Regional Ring Road: రీజినల్‌ రింగు రోడ్డు.. డంబెల్‌ ఆకారంలో ఇంటర్‌ఛేంజ్‌లు

ప్రాంతీయ రింగు రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) పరిధిలో సేకరించాల్సిన భూవిస్తీర్ణం పెరగనుంది. హైదరాబాద్‌ అవుటర్‌ రింగు రోడ్డు(ఓఆర్‌ఆర్‌) ఆవల నుంచి ఉత్తర, దక్షిణ భాగాలుగా ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణం చేపట్టనున్న విషయం తెలిసిందే.

Updated : 28 May 2024 11:40 IST

ఉత్తర, దక్షిణ భాగాల అనుసంధానానికి జంక్షన్లు
పెరగనున్న భూసేకరణ విస్తీర్ణం
ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణానికి వేగంగా కసరత్తు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రాంతీయ రింగు రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) పరిధిలో సేకరించాల్సిన భూవిస్తీర్ణం పెరగనుంది. హైదరాబాద్‌ అవుటర్‌ రింగు రోడ్డు(ఓఆర్‌ఆర్‌) ఆవల నుంచి ఉత్తర, దక్షిణ భాగాలుగా ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణం చేపట్టనున్న విషయం తెలిసిందే. ఈ రెండు భాగాల అనుసంధాన ప్రాంతా(ఇంటర్‌ఛేంజ్‌)లను వినూత్నంగా నిర్మించాలని జాతీయ రహదారుల సంస్థ నిర్ణయించింది. అందుకోసం రహదారి ప్రణాళికలో మార్పులు సైతం చేసింది. తాజా మార్పుతో మరింత భూమి సేకరించాల్సి వస్తుందని అధికారులు అంచనాలు రూపొందించారు. 158.65 కిలోమీటర్ల మేర నిర్మించనున్న రహదారి ఉత్తర భాగానికి  కేంద్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ పథకం కింద నిధులు కేటాయిస్తారో ప్రకటిస్తారు. ఈలోగా నిర్మాణం ప్రారంభానికి ముందు చేపట్టాల్సిన పనులు పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. ఆర్‌ఆర్‌ఆర్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రంలోని గత భారాస సర్కారుకు మధ్య కొన్ని అంశాల్లో ఏకాభిప్రాయం కుదరకపోవటంతో నిర్మాణ కసరత్తుకు సంబంధించిన పనులు కొంతమేరకు అటకెక్కాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక.. ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణం తమకు ప్రాధాన్య అంశమని ప్రభుత్వం ప్రకటించింది. ఆర్‌ఆర్‌ఆర్‌ ఆధారంగా విస్తృతస్థాయిలో అభివృద్ధి చేస్తామనీ పేర్కొంది. రహదారి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వపరంగా ఇవ్వాల్సిన అనుమతులు, భూసేకరణ వ్యయ వాటా నిధుల విడుదల విషయంలో సంసిద్ధంగా ఉన్నట్లు కేంద్రానికి లిఖితపూర్వకంగా తెలియజేయడంతో కసరత్తు వేగం పుంజుకుంది.

మరో 71.23 హెక్టార్ల భూసేకరణ!

ప్రాంతీయ రింగు రోడ్డు నిర్మాణం కోసం తొలుత 1,879.05 హెక్టార్ల మేరకు భూసేకరణ చేపట్టాలని నిర్ణయించారు. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి-భువనగిరి జిల్లాల మీదుగా ఈ మార్గాన్ని నిర్మించనున్నారు. ఉత్తర-దక్షిణ భాగాలు అనుసంధానం అయ్యే ప్రాంతాల్లో వినూత్న రీతిలో జంక్షన్లు నిర్మించాలని నిర్ణయించారు. హైదరాబాద్‌-విజయవాడ రహదారిలో భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో ఒకటి, హైదరాబాద్‌-ముంబయి మార్గంలో సంగారెడ్డి జిల్లాలో మరొక జంక్షన్‌ నిర్మించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని