హైదరాబాద్‌లో గ్లోబల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయండి

హైదరాబాద్‌లో తమ గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని డెల్టా ఎయిర్‌లైన్స్‌ ప్రతినిధి బృందాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు.

Published : 11 Jun 2024 05:43 IST

డెల్టా ఎయిర్‌లైన్స్‌ ప్రతినిధి బృందంతో  రాష్ట్ర మంత్రులు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి భేటీ

డెల్టా ఎయిర్‌లైన్స్‌ ప్రతినిధులతో రాష్ట్ర మంత్రులు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి, అధికారులు

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో తమ గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని డెల్టా ఎయిర్‌లైన్స్‌ ప్రతినిధి బృందాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు. తెలంగాణలో పెట్టుబడులను పెట్టాల్సిందిగా వారిని ఆహ్వానించారు. మంత్రి డి.శ్రీధర్‌బాబు నేతృత్వంలో ఐటీ, పరిశ్రమల బృందం అట్లాంటాలోని కాన్సులేట్‌ జనరల్‌ కార్యాలయంలో డెల్టా ఎయిర్‌లైన్స్‌తో సమావేశమైంది. ఐటీ, పరిశ్రమల స్థాపనకు హైదరాబాద్‌ ఎంత అనువైన ప్రదేశమనే అంశంపై రాష్ట్ర ప్రతినిధి బృందం వారికి పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించింది. ఆసియా పసిఫిక్‌కు గమ్యస్థానంగా హైదరాబాద్‌ ప్రసిద్ధి చెందిందని, స్నేహపూర్వక పారిశ్రామిక విధానాలు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. ఇవన్నీ డెల్టా ఎయిర్‌లైన్స్‌ డిజిటల్‌ పరివర్తన కొనసాగింపునకు మద్దతుగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ, ఐఐఓటీ, కంప్యూటర్‌ విజన్, తదితర అంశాల్లో ప్రతిభకు తెలంగాణలో అవకాశాలు పుష్కలంగా లభిస్తాయని, రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకారాన్ని అందిస్తుందని తెలిపారు. అట్లాంటా, హైదరాబాద్‌ మధ్య కొత్త నాన్‌స్టాప్‌ ఫ్లైట్‌ను ప్రారంభించాలని ఈ సందర్భంగా కోరారు. సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్, పరిశ్రమలశాఖ స్పెషల్‌ సెక్రటరీ విష్ణువర్ధన్‌రెడ్డి, ఐటీ శాఖ సలహాదారు సాయికృష్ణ, టీఎస్‌ఐఐసీ సీఈఓ మధుసూదన్, డెల్టా ఎయిర్‌లైన్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ నారాయణన్‌ కృష్ణకుమార్, గ్లోబల్‌ టెక్‌ డెలివరీ హెడ్‌ ఏజే రోడ్రిగ్స్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని