JEE Advanced 2024: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు నేడు

ఐఐటీల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి గత నెల 26న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు ఆదివారం ఉదయం 10 గంటలకు వెలువడనున్నాయి.

Published : 09 Jun 2024 04:21 IST

రేపటి నుంచి జోసా కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం
ఈసారి 121 విద్యా సంస్థలు

ఈనాడు, హైదరాబాద్‌: ఐఐటీల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి గత నెల 26న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు ఆదివారం ఉదయం 10 గంటలకు వెలువడనున్నాయి. దేశవ్యాప్తంగా సుమారు 2 లక్షల మంది హాజరయ్యారని, వారిలో తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 40వేల మంది ఉన్నారని అంచనా. పరీక్ష నిర్వహణ బాధ్యతలు తీసుకున్న ఐఐటీ మద్రాస్‌ ఈ ఫలితాలను విడుదల చేయనుంది. ఈసారి జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్‌లో పాల్గొనే విద్యాసంస్థలు 114 నుంచి 121కి పెరిగాయి. ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీలతో పాటు పలు కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో బీటెక్, బ్యాచులర్‌ ఆఫ్‌ సైన్స్‌ (బీఎస్‌), అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో సీట్ల భర్తీకి జోసా పేరిట సంయుక్త కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆ ప్రక్రియ ఈనెల 10 నుంచి జులై 23వ తేదీ వరకు 44 రోజులపాటు కొనసాగుతుంది. గత విద్యా సంవత్సరం(2023-24)లో 23 ఐఐటీల్లో 17,385 సీట్లున్నాయి. ఈసారి మరిన్ని పెరగవచ్చని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల నుంచి తొలి 10 ర్యాంకుల్లో మూడు నుంచి నాలుగు వరకు ఉండొచ్చని కళాశాలల ప్రతినిధులు అంచనా వేస్తున్నారు.

6 వేల లోపు ర్యాంకు వస్తే సీటు...

ఓపెన్‌ కేటగిరీ విద్యార్థులు ఐఐటీలో నాలుగేళ్ల బీటెక్‌ చదవాలనుకుంటే 6వేల లోపు ర్యాంకు వస్తేనే సాధ్యం. గత ఏడాది ఐఐటీ భిలాయిలో 5,791, ధార్వాడ్‌లో 5,978 ర్యాంకుతో కూడా సీట్లు దక్కాయి. అమ్మాయిలకు సూపర్‌న్యూమరీ కోటా కింద భిలాయిలో 11,200 ర్యాంకుకు సీటు దక్కింది. ప్రారంభ, ముగింపు ర్యాంకులు విద్యార్థుల కేటగిరీలను బట్టి మారతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని