శాశ్వత వీసీల నియామకం మరింత ఆలస్యం!

రాష్ట్రంలో ఉన్నత విద్యాశాఖ పరిధిలో ఉన్న 9 విశ్వవిద్యాలయాలకు శాశ్వత ఉపకులపతుల నియామకం మరికొంత ఆలస్యం కానుంది. గత నెల 21వ తేదీతో 10 వర్సిటీల వీసీల పదవీకాలం ముగిసింది.

Published : 11 Jun 2024 05:45 IST

ఇప్పటివరకు ఖరారు కాని అన్వేషణ కమిటీల సమావేశ తేదీలు
ఇన్‌ఛార్జి ఉపకులపతుల పదవీకాలం పొడిగించే అవకాశం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉన్నత విద్యాశాఖ పరిధిలో ఉన్న 9 విశ్వవిద్యాలయాలకు శాశ్వత ఉపకులపతుల నియామకం మరికొంత ఆలస్యం కానుంది. గత నెల 21వ తేదీతో 10 వర్సిటీల వీసీల పదవీకాలం ముగిసింది. ఆ సమయంలో ఎన్నికల నియమావళి అమల్లో ఉండటంతో శాశ్వత ఉపకులపతులను నియమించడం సాధ్యపడలేదు. దీంతో ఐఏఎస్‌ అధికారులను ఇన్‌ఛార్జి వీసీలుగా ప్రభుత్వం నియమించింది. కొత్త వీసీలను నియమించే వరకు లేదా ఈ నెల 15 వరకు.. ఏది ముందైతే అది వర్తిస్తుందని వారి పదవీకాలంపై ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది. 15వ తేదీలోపు కొత్త వీసీలను నియమించకుంటే ఇన్‌ఛార్జుల పదవీకాలం పొడిగిస్తూ మరోసారి ఉత్తర్వులు జారీచేయాల్సి ఉంటుంది. వీసీల ఎంపికకు ముగ్గురు సభ్యులతో కూడిన అన్వేషణ కమిటీలను నియమించి నెల రోజులవుతోంది. ఈ కమిటీలు సమావేశమై ఒక్కో వర్సిటీకి ముగ్గురి పేర్లను ప్రభుత్వానికి సిఫారసు చేయాల్సి ఉంటుంది. ఇందుకు మరో నాలుగు రోజులు మాత్రమే గడువున్నా ఇప్పటివరకు అన్వేషణ కమిటీల సమావేశాల తేదీలే ఖరారు కాలేదు. 

ఆలస్యం ఎందుకంటే?

ఎన్నికల కోడ్‌ ముగిసినందున వెంటనే అన్వేషణ కమిటీల సమావేశాలు నిర్వహించవచ్చు. అయితే వీసీల ఎంపికపై ముఖ్యమంత్రి స్థాయిలో చర్చించి తుది నిర్ణయానికి రాలేదని, అందుకే ప్రక్రియ ఆలస్యమవుతోందని తెలిసింది. మరోవైపు కాకతీయ వర్సిటీకి అన్వేషణ కమిటీని ప్రభుత్వం నియమించలేదు. అది జరగాలంటే ఆ వర్సిటీకి పాలకమండలి (ఈసీ)ని నియమించాలి. అది కూడా పెండింగ్‌లో ఉంది. కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు ఉపకులపతుల ఎంపిక విధానాన్ని రాష్ట్రంలోనూ అమలు చేయాలని కొందరు ఆచార్యులు సూచిస్తున్నారు. ఆయా వర్సిటీలకు ఉపకులపతులను నియమించే ముందు.. ఆశావహుల్లో మెరుగైన అర్హతలున్న ఆచార్యులను ఎంపిక చేసి కమిటీ అధికారులు వారితో చర్చిస్తారు. ఆశావహులు తాము ఎంపికైతే ఏం చేస్తామో ప్రజంటేషన్‌ సైతం ఇస్తారు. ఆ తర్వాత కొత్త వర్సిటీలైతే అయిదుగురు, పాత వాటికైతే ముగ్గురు ఆచార్యుల పేర్ల (ప్యానల్‌)ను కేంద్ర విద్యాశాఖకు ఎంపిక కమిటీ సిఫార్సు చేస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని