Train Derailed: పట్టాలు తప్పిన గూడ్సు రైలు

సికింద్రాబాద్‌-గుంటూరు మార్గంలో నల్గొండ జిల్లా దామరచర్ల మండలం విష్ణుపురం స్టేషన్‌ సమీపంలో ఆదివారం గూడ్సు రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.

Published : 27 May 2024 05:29 IST

రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం

విష్ణుపురం వద్ద పట్టాలు తప్పిన గూడ్సు రైలు

దామరచర్ల, న్యూస్‌టుడే: సికింద్రాబాద్‌-గుంటూరు మార్గంలో నల్గొండ జిల్లా దామరచర్ల మండలం విష్ణుపురం స్టేషన్‌ సమీపంలో ఆదివారం గూడ్సు రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. గుంటూరు నుంచి సికింద్రాబాద్‌ వైపు వెళ్తున్న గూడ్సు రైలు రెండు బోగీలు పట్టాలు తప్పి పక్కకు ఒరిగాయి. ఆ సమయంలో రైలు తక్కువ వేగంతో ఉండటంతో డ్రైవర్‌ చాకచక్యంగా బ్రేకులు వేసి రైలును నిలిపివేశారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఈ ఘటన జరగడంతో రైల్వే యంత్రాంగం అప్రమత్తమైంది. సింగిల్‌ ట్రాక్‌ కావడంతో హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని స్థానిక పోలీసుల సహకారంతో జేసీబీలు, క్రేన్లను రప్పించి నాలుగు బోగీలను ట్రాక్‌పై నుంచి తప్పించి రైలును విష్ణుపురం స్టేషన్‌లో ఖాళీగా ఉన్న లైన్‌పైకి రప్పించారు. ట్రాక్‌ సామర్థ్యాన్ని పరిశీలించిన అనంతరం రైళ్ల రాకపోకలను అనుమతించారు. ఈ ఘటనపై రైల్వే ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.

పలురైళ్లు నిలిపివేత.. దారి మళ్లింపు

గూడ్సు రైలు పట్టాలు తప్పడంతో ఈ మార్గంలో నడిచే పలు రైళ్లను అధికారులు దారి మళ్లించారు. కొన్నింటిని ఆయా స్టేషన్లలో నిలిపివేశారు. మిర్యాలగూడ నుంచి మధ్యాహ్నం 2.23కు బయలుదేరాల్సిన శబరి ఎక్స్‌ప్రెస్‌ రాత్రి 8 గంటలకు బయలుదేరింది. సికింద్రాబాద్‌ నుంచి హౌరా వెళ్లే ఫలక్‌నుమా, విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రైలును పగిడిపల్లి, కాజీపేట, వరంగల్, కొండపల్లి మీదుగా విజయవాడకు మళ్లించారు. విజయవాడ నుంచి లింగంపల్లి వెళ్లే రైలు వేళల్లో మార్పులు చేశారు. సికింద్రాబాద్‌ రావాల్సిన నర్సాపూర్‌-నాగర్‌సోల్‌ ఎక్స్‌ప్రెస్‌ గుంటూరులో, జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ పిడుగురాళ్ల స్టేషన్‌లలో 2 గంటల పాటు నిలిచిపోయాయి. విజయవాడ నుంచి లింగంపల్లి వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ను గంట ఆలస్యంగా నడిపారు. ఈరోడ్‌ నుంచి నాందేడ్‌ వెళ్లే వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను గుంటూరులోనే కొంత సమయం నిలిపివేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని