ఎట్టకేలకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం పచ్చజెండా ఊపడంతో సోమవారం రాత్రి మల్టీ జోన్‌-2లో గెజిటెడ్‌ హెచ్‌ఎం పదోన్నతుల కోసం సీనియారిటీ జాబితా వెల్లడించారు. దానిపై అభ్యంతరాల తర్వాత తుది సీనియారిటీ జాబితాను ఉంచుతారు. తదనంతరం జీహెచ్‌ఎంలుగా పదోన్నతులు కల్పిస్తూ పాఠశాల విద్యాశాఖ ఆర్‌జేడీ ఉత్తర్వులు జారీచేస్తారు. 

మల్టీ జోన్‌-1 (వరంగల్‌)లో సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (ఎస్‌జీటీలు) స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందాల్సి ఉంది. షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 8వ తేదీనే ప్రాథమిక సీనియారిటీ జాబితా ప్రదర్శించాల్సి ఉంది. అయితే వాటిని పలు జిల్లాల్లో డీఈవోలు సోమవారం వెబ్‌సైట్లో ఉంచారు. అప్పటికి ప్రభుత్వం నుంచి ఆమోదం రానందున వెబ్‌సైట్లో పెట్టవద్దని కొందరు అధికారులు చెప్పినా.. ఉపాధ్యాయుల ఒత్తిడితో సోమవారం మధ్యాహ్నమే ప్రదర్శించారు. అనంతరం ఆమోదం దక్కడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఎస్‌జీటీలకు స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పిస్తూ డీఈఓలు ఈ నెల 16వ తేదీలోపు ఉత్తర్వులు జారీచేయాలి.


మళ్లీ న్యాయస్థానాలకు టీచర్లు!

మకు అన్యాయం చేస్తూ భాషా పండితులకు స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పిస్తున్నారని కొందరు ఎస్‌జీటీలు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసినట్లు సమాచారం. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) లేకుండానే పదోన్నతులు ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని, ప్రక్రియను ఆపాలని మరికొందరు టీచర్లు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసినట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని