Uttamkumar Reddy: మేడిగడ్డకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు

కాళేశ్వరం ఎత్తిపోతల్లోని ప్రధాన బ్యారేజీ మేడిగడ్డ మరమ్మతులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఆదేశించారు.

Published : 24 May 2024 04:24 IST

రోజువారీ పనుల పురోగతిపై నివేదికలు ఇవ్వాలి  
నిర్మాణ సంస్థ, నీటిపారుదల శాఖకు మంత్రి ఉత్తమ్‌ ఆదేశం  
వచ్చే వారం బ్యారేజీ   పరిశీలనకు సీఎం రేవంత్‌రెడ్డి 

సమీక్ష నిర్వహిస్తున్న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. 

చిత్రంలో ఆ శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ తదితరులు 

ఈనాడు, హైదరాబాద్‌: కాళేశ్వరం ఎత్తిపోతల్లోని ప్రధాన బ్యారేజీ మేడిగడ్డ మరమ్మతులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఆదేశించారు. గురువారం హైదరాబాద్‌లోని సచివాలయంలో నిర్మాణ సంస్థ ప్రతినిధులు, నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్, ఈఎన్సీ అనిల్‌కుమార్, సీడబ్ల్యూసీ ఇంజినీరు,్ల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. మేడిగడ్డ పునరుద్ధరణ పనులపై ఇటీవల జాతీయ ఆనకట్టల భద్రత పర్యవేక్షణ సంస్థ (ఎన్డీఎస్‌ఏ) ప్రభుత్వానికి అందజేసిన మధ్యంతర నివేదిక మేరకు పనులు కొనసాగించాలన్నారు. వర్షాలు వచ్చేలోగా తీసుకోవాల్సిన పరిరక్షణ చర్యల్లో భాగంగా బ్యారేజీ వద్ద తాత్కాలిక పనులను పూర్తి చేయాలని సూచించారు. మేడిగడ్డ పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని, అన్నారం, సుందిళ్ల వద్ద పనులనూ చేపట్టాలన్నారు. వాటి పురోగతిపై ఎప్పటికప్పుడు నివేదికలు అందించాలని, రోజువారీ పురోగతిని సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. వచ్చేవారం మేడిగడ్డ బ్యారేజీని సీఎం రేవంత్‌రెడ్డి సందర్శించనున్నారు. పర్యటన తేదీలను నీటిపారుదల శాఖ నాలుగు రోజుల్లో ఖరారు చేయనున్నట్లు తెలిసింది. 


జేఎన్‌టీయూ, నిట్‌ నిపుణులతో కమిటీ ఏర్పాటు 

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణకు సూచనలు, సలహాలు అందించేందుకు వివిధ రంగాలకు చెందిన నిపుణులతో కూడిన ఒక కమిటీని నీటిపారుదల శాఖ ఏర్పాటు చేసింది. కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్‌ ఆదేశాల ప్రకారం ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ నీటిపారుదల శాఖ ఈఎన్సీ అనిల్‌కుమార్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నీటిపారుదల శాఖ విశ్రాంత సీఈ కె.శ్రీకాంత్‌ కన్వీనర్‌గా మరో నలుగురు సభ్యులను కమిటీలో నియమించారు. నిట్‌ విశ్రాంత ఆచార్యుడు సీబీ కామేశ్వర్‌రావు (సివిల్‌), విశ్రాంత సీఈ కె.సత్యనారాయణ (మెకానికల్‌), వరంగల్‌ నిట్‌ ఆచార్యుడు రమణమూర్తి (జియో టెక్నికల్‌), హైదరాబాద్‌ ఐఐటీ ఆచార్యుడు టి.శశిధర్‌ (హైడ్రాలజీ- ప్లానింగ్‌) సభ్యులుగా ఉన్నారు. మూడు బ్యారేజీలను సందర్శించి, సమగ్ర అధ్యయనం చేశాక కమిషన్‌కు ఈ కమిటీ నివేదిక అందిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని