JC Diwakar Reddy: సంతకం ఫోర్జరీపై జేసీ దివాకర్‌రెడ్డి ఫిర్యాదు

తెదేపా నాయకులు జేసీ దివాకర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు సాహితీ నిర్మాణ సంస్థ నిర్వాహకులపై హైదరాబాద్, జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం కేసు నమోదైంది.

Updated : 29 May 2024 09:11 IST

జూబ్లీహిల్స్, న్యూస్‌టుడే: తెదేపా నాయకులు జేసీ దివాకర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు సాహితీ నిర్మాణ సంస్థ నిర్వాహకులపై హైదరాబాద్, జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన ప్రకారం... జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు-10లో నివసిస్తున్న జేసీ దివాకర్‌రెడ్డికి జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు-62లో ఇల్లు ఉంది. దాన్ని తమ వ్యాపార నిమిత్తం కావాలని సాహితీ నిర్మాణ సంస్థ నిర్వాహకుడు బూదాటి లక్ష్మీనారాయణ కోరడంతో జేసీ మూడేళ్ల ఒప్పందంతో 2020 జూన్‌లో అద్దెకు ఇచ్చారు. ఒప్పంద గడువు 2023 మేతో ముగియడంతో ఇంటిని ఖాళీ చేయాలని జేసీ పలుమార్లు కోరినా... స్పందించకపోవడంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. దాంతో బూదాటి లక్ష్మీనారాయణ, అతని కుమారుడు సాత్విక్‌లు తమకు లీజు గడువు ఇంకా ఉన్నట్లు సిటీ సివిల్‌ కోర్టులో పిటిషన్‌ వేయడంతో జేసీకి కోర్టు నుంచి సమన్లు జారీ అయ్యాయి. లక్ష్మీనారాయణ, అతని న్యాయవాది కోర్టులో దాఖలు చేసిన పత్రాలను గమనించిన జేసీ... తన సంతకం ఫోర్జరీ జరిగిందని, ఒప్పందం తేదీని 2021 మే నెలగా చూపినట్లు గుర్తించారు. దీంతో ఫోర్జరీ సంతకాలు, నకిలీ పత్రాలతో బూదాటి లక్ష్మీనారాయణ, సాత్విక్, వారి న్యాయవాది మహమ్మద్‌ షాజుద్దీన్‌లు కోర్టును తప్పుదోవ పట్టించారని జేసీ సోమవారం ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని