జూన్‌ 2న ‘జయ జయహే తెలంగాణ’ ఆవిష్కరణ

ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో తెలంగాణ సమాజాన్ని ఉర్రూతలూగించిన ‘జయ జయహే తెలంగాణ’ గీతం ఆవిష్కరణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

Published : 22 May 2024 05:28 IST

సీఎం రేవంత్‌రెడ్డితో అందెశ్రీ, కీరవాణి భేటీ

కీరవాణి, అందెశ్రీలను సన్మానిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో తెలంగాణ సమాజాన్ని ఉర్రూతలూగించిన ‘జయ జయహే తెలంగాణ’ గీతం ఆవిష్కరణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వచ్చే జూన్‌ 2కు తెలంగాణ ఆవిర్భవించి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ గీతాన్ని ఆవిష్కరించనుంది. ఇప్పటికే దీన్ని రాష్ట్ర గీతంగా ప్రభుత్వం ప్రకటించింది. మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో గీత రచయిత అందెశ్రీ, సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి తదితరులు భేటీ అయ్యారు. తెలంగాణ ఆత్మకు ప్రతిరూపంగా.. అస్తిత్వానికి ప్రతీకగా.. ఆత్మగౌరవాన్ని ప్రపంచం నలుమూలలా ఎలుగెత్తేలా.. సాంస్కృతిక ఘనతను ప్రతిబింబించేలా అందెశ్రీ రాసిన ఈ గీతం సుమారు 6 నిమిషాల నిడివి ఉంటుంది. అందులో మార్పులేమీ చేయకుండా.. యథాతథంగా ఆవిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో, దేశవిదేశీ ప్రముఖులు హాజరైన సందర్భాల్లో వినియోగించడానికి వీలుగా గీతాన్ని 60-90 సెకన్ల నిడివి మించకుండా రూపొందించాలని సీఎం సమక్షంలో నిర్ణయించారు. ప్రధాన గీతంలోని భావోద్వేగాలను అలాగే కొనసాగిస్తూ నిడివి తగ్గించేందుకు అందెశ్రీకి పూర్తి స్వేచ్ఛ, బాధ్యత, అధికారం అప్పగించారు. దీనికి సంగీతం అందించే బాధ్యతలను ఆస్కార్‌ పురస్కార గ్రహీత కీరవాణికి అప్పగిస్తే బాగుంటుందన్న అందెశ్రీ సూచనల మేరకు ఆయనను ఇందులో భాగస్వామిని చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రితో రచయిత, సంగీత దర్శకుడు చర్చించారు. జూన్‌ 2లోగా ప్రధాన గీతం, తక్కువ నిడివితో కూడిన గీతాన్ని సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.  ఈ సందర్భంగా కీరవాణి, అందెశ్రీలను సీఎం రేవంత్‌రెడ్డి సన్మానించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు