Hyderabad News: థియేటర్లో ఉక్కపోత.. ముక్త ఏ2 సినిమాస్‌కు జరిమానా

ప్రేక్షకుడు హాయిగా సినిమా చూసే వాతావరణం కల్పించకుండా ఇబ్బంది పెట్టిన ముక్త ఏ2 సినిమాస్‌కు హైదరాబాద్‌ వినియోగదారుల కమిషన్‌-2 జరిమానా విధించింది.

Published : 27 May 2024 05:59 IST

ఈనాడు, హైదరాబాద్‌: ప్రేక్షకుడు హాయిగా సినిమా చూసే వాతావరణం కల్పించకుండా ఇబ్బంది పెట్టిన ముక్త ఏ2 సినిమాస్‌కు హైదరాబాద్‌ వినియోగదారుల కమిషన్‌-2 జరిమానా విధించింది. టికెట్‌ డబ్బులు రిఫండ్‌ చేయడంతో పాటు ఫిర్యాదిదారు వేదనకు పరిహారంగా రూ.3 వేలు, కేసు ఖర్చుల నిమిత్తం వెయ్యి రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ ప్రాంతం ఆనంద్‌నగర్‌కు చెందిన నేరోళ్ల నిష్పర్‌ ఫిర్యాదును విచారించిన కమిషన్‌ ఈ మేరకు ఇటీవల తీర్పు వెలువరించింది. ‘కిసీ కా భాయ్‌.. కిసీ కా జాన్‌’ సినిమా చూసేందుకు ఫిర్యాదిదారు నిష్పర్‌ 2023 ఏప్రిల్‌ 28న అబిడ్స్‌లోని ‘ముక్త ఏ2 సినిమాస్‌’ థియేటర్‌కు వెళ్లారు. తన ద్విచక్రవాహనాన్ని అక్కడ పార్క్‌ చేసినందుకు రూ.20 రుసుము, సినిమా టికెట్‌కు రూ.150 వెచ్చించారు. సినిమా ప్రారంభమైనా థియేటర్‌లో ఏసీ పనిచేయకపోవడం, ఏర్పాటు చేసిన కొన్ని ఫ్యాన్లతో గాలి అంతంతమాత్రంగానే వస్తుండటంతో తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఇంటర్వెల్‌ సమయంలో యాజమాన్యాన్ని ప్రశ్నించినా సరిగా స్పందించలేదు. పైగా అక్కడి సిబ్బంది దుర్భాషలాడి దురుసుగా ప్రవర్తించడంతో ఫిర్యాదిదారు వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. గోల్డ్‌ క్లాస్‌ సీట్‌లోనూ ఏసీ ఏర్పాటు చేయలేదని పేర్కొన్నారు. తెలంగాణ సినిమాస్‌(రెగ్యులేషన్‌) చట్టం- 1955 ప్రకారం రూ.110 ఉండాల్సిన టికెట్‌ ధరను రూ.150కు పెంచి అమ్ముతున్నారని ఆరోపించారు. నోటీసులు అందుకున్న ప్రతివాద థియేటర్‌ యాజమాన్యం ఫిర్యాదుదారు ఆరోపణలన్నీ నిరాధారమైనవని తెలిపింది. ఇరువర్గాల వాదనలు, సాక్ష్యాధారాలు పరిశీలించిన అనంతరం కమిషన్‌-2 తీర్పు వెలువరిస్తూ అమలుకు 45 రోజుల గడువు విధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని