Cybercrime: ఆశతో పెట్టుబడి.. మోసాలకు పట్టుబడి

రూ.వెయ్యి పెడితే రూ.10 వేలు, రూ.లక్ష పెడితే రూ.10 లక్షల లాభం చూపిస్తామంటే ఎవరికైనా ఒకసారి ప్రయత్నిద్దామని ఆశ పుడుతుంది.

Published : 20 May 2024 05:20 IST

అధిక లాభాలంటూ నిలువునా ముంచుతున్న నేరగాళ్లు
షేర్లు, ఫ్రాంచైజీలు, ఉద్యోగాల పేరిట వల
సైబర్‌ మోసాల్లో అత్యధికం ఈ కోవలోవే
ఈనాడు - హైదరాబాద్‌

రూ.వెయ్యి పెడితే రూ.10 వేలు, రూ.లక్ష పెడితే రూ.10 లక్షల లాభం చూపిస్తామంటే ఎవరికైనా ఒకసారి ప్రయత్నిద్దామని ఆశ పుడుతుంది. ఈ ఆశనే తమ పెట్టుబడిగా సైబర్‌ నేరగాళ్లు మాయమాటలతో అమాయకులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ప్రస్తుతం పెట్టుబడి మోసాలు నిత్యకృత్యమయ్యాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న సైబర్‌నేరాల్లో వీటిదే అగ్రస్థానం. పెట్టుబడి మోసాలంటే.. ఊహాతీత వాగ్దానాలతో దోచుకోవడమే. ఇందులో అనేక రకాలున్నాయి. తక్కువ ధరకు వస్తువులు విక్రయిస్తామని, ప్రముఖ సంస్థల ఫ్రాంచైజీలు ఇస్తామని, పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు కల్పిస్తామని, క్రిప్టోకరెన్సీతో రూ.కోట్లు ఆర్జించవచ్చని బురిడీ కొట్టిస్తున్నారు.

స్టాక్‌ ఎక్స్ఛేంజి

ఈరోజుల్లో స్టాక్‌ ఎక్స్ఛేంజి పెట్టుబడులు మామూలయ్యాయి. సాధారణ ఉద్యోగుల నుంచి వ్యాపారుల వరకు ఇదొక ప్రత్యామ్నాయ ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. ఈ తరుణంలోనే సైబర్‌ నేరగాళ్లు తాము స్టాక్‌ బ్రోకర్లమని ఆన్‌లైన్లో ప్రత్యక్షమవుతారు. ఈ రంగంలోకి కొత్తగా ప్రవేశించే వారిని ఆకర్షించి.. ఏ సంస్థ షేర్‌ ధర ఎంత పెరుగుతుందో తమకు తెలుస్తుందని, ఉదయం పెట్టుబడి పెడితే సాయంత్రం వరకు రూ.లక్షలు కళ్లజూడవచ్చని నమ్మిస్తారు. మొదట్లో లాభాలు ఇస్తారు. నకిలీ షేర్లు మన ఖాతాలో ఉన్నట్లు చూపిస్తారు. తరువాత ఐపీవోకు వెళ్లే సంస్థల వివరాలు తమకు ముందే తెలుస్తాయని, వాటిని బ్లాక్‌ చేయించి మీకు కేటాయిస్తామని నమ్మిస్తారు.

ఇందు కోసం ఒక యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటారు. అందులో పేరు, ఖాతా వివరాలు నమోదు చేసి పెట్టుబడి పెట్టగానే భారీగా లాభాలు వచ్చినట్లు కనిపిస్తాయి. తద్వారా మరిన్ని పెట్టుబడులు పెడతారు. తీరా ఆ డబ్బు డ్రా చేసుకుందామంటే మాత్రం వివిధ అడ్డంకులు ఎదురవుతాయి. గట్టిగా అడగటం, తదుపరి పెట్టుబడులను నిరాకరించడం చేయగానే దుకాణం ఎత్తేస్తారు. ఇలా హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి నుంచి రూ.36 లక్షలు కొల్లగొట్టారు. 

ఫారెక్స్‌

వాయిస్‌ ఓవర్‌ ఇంటర్నెట్‌ ప్రొటోకాల్‌(వీఓఐపీ) పద్ధతిలో సైబర్‌ నేరగాళ్ల నుంచి ఫోన్‌ వస్తుంది. ‘ఫారెక్స్‌ (విదేశీ మారకద్రవ్యం) లావాదేవీలు నిర్వహించే సంస్థ నుంచి మాట్లాడుతున్నాం. మా సంస్థలో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయి. అంతర్జాతీయ లావాదేవీలు భారీగా పెరుగుతుండటంతో ద్రవ్య మారకానికి డిమాండు ఎక్కువైంది. అందుకే అధిక కమీషన్‌కు కూడా వెరవకుండా చాలామంది డబ్బు మార్చుకుంటున్నారు. కాబట్టి లాభాలు కూడా ఇబ్బడిముబ్బడిగా వస్తాయి. రూ.లక్ష పెడితే వారం రోజుల్లో రూ.15 వేల వరకూ కమీషన్‌ ముడుతుంది’ అని నమ్మిస్తారు. పెట్టుబడుల కోసం నకిలీ వెబ్‌సైట్లు, బ్యాంకు ఖాతాలు పుట్టిస్తారు. వీటిలో డబ్బులు పెట్టగానే నమ్మకం కలగడం కోసం కొద్దిరోజులు కమీషన్‌ చెల్లిస్తారు. దాంతో ఇంకాస్త ఎక్కువ పెట్టుబడులు పెట్టగానే అంతా ఊడ్చేసి మాయమవుతారు. గచ్చిబౌలికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు ఇలా రూ.73 లక్షలు పోగొట్టుకున్నారు. 

క్రిప్టోకరెన్సీ

ఇప్పుడు క్రిప్టోకరెన్సీ వ్యాపారం ప్రాచుర్యం పొందింది. అధిక లాభాలు వస్తాయని ఆశపడి రూ.లక్షలు పోగొట్టుకుంటున్నారు. వాట్సప్, టెలిగ్రామ్‌ల ద్వారా నేరగాళ్లు ఫోన్లు చేస్తారు. క్రిప్టోలో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మిస్తారు. కొంత పెట్టగానే వెంటనే లాభాలు చూపిస్తారు. ఇలా నమ్మకం కలిగిన తర్వాత మరింత మొత్తం పెట్టిస్తారు. కాని ఆ డబ్బును ఉపసంహరించునే అవకాశం మాత్రం ఇవ్వరు. వీరి మాయలో పడి కాప్రా ప్రాంతానికి చెందిన ఒక ఐటీ ఉద్యోగి రూ.76 లక్షలు నష్టపోయారు. 

ఫ్రాంచైజీ

ఇప్పుడు చాలా వాణిజ్య సంస్థలు ఫ్రాంచైజీలు(గొలుసు దుకాణాలు) ఇస్తున్నాయి. అంటే బాగా పేరుపొందిన సంస్థ తమ పేరుపై దుకాణం నడుపుకొనేందుకు అనుమతులు విక్రయించడం. ఇందులో హోటళ్ల నుంచి క్షౌరశాలల వరకు చాలా ఉన్నాయి. సైబర్‌ నేరగాళ్లు తాము ఫలానా సంస్థ ప్రతినిధులమని అంతర్జాలం ద్వారా ప్రచారం చేసుకుంటారు. ఆసక్తి ఉన్న వారు సంప్రదించగానే ఫ్రాంచైజీ ఇస్తామని, సంబంధిత పత్రాలు పంపిస్తారు. డబ్బు చెల్లించగానే ఉడాయిస్తారు. కేఎఫ్‌సీ ఫ్రాంచైజీ ఇప్పిస్తామని హైదరాబాద్‌లోని ఒక వ్యక్తి నుంచి ఇలా రూ.26.27 లక్షలు ఊడ్చేశారు. గ్యాస్‌ డీలర్‌షిప్‌ ఇస్తామని మరో మహిళ నుంచి రూ.45 లక్షలు దోచుకున్నారు. 

వెబ్‌సైట్‌ ఆధారిత మోసాలు

ఫోన్‌కాల్స్‌తో పాటు సైబర్‌ మోసగాళ్లకు ప్రధాన అడ్డా ఇంటర్‌నెట్‌. ఏదో సమాచారం కోసం వెతుకుతున్నప్పుడు అకస్మాత్తుగా ఒక పాప్‌అప్‌ మెనూ వస్తుంది. ఫలానా కంపెనీకి చెందిన ఖరీదైన ఫోన్లు క్లియరెన్స్‌ సేల్‌లో అతితక్కువ ధరకే అమ్ముతున్నామని, టోకుగా కొనుగోలు చేస్తే ఇంకాస్త చౌకగా ఇస్తామని అందులో ఉంటుంది. దానికి ఆశపడి క్లిక్‌ చేస్తే ఫోన్ల ఫొటోలు, వీడియోలు, గతంలో కొన్న వినియోగదారుల కామెంట్లు కూడా కనిపిస్తాయి. నిజమేనని నమ్మి డబ్బు చెల్లిస్తే ఇక ఇంతే సంగతులు. ఒక ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థకు హైదరాబాద్‌లో సీఈవోగా పనిచేస్తున్న మహిళ తన సిబ్బందికి ప్రోత్సాహకంగా ఇవ్వాలన్న ఉద్దేశంలో ఇలాంటి ఫోన్ల కోసం రూ.20 లక్షలు చెల్లించారు. ఎంతకీ సరకు డెలివరీ కాకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు.


పోంజీ స్కామ్‌

వాట్సప్‌ కాల్‌ వస్తుంది. తమకు స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థ ఉందని, ఫలానా సంస్థలో సభ్యత్వం తీసుకొని మరో పది మందిని చేర్పిస్తే కమీషన్‌ దండిగా ముడుతుందని నమ్మిస్తారు. మొదట్లో చేరిన వారికి భారీగానే లాభాలు ఇస్తారు. వీరిని చూపించి మిగతా జనం మీద వల విసురుతారు. చేరినవారు తమ పైవారికి వస్తున్న లాభాలు చూపి మరింత మందిని చేర్చుతారు. భారీగా వసూళ్లయిన తర్వాత నేరగాళ్లు మాయమవుతారు.


పార్ట్‌టైమ్‌ జాబ్‌

తరహా మోసాల్లో పార్ట్‌టైమ్‌ జాబ్‌ల పేరుతో చేసేవే అధికం. ప్రముఖ సంస్థల్లో పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు ఉన్నాయని సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయం చేసుకుంటారు. నమ్మి వచ్చిన నిరుద్యోగులకు నకిలీ నియామక పత్రాలు కూడా ఇస్తారు. మొదట్లో గూగుల్‌ మ్యాపుల్లో కనిపించే వాణిజ్య సంస్థలకు రేటింగ్‌ ఇచ్చే, రివ్యూలు రాస్తే డబ్బు ఇస్తామంటారు. చెప్పినట్లే కొంత డబ్బు ఇచ్చి నమ్మకం కలిగిస్తారు. ఆ తర్వాత కొంత డిపాజిట్‌ చెల్లిస్తే మీకు చాలా కొత్త ప్రాజెక్టులు కేటాయిస్తామంటారు. దీంతో చాలామంది ఆశపడి డబ్బులు కడుతుంటారు. తరువాత కమీషన్‌ వచ్చినట్లు చూపిస్తారు కానీ దాన్ని ఖాతాలో జమ చేయరు. డబ్బులు కనిపిస్తున్నాయని కొత్త ఎసైన్‌మెంట్ల కోసం మరిన్ని డిపాజిట్లు చెల్లిస్తూ రూ.లక్షల్లో మోసపోతున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి ఇలా రూ.84.9 లక్షలు పోగొట్టుకున్నారు. 


ప్రకటనలకు ఆకర్షితులు కావొద్దు

ప్పుడు జరుగుతున్న అన్ని రకాల సైబర్‌ నేరాల్లో అగ్రస్థానం పెట్టుబడికి సంబంధించినవే. టెలిగ్రాం, వాట్సప్‌ గ్రూపుల ద్వారా నేరగాళ్లు తమ ప్రకటనలతో ఆకట్టుకుంటారు. వీటికి ఆశపడి వారితో సంప్రదింపులు మొదలుపెడితే ఇక అంతే సంగతి. వారు చూపించే లాభాలు, షేర్లు అన్నీ కంప్యూటర్‌ మీద కనిపిస్తాయంతే. డ్రా చేసుకునే అవకాశం ఇవ్వరు. లాభాలు డ్రా చేసుకోవాలంటే పన్నులు కట్టాలని మరింత వసూలు చేస్తారు. బాధితుడు తాను మోసపోయానని గ్రహించి, ఇక పెట్టుబడులు పెట్టేందుకు నిరాకరించే వరకూ ఈ మోసం కొనసాగుతుంది. రాష్ట్రంలో ఇలాంటి నేరాల ద్వారా రోజూ రూ.2 కోట్ల వరకు పోగొట్టుకుంటున్నారు. షేర్లు కొనుగోలు చేయాలంటే ఆయా సంస్థల అసలు వెబ్‌సైట్ల ద్వారా మాత్రమే వివరాలు తెలుసుకోవాలి. 

 శిఖాగోయల్, డైరెక్టర్, రాష్ట్ర సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో 


  • గతేడాది జూన్‌లో ప్రారంభమైన టీఎస్‌ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరోకు ఇప్పటి వరకు వచ్చిన కేసులు 20,810
  • బాధితులు నష్టపోయిన మొత్తం రూ.582,20,93,664 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని