Kaleshwaram Project: అణువణువూ జల్లెడ పట్టాల్సిందే!

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ప్లానింగ్‌ మొదలు... కుంగడం, సీపేజీలు ఏర్పడటం వరకు సమగ్ర వివరాలను వెంటనే అందజేయాలని సంబంధిత ఇంజినీర్లను నీటిపారుదల శాఖ ఆదేశించింది.

Published : 22 May 2024 05:28 IST

‘కాళేశ్వరం’పై అన్ని కోణాల్లో వివరాలివ్వండి  
ఈనెల 25లోగా సమగ్ర నివేదిక సమర్పించాల్సిందే
ఇంజినీర్లకు నీటిపారుదల శాఖ కార్యదర్శి ఆదేశం 
ఏ ఒక్క అంశాన్నీ దాచొద్దని సమీక్షలో సీఎం స్పష్టీకరణ 
తదనుగుణంగా విచారణ కమిషన్‌కు నివేదించేందుకు అడుగులు
ఈనాడు - హైదరాబాద్‌

మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్‌లో గేట్ల వద్ద కొనసాగుతున్న ఇసుక తొలగింపు పనులు

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ప్లానింగ్‌ మొదలు... కుంగడం, సీపేజీలు ఏర్పడటం వరకు సమగ్ర వివరాలను వెంటనే అందజేయాలని సంబంధిత ఇంజినీర్లను నీటిపారుదల శాఖ ఆదేశించింది. బ్యారేజీల నిర్మాణ స్థలానికి సంబంధించి మొదట ఇచ్చిన ఆమోదం, తర్వాత జరిగిన మార్పు, ఈ మార్పులకు ఆమోదం తెలిపిందెవరు, మూడు నిర్మాణాలను బ్యారేజీలుగా చేపట్టారా లేక డ్యాములుగానా, మూడింటికీ ఒకే రకమైన డిజైన్లు అమలు చేశారా, పనులు ప్రారంభించకముందే సమగ్ర అధ్యయనం చేశారా... ఇలా అనేక అంశాలకు సంబంధించిన వివరాలను కోరింది. డిజైన్లు, నిర్మాణం, నాణ్యత తనిఖీ, అధికార, అనధికార ఉప గుత్తేదారులు, ఆపరేషన్స్‌ అండ్‌ మెయింటెనెన్స్, గుత్తేదారులకు కలిగిన అయాచిత లబ్ధి, పని పూర్తికాకుండానే సర్టిఫికెట్లు ఇవ్వడం... ఇలా అనేక అంశాలపై డాక్యుమెంట్లను కోరింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ (జనరల్‌), ఆపరేషన్స్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్, కాళేశ్వరం (రామగుండం), సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌ (సీడీవో), క్వాలిటీ కంట్రోల్‌ చీఫ్‌ ఇంజినీర్లకు ఆ శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా ఆదేశాలు జారీ చేశారు. అత్యవసరంగా భావించి వివరాలను ఈ నెల 25వ తేదీలోగా అందజేయాలని స్పష్టం చేశారు. కాళేశ్వరంపై న్యాయ విచారణ చేపట్టిన జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌కు సమర్పించడానికి వీలుగా ఈ దస్త్రాలన్నీ ఇవ్వాలని కోరారు.ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి మేడిగడ్డపై సమీక్షించిన సందర్భంగా మొత్తం రికార్డులన్నీ కమిషన్‌కు అందజేయాలని, కొన్ని డాక్యుమెంట్లను ఇవ్వకుండా పక్కనపెట్టే అవకాశముందని పేర్కొన్న నేపథ్యంలో కార్యదర్శి ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇంజినీర్ల నుంచి కోరిన డాక్యుమెంట్లలో ముఖ్యమైనవి ఇలా ఉన్నాయి... 

  • కాళేశ్వరం ప్రాజెక్టు ఎలా ప్రారంభమైంది? దీనికి సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు ఏమున్నాయి? ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ప్రతిపాదనను పక్కనపెట్టి కాళేశ్వరం ఎందుకు చేపట్టాల్సి వచ్చింది? 2015 జనవరి 21న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం నియమితులైన విశ్రాంత ఇంజినీర్ల కమిటీ ఇచ్చిన నివేదిక ఏమైంది? ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును కాదని కాళేశ్వరం చేపట్టినప్పుడు ఎలాంటి ప్రయోజనాలుంటాయని అంచనా వేశారు? ఈ రెండింటి ఖర్చు, ప్రయోజనానికి సంబంధించిన నివేదికలు. 
  • మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డీపీఆర్‌లు, వాటి సమగ్ర ఇన్వెస్టిగేషన్‌ రిపోర్టులు. 
  • బ్యారేజీల నిర్మాణ స్థలాలను మార్చడం నిబంధనల ప్రకారమే జరిగిందా? ఇలా మార్చడానికి ఎవరు ఆమోదం తెలిపారు? ఒరిజినల్‌ డీపీఆర్‌ ప్రకారం కాకుండా మార్చడానికి కారణాలేంటి? సంబంధిత నివేదికలు. ఈ మూడు స్ట్రక్చర్లను ఎలా డిజైన్‌ చేశారు... బ్యారేజీలుగానా లేదా డ్యాములు గానా..? బ్యారేజీలుగా డిజైన్‌ చేసి ఉంటే ఏయే పరీక్షలు చేశారు? ఐ.ఎస్‌.కోడ్లు, బ్యారేజీల మాన్యువల్స్‌ ప్రకారం ఏమేం చేశారు? డ్యాములుగా డిజైన్‌ చేసి ఉంటే ఏమేం పరీక్షలు చేశారు? వాటి వివరాలు... 
  • మేడిగడ్డ నిర్మాణ ప్రాంతంలో బొగ్గు నిక్షేపాలున్నాయనే అంచనాలు నిజమా, కాదా? 
  • మూడు బ్యారేజీలు/డ్యాముల్లోనూ భారీగా నీటిని నిల్వ చేసినందున అందుకు తగ్గట్లుగా డిజైన్‌ అంశాలను పరిగణనలోకి తీసుకున్నారా? సీడీవో ఇంజినీర్లు నిర్మాణ ప్రాంతాలను పరిశీలించాక డిజైన్లు ఇచ్చారా లేదా ఫీల్డ్‌ ఇంజినీర్లు ఇచ్చిన డేటా ఆధారంతోనా...? బ్యారేజీల డిజైన్లలో ఏజెన్సీల పాత్ర ఏమిటి? ప్రత్యేకించి మేడిగడ్డ డిజైన్ల ఖరారులో ఎల్‌అండ్‌టీ పాత్ర ఏమిటి? బ్యారేజీల నిర్మాణ సమయంలో షీట్‌పైల్స్‌కు బదులు సీకెంట్‌ పైల్స్‌ వాడటంలో సీడీవో చీఫ్‌ ఇంజినీర్‌ సిఫార్సులేంటి? 
  • మూడు బ్యారేజీలను గోదావరిపై వరుసగా నిర్మించినందున ఒకేరకమైన డిజైన్లు అమలు చేశారా లేక ఏమైనా మార్పులున్నాయా? ఒకవేళ వేర్వేరు డిజైన్లు ఉంటే కారణమేంటి? సీడీవో ఆమోదించిన డిజైన్‌ ప్రకారమే నిర్మించారా, ఐఎస్‌ కోడ్‌ ప్రకారమా... ఆచరణలో ఉన్న డిజైన్‌ మాన్యువల్‌ ప్రకారమే చేశారా? 
  • డిజైన్ల ఖరారులో గరిష్ఠ వరద ప్రవాహాన్ని పరిగణనలోకి తీసుకొన్నారా? షూటింగ్‌ వెలాసిటీ, ఆప్రాన్‌ పొడవు, మందం సరిగా డిజైన్‌ చేయలేదనే ఆరోపణలున్నాయి కదా... బ్యారేజీల నిర్మాణంలో మీరు అవలంబించిన నిబంధనలను ఎలా సమర్థించుకొంటారు? ఎంత వరదకు డిజైన్‌ చేశారు? జియో టెక్నికల్, జియో ఫిజికల్‌ ఇన్వెస్టిగేషన్స్, బ్యారేజీ స్ట్టెబిలిటీ, కట్‌ ఆఫ్స్‌ డిజైన్, ఆర్‌సీసీ రాఫ్ట్, పియర్స్‌ డిజైన్‌ల వివరాలు... 
  • మూడు బ్యారేజీల ఒప్పందాలు, గుత్తేదారుల వివరాలు, టెండర్ల ఆమోదానికి సంబంధించిన మినిట్స్, పనుల అప్పగింతకు సంబంధించిన వివరాలు, అధికార, అనధికార ఉప గుత్తేదారుల వివరాలు, అనుబంధ ఒప్పందాలు, గడువు పొడిగింపు వివరాలు, లిక్విడేట్‌ డ్యామేజెస్‌ ఉంటే వాటి వివరాలు, లాగ్‌ బుక్స్, సర్వే వివరాలు, నిర్మాణ, క్వాలిటీ కంట్రోల్‌ విభాగం ఉన్నత స్థాయి ఇంజినీర్ల తనిఖీల నివేదికలు, నిర్మాణంలో మార్పులు, రాష్ట్రస్థాయి స్టాండింగ్‌ కమిటీ, ప్రభుత్వ స్థాయిలో ఆమోదానికి సంబంధించిన రికార్డులు, గుత్తేదారుల పేమెంట్‌ వివరాలు, కాగ్‌ సిఫార్సులు, మూడు బ్యారేజీల క్లియరెన్స్‌కు సంబంధించిన డాక్యుమెంట్లు...  
  • బ్యారేజీల వారీగా గుత్తేదారుల అర్హతలు, ప్రాజెక్టు ఎస్‌ఈ, కమిషనరేట్‌ ఆఫ్‌ టెండర్స్‌ (సీఓటీ) మినిట్స్‌ వివరాలు... 
  • నిర్మాణానికి సంబంధించిన నిధుల వివరాలు, ఎఫ్‌.ఆర్‌.బి.ఎం. నిబంధనలకు విరుద్ధంగా అప్పటి ప్రభుత్వం ఆమోదించి ఉంటే వివరాలు, ప్రభుత్వ ఖజానాపై భారానికి సంబంధించిన వివరాలు... 
  • ఒప్పందంలోని నిబంధనల ప్రకారం ఆపరేషన్స్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ జరిగిందా..? డ్యాం సేఫ్టీ యాక్ట్‌ ప్రకారం ఆపరేషన్‌ ప్రొటోకాల్‌ పాటించారా, 2020లో వరద తర్వాత బ్యారేజీలకు జరిగిన నష్టాన్ని గుర్తించినప్పుడు నీటిపారుదల శాఖ, ఓ అండ్‌ ఎం విభాగం గుర్తించిన అంశాలేంటి? నిర్వహణలో గేట్స్‌ ప్రొటోకాల్‌ పాటించారా, బ్యారేజీలు వైఫల్యం చెందడానికి కారణాలతో నివేదిక... 
  • క్వాలిటీ కంట్రోల్‌ విభాగం పరిశీలనలో గుర్తించిన అంశాలు, చేసిన సిఫార్సుల వివరాలు. మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో సీపేజీలపై క్వాలిటీ కంట్రోల్‌ చీఫ్‌ ఇంజినీర్‌ నుంచి సమగ్ర నివేదిక. 
  • గుత్తేదారులకు అయాచిత ప్రయోజనాలు, ఇందుకు సంబంధించి రాష్ట్ర స్థాయి స్టాండింగ్‌ కమిటీ సిఫార్సులు, ప్రభుత్వ ఆమోదాల వివరాలు. 
  • పనులు పూర్తయినట్లు ఇచ్చిన సర్టిఫికెట్లు, ఒప్పందంలోని నిబంధనల వివరాలు. పని జరుగుతుండగానే, ఒప్పందం గడువు ఉండగానే పని పూర్తయినట్లు సర్టిఫికెట్లు ఇస్తే సంబంధిత వివరాలు. బాధ్యులైన అధికారులపై తీసుకున్న చర్యలు. ఒప్పందానికి భిన్నంగా ముందుగానే బ్యాంకు గ్యారంటీలు వెనక్కి ఇచ్చి ఉంటే అందుకు సంబంధించిన వివరాలు

మేడిగడ్డలో మరిన్ని గేట్లు ఎత్తడానికి సన్నాహాలు

మహదేవపూర్, న్యూస్‌టుడే: మేడిగడ్డ బ్యారేజీ తాత్కాలిక మరమ్మతుల్లో భాగంగా మరిన్ని పనులు చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కుంగిన ఏడో బ్లాక్‌లో మొత్తం 11 గేట్లు ఉండగా ఎనిమిది మూసి ఉన్నాయి. శుక్రవారం 15వ గేటును ఎత్తగా, మిగిలిన ఏడింటిని ఎత్తడానికి పనులు చేస్తున్నారు. వరద ప్రవాహానికి గేట్ల మధ్యలో ఇరుక్కున చెత్త, మట్టిని కూలీలతో తీయిస్తున్నారు. 16వ గేటును ఎత్తడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. గురువారం వరకు దాన్ని ఎత్తే అవకాశముంది. బ్యారేజీ దిగువన వరద ప్రవాహానికి కొట్టుకుపోయి, చెల్లాచెదురైన సీసీ బ్లాక్‌ల అమరికకు, శాండ్‌ గ్రౌటింగ్‌ చేపట్టడానికి పనులు సాగుతున్నాయి. వర్షాకాలంలో వచ్చే వరదను తట్టుకునేలా ఏడో బ్లాక్‌ ప్రాంతంలో షీట్‌ పైల్స్‌ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని