Southwest Monsoon: ‘నైరుతి’ ప్రయాణం మొదలైంది..

భారతదేశ వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు జీవనాడి అయిన నైరుతి రుతుపవనాలు ఆదివారం దేశంలోని నికోబార్‌ దీవులపైకి ప్రవేశించాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) తెలిపింది.

Updated : 20 May 2024 07:53 IST

దేశంలో తొలిగా నికోబార్, అండమాన్‌ దీవులను తాకిన రుతుపవనాలు
ఈ నెల 31న కేరళ తీరానికి..
సాధారణాన్ని మించి వర్షాలకు పలు సానుకూలతలు
భారత వాతావరణ విభాగం వెల్లడి 

ఈనాడు, హైదరాబాద్, దిల్లీ: భారతదేశ వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు జీవనాడి అయిన నైరుతి రుతుపవనాలు ఆదివారం దేశంలోని నికోబార్‌ దీవులపైకి ప్రవేశించాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) తెలిపింది. ఇవి ఈ నెల 31 వరకు కేరళ తీరాన్ని తాకుతాయని అంచనా వేస్తున్నట్లు వెల్లడించింది. నికోబార్‌ దీవులు సహా మాల్దీవులు, దక్షిణ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్‌ సముద్రంలో కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు చేరుకున్నాయని పేర్కొంది. లానినా అనుకూల పరిస్థితులు, భూమధ్యరేఖ వద్ద పసిఫిక్‌ మహాసముద్రం చల్లబడడం ఆగస్టు-సెప్టెంబరు నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున ఈ రుతుపవనాల సీజన్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షం కురుస్తుందని గత నెలలో ఐఎండీ అంచనా వేసింది. వాయవ్య, తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. 1951 నుంచి 2023 వరకు ఎల్‌నినో తర్వాత లానినా వచ్చిన సందర్భాల్లో భారత్‌లో తొమ్మిదిసార్లు మంచి వర్షాలు కురిశాయని తెలిపింది. అందుకు అనుగుణంగానే ఈ ఏడాది రుతుపవనాల కదలిక ఉందని వివరించింది. ఇప్పటివరకు దేశంలోని చాలా ప్రాంతాలు తీవ్ర వడగాలులతో సతమతమయ్యాయి. అనేక రాష్ట్రాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత 48 డిగ్రీల సెల్సియస్‌ను దాటింది. ఐఎండీ ప్రకారం కేరళలో రుతుపవనాలు ప్రవేశించే సమయం గత 150 సంవత్సరాలుగా మారుతూనే ఉంది. అత్యంత తొందరగా 1918లో మే 11న.. అత్యంత ఆలస్యంగా 1972లో జూన్‌ 18న ప్రవేశించాయి. ఇక గతేడాది జూన్‌ 8న, 2022లో మే 29న, 2021లో జూన్‌ 3న, 2020లో జూన్‌ 1న కేరళ తీరాన్ని తాకాయి. 


రాష్ట్రంలో నేడు, రేపు తేలికపాటి వర్షాలు

తెలంగాణలో సోమ, మంగళవారాల్లో కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. అలాగే ఆదివారం వరంగల్‌ జిల్లాలో వర్షాలు కురిశాయి. ఇక్కడి నల్లబెల్లి మండలం మేడపల్లిలో 10.4 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. నర్సంపేట మండలం లక్నేపల్లిలో 5.2, సంగారెడ్డి జిల్లా అందోలు మండలం అన్నాసాగర్‌లో 4.7, యాదాద్రి జిల్లా భువనగిరిలో 4.6, ములుగు జిల్లా కాశిందేవ్‌పేటలో 4.3, మెదక్‌ జిల్లా కౌడిపల్లిలో 4.3 సెం.మీ. వర్షం కురిసింది. ఖమ్మం, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, కరీంనగర్, జోగులాంబ గద్వాల జిల్లాల్లోని పలు మండలాల్లోనూ వర్షాలు నమోదయ్యాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు