Telangana roads: రాష్ట్ర రహదారులకు ఇక మంచిరోజులు

రాష్ట్రంలోని పలు రహదారులకు మంచిరోజులు రానున్నాయి. సుమారు 436 కిలోమీటర్ల మేర రాష్ట్ర రహదారులను చక్కదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. టెండర్ల ప్రక్రియ పూర్తికి అధికారులు కసరత్తు చేస్తున్నారు.

Published : 07 Jun 2024 06:14 IST

గతేడాది సీఆర్‌ఐఎఫ్‌ కింద రూ.850 కోట్ల కేటాయింపు
వచ్చే నెలలో పనుల ప్రారంభానికి సర్కారు కసరత్తు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని పలు రహదారులకు మంచిరోజులు రానున్నాయి. సుమారు 436 కిలోమీటర్ల మేర రాష్ట్ర రహదారులను చక్కదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. టెండర్ల ప్రక్రియ పూర్తికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. సెంట్రల్‌ రోడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌(సీఆర్‌ఐఎఫ్‌) కింద కేంద్ర ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి రూ.850 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో గతేడాది అసెంబ్లీ ఎన్నికల హడావుడి ఉండటంతో కేంద్రం నుంచి నిధులు వచ్చినా పనులు ఖరారు చేసేందుకు అవకాశం లేకపోయింది. అయితే, అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉంచారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన కొద్దిరోజులకే లోక్‌సభ ఎన్నికల క్రతువు మొదలు కావడంతో పనుల టెండర్ల ప్రక్రియ పూర్తికి కోడ్‌ అడ్డంకిగా మారింది. లోక్‌సభ ఎన్నికలు పూర్తి కావడంతో టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధికారులకు తాజాగా స్పష్టం చేశారు. నిధులను రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి జిల్లాకు సగటున రూ.20 కోట్ల నుంచి రూ.25 కోట్ల వరకు కేటాయించింది. ఈ నెలాఖరు నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు యోచిస్తున్నారు. ఇప్పటికే దాఖలైన టెండర్లను ఖరారు చేసి.. గుత్తేదారులతో ఒప్పందం చేసుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. వచ్చే నెల మొదటి వారంలో పనులు ప్రారంభించాలని నిర్ణయించారు.

పెట్రోలియం వాటా నిధులు

దేశంలో పెట్రోలు, డీజిల్‌ విక్రయాలపై వచ్చే పన్నుల్లో కొంత మొత్తాన్ని రాష్ట్రాల్లో రహదారుల అభివృద్ధికి సీఆర్‌ఐఎఫ్‌ కింద నిధులు కేటాయించాలని కేంద్రం 2000లో నిర్ణయించింది. కొన్ని నిధులను రాష్ట్రాల్లోని జాతీయ రహదారుల అభివృద్ధికి, మరికొన్నింటిని రాష్ట్ర రహదారుల అభివృద్ధికి కేటాయిస్తుంది. గడిచిన నాలుగేళ్లతో పోలిస్తే గతేడాది తెలంగాణకు కేంద్రం భారీగా రూ.850 కోట్ల నిధులు కేటాయించింది. ఈ పథకం అమలులోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రానికి ఇంత పెద్దమొత్తంలో నిధులివ్వడం ఇదే తొలిసారని అధికారులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని