IT Jobs: ఐటీ కొలువుల్లో హైదరా‘బాద్‌షా’

ప్రపంచవ్యాప్తంగా ఇటీవల ఐటీ ఉద్యోగాల్లో మందగమనం కొనసాగుతోంది. ఖర్చుల తగ్గింపులో భాగంగా ప్రముఖ సంస్థలు సైతం ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి.

Updated : 25 May 2024 07:58 IST

ప్రపంచవ్యాప్తంగా మందగమనం
నగర ఐటీలో 41.5 శాతం పెరుగుదల
బెంగళూరుతో పోలిస్తే ఇక్కడే ఉద్యోగాలు చేసేందుకు ఆసక్తి
జాబ్‌పోర్టల్‌ ఇండీడ్‌ అధ్యయనంలో వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: ప్రపంచవ్యాప్తంగా ఇటీవల ఐటీ ఉద్యోగాల్లో మందగమనం కొనసాగుతోంది. ఖర్చుల తగ్గింపులో భాగంగా ప్రముఖ సంస్థలు సైతం ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. ఈ ప్రభావం దేశంలో ఐటీ ఉద్యోగాలపైనా పడుతోంది. ఇటీవల ఐటీ నియామకాలు తగ్గిపోయాయి. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లలోనూ ఆశించిన స్థాయిలో ఉద్యోగాలు లభించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లోనూ మన దేశంలోని హైదరాబాద్‌ ఐటీ రంగంలో మాత్రం రికార్డు స్థాయిలో ఉద్యోగాల సంఖ్య పెరిగింది. ఐటీకి ప్రధాన కేంద్రాలుగా కొనసాగుతున్న బెంగళూరు, హైదరాబాద్‌లలో ఈ పురోగతి కనిపించింది. ప్రముఖ జాబ్‌ పోర్టల్‌ ఇండీడ్‌ 2023 ఏప్రిల్‌ నుంచి 2024 ఏప్రిల్‌ వరకు ఐటీ ఉద్యోగ నియామకాలు, జాబ్‌క్లిక్‌లపై అధ్యయనం చేసింది. పలు కీలక అంశాలతో ఈ సంస్థ శుక్రవారం నివేదిక విడుదల చేసింది. వివరాలివీ..

హైదరాబాద్‌ ఐటీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇక్కడి మౌలిక సదుపాయాలు, వాతావరణం అనుకూలంగా మారాయి. పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఇక్కడి నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. హైదరాబాద్‌ ఐటీ రంగంలో ఉద్యోగ నియామకాలు పెరిగాయి. ఈ పెరుగుదల గడిచిన ఏడాదిలో 41.5 శాతం ఉన్నట్లు ఇండీడ్‌ సంస్థ వెల్లడించింది. బెంగళూరులో ఇది 24 శాతంగా ఉంది. ఈ రెండు నగరాలూ ఐటీ నిపుణులకు ప్రధాన ఉద్యోగ విపణి కేంద్రాలుగా ఉన్నాయని తెలిపింది. ఐటీ ఉద్యోగాల ఖాళీలు మాత్రమే కాదు.. ఐటీ ఉద్యోగాలు చేసే నగరాల ఎంపికలోనూ హైదరాబాద్‌కు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. హైదరాబాద్‌లో స్థిరాస్తి, కనీస మౌలిక సదుపాయాలు, ట్రాఫిక్‌ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఐటీ రంగం కొలువుల వేటలోని యువత, నిపుణుల్లో హైదరాబాద్‌కు ప్రాధాన్యమిస్తున్న వారు 161 శాతం పెరిగినట్లు జాబ్‌క్లిక్‌ గణాంకాలు వెల్లడిస్తున్నాయని నివేదిక తెలిపింది. బెంగళూరు నగరంలో ఈ వృద్ధి 80 శాతంగా ఉంది. 

దేశవ్యాప్తంగా 3.6 శాతం తగ్గుదల

దేశవ్యాప్తంగా ఐటీ ఉద్యోగాల అవకాశాల్లో తగ్గుదల నమోదైంది. కొత్త పోస్టింగుల్లో 3.6 శాతం తగ్గుదల నెలకొంది. అంతర్జాతీయంగా నెలకొన్న అస్థిరత, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఐటీ కంపెనీలు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు నివేదిక తెలిపింది. ఐటీ ఉద్యోగాల ఆశావహులు నైపుణ్యాలను పెంచుకోవడం ద్వారా పెరుగుతున్న పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోగలరని పేర్కొంది. ఎనాలసిస్, అజైల్, ఏపీఐస్, జావాస్క్రిప్ట్, ఎస్‌క్యూఎల్‌.. నైపుణ్యాలున్న వారికి అత్యధికంగా ఐటీ నియామకాల్లో అవకాశాలు లభిస్తున్నట్లు నివేదిక తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని