Global Rice Summit: బియ్యం ఎగుమతులతో ఉజ్వల భవిష్యత్తు

బియ్యం ఎగుమతుల్లో భారత్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉందని, ప్రస్తుతం ప్రపంచ ఎగుమతుల్లో 45 శాతం వాటా ఉన్న మన దేశం మున్ముందు 70 శాతానికి పైగా వాటాను సాధించే అవకాశం ఉందని భారతీయ బియ్యం ఎగుమతిదారుల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు ప్రేమ్‌గార్గ్‌ తెలిపారు.

Published : 08 Jun 2024 05:19 IST

వరి రైతులకు రెట్టింపు ఆదాయాలొచ్చే అవకాశం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించాలి
ఎగుమతిదారుల సమాఖ్య అధ్యక్షుడు ప్రేమ్‌గార్గ్‌

ఈనాడు, హైదరాబాద్‌: బియ్యం ఎగుమతుల్లో భారత్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉందని, ప్రస్తుతం ప్రపంచ ఎగుమతుల్లో 45 శాతం వాటా ఉన్న మన దేశం మున్ముందు 70 శాతానికి పైగా వాటాను సాధించే అవకాశం ఉందని భారతీయ బియ్యం ఎగుమతిదారుల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు ప్రేమ్‌గార్గ్‌ తెలిపారు. ఎగుమతులను వ్యాపార కోణంలో కాకుండా.. రైతుల ప్రయోజనాల దృష్టితో ఆలోచించి కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత పన్నుల విధానాన్ని సరళీకృతం చేయాలన్నారు. ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు (గ్లోబల్‌ రైస్‌ సమ్మిట్‌) కోసం హైదరాబాద్‌ వచ్చిన ఆయన ‘ఈనాడు’ ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

  •  ప్రపంచంలో అతిపెద్ద ఆహార పంటల ఉత్పత్తిదారుగా భారత్‌ నుంచి ఎగుమతులకు అపార అవకాశాలున్నాయి. వాటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం లేదు. దేశీయ అవసరాలు పోను 30 శాతానికి పైగా అన్ని ఆహార పంటలను విదేశాలకు ఎగుమతి చేస్తే  ఇటు రైతులకు అటు దేశానికి భారీ ఆదాయం వచ్చే వీలుంది. బియ్యం దేశీయ వినియోగం పోను.. మిగిలిన దాంట్లో 40 శాతం ఎగుమతులకు వీలుంది. కానీ, 15 శాతం లోపే ఎగుమతులు జరుగుతున్నాయి. అయినా ప్రపంచంలో భారత్‌ అగ్రస్థానంలో ఉంది. 2023లో ఇక్కడి నుంచి 17 మిలియన్‌ టన్నుల బియ్యం అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, సింగపూర్, కెనడా, బంగ్లాదేశ్, యూఏఈ, ఫిలిప్పీన్స్‌ తదితర 100 దేశాలకు ఎగుమతి అయ్యాయి. తద్వారా మనకు రూ. 70 వేల కోట్ల విలువైన విదేశీ మారకద్రవ్యం లభించింది. 2030 నాటికి 30 మిలియన్‌ టన్నుల బియ్యం ఎగుమతులకు అవకాశం ఉంది. 
  • కేంద్ర ప్రభుత్వ విధానాలు కఠినంగా ఉన్నాయి. బియ్యం ఎగుమతులపై ప్రస్తుతం 20 శాతం మేర సుంకం ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యధికం. చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ వంటి దేశాల్లో ఎగుమతి సుంకం ఉండదు. దీంతో పాటు మన ఎగుమతులకు కస్టమ్స్‌ సమస్యలున్నాయి. స్థిరమైన విధానం లేకపోవడం దీనికి కారణం. ఎగుమతులను ఉచితంగా అనుమతించాలని, లేదా టన్నుకు 80 డాలర్ల స్థిర ఎగుమతి సుంకాన్ని విధించాలని కేంద్రాన్ని కోరుతున్నా స్పందించడం లేదు. ఎగుమతులను తరచూ నిషేధించడం వల్ల వృద్ధి ప్రభావితమవుతోంది. దేశంలో ఏటా రెండు, మూడు పంటలు పండుతున్నాయి. వాటిని ఎగుమతులకు వినియోగించుకునే వెసులుబాటు కలగాలి. రవాణా, హ్యాండ్లింగ్‌ ఛార్జీలు ఏటేటా పెరగడం మాకు భారంగా మారుతోంది. 
  • సాగులో దిగుబడులు తగ్గినప్పుడు నిల్వల వినియోగంపై కేంద్రం దృష్టి సారించాలి. భారీఎత్తున బియ్యం నిల్వలను ప్రజోపయోగంలోకి తేవాలి. అది జరగడం లేదు. ద్రవ్యోల్బణం ఎప్పటికీ ఉంటుంది. ధరలు తగ్గించే విధానాలకు బదులు.. ఎగుమతులను నిషేధించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. 

‘సేంద్రియ’ పంటలకు మంచి డిమాండ్‌

మన దేశం నుంచి ఎగుమతయ్యే బియ్యానికి డిమాండ్‌ పెరుగుతోంది. అమెరికా, యూరప్, మధ్యప్రాచ్య దేశాల్లో మాత్రం ఎరువులు, పురుగుమందులు వాడని బియ్యం కావాలని కోరుతున్నారు. ఇది కొంత ఇబ్బందికరంగా ఉంది. దాదాపు 16 మిలియన్‌ టన్నుల మేరకు ఈ డిమాండ్‌ ఉండగా.. పాకిస్థాన్‌ తదితర దేశాలు ఈ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నాయి. ఈ సమస్య నివారణకు రైతులను చైతన్యవంతులను చేయాలి. సేంద్రియ, ప్రకృతి విధానంలో పండిన పంటలకు ఎగుమతుల్లో అత్యధిక డిమాండ్‌ ఉంటోంది. వాటికి కోరిన ధర లభిస్తుంది. ఈ దిశగా ప్రభుత్వాలు కృషి చేయాలి. ఎగుమతులు పెరిగితే మొదటి ప్రయోజనం అందేది రైతులకే. ఎగుమతి ప్రమాణాలున్న పంటలకు మంచి గిట్టుబాటు ధరలు లభిస్తున్నాయి. వ్యాపారులు పోటీ పడి కొనుగోలు చేస్తున్నారు. రైతులు తామే నేరుగా శుద్ధి, మిల్లింగ్‌ చేసి విక్రయిస్తే వారికి మరింత లాభాలు వస్తాయి.


తెలుగు రాష్ట్రాలు టాప్‌

విదేశాలకు బియ్యం ఎగుమతుల్లో తెలుగు రాష్ట్రాలే ముందంజలో ఉన్నాయి. గత ఏడాది భారత్‌ నుంచి మొత్తం 1.30 కోట్ల టన్నుల సాధారణ బియ్యం ఎగుమతి కాగా.. అందులో తెలుగు రాష్ట్రాల నుంచే 36.16 శాతం (47.45 లక్షల టన్నులు) ఉన్నాయి. వ్యవసాయ, శుద్ధి చేసిన ఆహారోత్పత్తుల మొత్తం ఎగుమతుల్లో సాధారణ, బాస్మతి బియ్యం కలిపి 65 శాతం వరకూ ఉన్నాయి. రైతులకు అవగాహన, మౌలిక వసతులు కల్పిస్తే ఈ రాష్ట్రాల నుంచి ఇంకా ఎగుమతులు పెరిగే అవకాశాలున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని