Justice PC Ghose: మీరు చెప్పినవి.. అఫిడవిట్‌గా ఇవ్వండి

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై విచారణలో భాగంగా.. తన ఎదుట చెప్పిన అంశాలను రాతపూర్వకంగా అఫిడవిట్‌ రూపంలో అందజేయాలని న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్‌ పీసీ ఘోష్‌ ఇంజినీర్లకు సూచించినట్లు తెలిసింది.

Updated : 11 Jun 2024 06:11 IST

ఇంజినీర్లకు జస్టిస్‌ ఘోష్‌ సూచన 
సీనియర్‌ ఇంజినీర్లను విచారించిన కమిషన్‌
డిజైన్లు, నిర్వహణ, అంచనాలు.. తదితరాలపై ప్రశ్నలు 

విచారణకు హాజరవుతున్న మాజీ ఈఎన్సీ మురళీధర్‌

ఈనాడు, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై విచారణలో భాగంగా.. తన ఎదుట చెప్పిన అంశాలను రాతపూర్వకంగా అఫిడవిట్‌ రూపంలో అందజేయాలని న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్‌ పీసీ ఘోష్‌ ఇంజినీర్లకు సూచించినట్లు తెలిసింది. ఈ అఫిడవిట్లన్నీ రహస్యంగా ఉంటాయని కూడా స్పష్టం చేసినట్లు సమాచారం. మేడిగడ్డ బ్యారేజి కుంగడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో సీపేజికి గల కారణాలతోపాటు డిజైన్లు, నిర్వహణ, ఉన్నతస్థాయి కమిటీ నిర్ణయాలు, అంచనాల పెంపు తదితర అంశాలపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. విచారణలో భాగంగా సోమవారం పలువురు ఇంజినీర్లు కమిషన్‌ ఎదుట హాజరయ్యారు. మాజీ ఈఎన్సీలు మురళీధర్‌ (జనరల్‌), వెంకటేశ్వర్లు (కాళేశ్వరం), నరేందర్‌రెడ్డి (డిజైన్స్‌)తో పాటు డిజైన్స్‌ విభాగంలో ఎస్‌ఈలుగా పనిచేసిన చంద్రశేఖర్, బసవరాజు, సుందిళ్ల, అన్నారం ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు ఓంకార్‌సింగ్, యాదగిరి తదితరులు హాజరయ్యారు. మేడిగడ్డ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ తిరుపతిరావు హాజరుకావాల్సి ఉండగా.. ఆయన గడువు కోరినట్లు తెలిసింది. బ్యారేజీలకు సంబంధించి మీ అనుభవాలను, అభిప్రాయాలను నిజాయతీగా, స్వేచ్ఛగా వెల్లడించాలని వారిని కమిషన్‌ కోరినట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. విచారణకు సంబంధించిన అంశాలు ఇలా ఉన్నాయి. 

సీడీవో మాజీ ఈఎన్సీ నరేందర్‌రెడ్డి, సీడీవో సీఈ చంద్రశేఖర్‌

డ్రాయింగ్‌ల ప్రకారం పని జరగలేదా?

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంగా మార్చినప్పటి నుంచి వివిధ అంశాలపై ఉన్నతస్థాయి కమిటీ, ప్రభుత్వస్థాయిలో తీసుకున్న నిర్ణయాలు, ఇందులోని సాంకేతికాంశాల గురించి ఇంజినీర్లను విచారణ కమిషన్‌ ప్రశ్నించినట్లు తెలిసింది. బ్యారేజీలకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, ఏం చేయాలని కూడా అడిగినట్లు సమాచారం. బ్యారేజీలు, డ్యాంలలో దేని కోసం డిజైన్‌ చేశారు, నిర్మాణ ప్రాంతాల గురించి సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌ (సీడీవో) అనుమతి తీసుకున్నారా అని ప్రశ్నించగా.. లేదని సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. నిర్మాణ స్థలాల గురించి కన్సల్టెన్సీ సంస్థ వాప్కోస్, క్షేత్రస్థాయి (ఫీల్డ్‌) ఇంజినీర్ల మధ్యనే చర్చ జరిగిందని ఓ ఇంజినీర్‌ చెప్పినట్లు సమాచారం. ఇదే అంశంపై రాష్ట్రస్థాయి అత్యున్నత (హైలెవెల్‌) కమిటీ ఏం నిర్ణయం తీసుకుంది, ఫీల్డ్‌ ఇంజినీర్లు దీనికి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నారా అని మరో ఉన్నతస్థాయి ఇంజినీర్‌ను ప్రశ్నించినట్లు తెలిసింది. సీడీవో ఇచ్చిన డ్రాయింగ్‌ల ప్రకారం పని జరిగిందా లేదా, జరగకుంటే ఎందుకు జరగలేదని అడగ్గా.. డ్రాయింగ్‌ ప్రకారం జరగలేదనే సమాధానం వచ్చినట్లు కూడా తెలిసింది. 

నిర్వహణ లోపాలు కూడా.. 

మేడిగడ్డ బ్యారేజీలో కట్‌ ఆఫ్‌ వాల్‌ సరిగా నిర్వహించకపోవడం, ఇసుక క్రమంగా కొట్టుకుపోతున్నా నాలుగేళ్ల పాటు నిర్వహణ గురించి పట్టించుకోకపోవడం, ఆపరేషన్స్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ (ఓ అండ్‌ ఎం) సరిగా లేకపోవడం గురించి చర్చించినట్లు తెలిసింది. ఓ అండ్‌ ఎం సమస్యను ఓ ఇంజినీర్‌ ప్రధానంగా ప్రస్తావించినట్లు తెలిసింది. మేడిగడ్డలో కట్‌ ఆఫ్‌ వాల్‌కు వినియోగించిన కొన్ని పైల్స్‌లో సమస్య వచ్చి ఉండొచ్చని, వెంటనే పట్టించుకుని ఉంటే తీవ్ర రూపం దాల్చేది కాదని ఓ ఇంజినీర్‌ చెప్పినట్లు సమాచారం. అంచనాలను పెంచారా.. ఉప గుత్తేదారులు పని చేశారా.. అన్న వివరాలు ఇవ్వాలని కమిషన్‌ కోరినట్లు సమాచారం. తాను బ్యారేజి నిర్మాణం పూర్తయిన తర్వాత వచ్చానని, నిర్మాణ సమయంలో లేనని ఓ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ చెప్పగా.. కమిషన్‌ ఆయనను ఏమీ ప్రశ్నించలేదని తెలిసింది. భూసేకరణకు సంబంధించి రెవెన్యూ, అటవీ, గనుల శాఖ అధికారులతో మాట్లాడటానికే ఎక్కువ సమయం పట్టిందని, డిజైన్‌ తదితర అంశాల గురించి పట్టించుకునే అవకాశం లేకుండా పోయిందని మరో ఇంజినీర్‌ పేర్కొన్నట్లు సమాచారం. బ్యారేజి వద్ద ఇసుక మేటలు వేయడం ప్రధాన సమస్య అని ఓ ఇంజినీర్‌ పేర్కొనగా.. ప్రారంభంలోనే ఎందుకు పట్టించుకోలేదని కమిషన్‌ ప్రశ్నించినట్లు తెలిసింది. మేడిగడ్డ బ్యాక్‌వాటర్‌ అన్నారం బ్యారేజీకి ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఆగిపోవడం, షూటింగ్‌ వెలాసిటీ డిజైన్‌కు, వాస్తవానికి తేడా ఉండటం గురించి కమిషన్‌ ప్రశ్నించినట్లు సమాచారం. మేడిగడ్డలో డిజైన్‌ లోపాలేమైనా ఉన్నాయా అని అందరినీ అడిగినట్లు తెలిసింది. నిర్వహణ లోపం వల్లే సమస్య తీవ్రమైనట్లు ఎక్కువ మంది కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. విచారణ ముగిసిన తర్వాత.. ప్రతి ఒక్కరూ తాము చెప్పిన అంశాలను రాతపూర్వరంగా అఫిడవిట్‌ రూపంలో సమర్పించాలని కమిషన్‌ సూచించింది.  


ఇంజినీర్ల టెలికాన్ఫరెన్స్‌పై మంత్రి సీరియస్‌! 

కాళేశ్వరంపై విచారణ చేపట్టిన జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఎదుట హాజరుకావడానికి సీనియర్‌ ఇంజినీర్లు టెలికాన్ఫరెన్స్‌ పెట్టుకొని.. అందరూ ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలనుకోవడంపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వాస్తవాలు వెలుగులోకి రాకుండా చూసే ప్రయత్నంలో భాగంగానే ఇలా చేశారని, దీన్ని తీవ్రంగా పరిగణిస్తామని ఆయన హెచ్చరించినట్లు సమాచారం. ఈ టెలికాన్ఫరెన్స్‌ అంశం ప్రస్తుతం నీటిపారుదలశాఖలో చర్చనీయాంశంగా మారింది. జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ సోమవారం నుంచి తమ ఎదుట హాజరుకావాలని నీటిపారుదలశాఖ సీనియర్‌ ఇంజినీర్లు, ప్రాజెక్టు ఇంజినీర్లకు నోటీసులిచ్చింది. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఏడెనిమిది మంది ఇంజినీర్లతో ఓ సీనియర్‌ ఇంజినీర్‌ టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించినట్లు తెలిసింది. ఓ విశ్రాంత ఇంజినీర్‌ కూడా ఇందులో కీలకపాత్ర పోషించినట్లు సమాచారం. అందరూ ఒకే మాట మీద ఉండాలని, ఒకరు చెప్పిన దాంతో మరొకరు విభేదించవద్దని.. డిజైన్, ఓ అండ్‌ ఎం తదితర సమస్యల వల్ల జరిగినట్లు మాట్లాడవద్దని సూచించినట్లు తెలిసింది. విచారణలో తదుపరి ఎలాంటి ఇబ్బంది రాకూడదనే.. ఈ టెలికాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నట్లు ఓ సీనియర్‌ ఇంజినీర్‌ పేర్కొన్నట్లు తెలిసింది. ఈ విషయం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దృష్టికి రావడంతో.. ఇందుకు బాధ్యులైన వారిపై సోమవారం ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇది వాస్తవాలను తొక్కిపెట్టే ప్రయత్నంలా ఉందని, ఇలాంటి వాటిని ప్రభుత్వం సహించదని హెచ్చరించినట్లు తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు