Kaleshwaram Project: జూన్‌ లోపు విచారణ పూర్తికాదు

కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణంపై విచారణ ప్రక్రియ ఈ నెలాఖరులోపు పూర్తికాదని విచారణ కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ పీసీ ఘోష్‌ తెలిపారు.

Published : 11 Jun 2024 05:47 IST

సాంకేతికాంశాలపై విచారణ సాగుతోంది
త్వరలో ఆర్థికాంశాలు, అవకతవకలపై దృష్టి 
నష్టపరిహారంపైనా ఫిర్యాదులు అందుతున్నాయి 
అన్ని విషయాలు బయటికి  వస్తాయి: జస్టిస్‌ పీసీ ఘోష్‌ 

సమావేశానికి వస్తున్న జస్టిస్‌ పీసీ ఘోష్‌. చిత్రంలో నీటిపారుదలశాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ 

ఈనాడు, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణంపై విచారణ ప్రక్రియ ఈ నెలాఖరులోపు పూర్తికాదని విచారణ కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ పీసీ ఘోష్‌ తెలిపారు. సమగ్ర విచారణకు ఇంకా సమయం పడుతుందని, వాస్తవాలు తెలుసుకోకుండా పూర్తి నివేదిక ఇవ్వడం సాధ్యం కాదని అన్నారు. గడువు అంశాన్ని ప్రభుత్వం చూసుకుంటుందని పేర్కొన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ సోమవారం నుంచి ప్రత్యక్ష విచారణను ప్రారంభించారు. హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌లోని కమిషన్‌ కార్యాలయంలో ఇంజినీర్లను విడివిడిగా విచారించే ప్రక్రియను చేపట్టారు. ఈ సందర్భంగా జస్టిస్‌ పీసీ ఘోష్‌ మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ‘మొన్నటి వరకు ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండడంతో విచారణలో కొంత జాప్యం చోటుచేసుకుంది. సోమవారం ఏడుగురిని విచారణకు పిలిపించాం. ఆనకట్టల బాధ్యతలు పర్యవేక్షించిన ఇంజినీర్ల నుంచి ఈ రోజు వివరాలు సేకరించాం. త్వరలో నిర్మాణ సంస్థల ప్రతినిధులను కూడా పిలుస్తాం. మంగళవారం విచారణకు రావాలని 18 మందికి నోటీసులిచ్చాం. సాంకేతికాంశాలపై విచారణ జరుగుతోంది. ఇది పూర్తయ్యాక, ఆర్థికాంశాలు, అవకతవకలపై విచారణ మొదలు పెడతాం. లోపాలు ఎక్కడున్నాయో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. కమిషన్‌ సూచనల మేరకు ఏర్పాటైన నిపుణుల కమిటీ నివేదిక ఇవ్వనుంది’ అని పేర్కొన్నారు. 

ఉన్నతాధికారుల భేటీ

జస్టిస్‌ పీసీ ఘోష్‌తో సోమవారం సాయంత్రం నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ సమావేశమయ్యారు. బ్యారేజీలపై విచారణ సందర్భంగా వెల్లడైన అంశాలు, ఇటీవల క్షేత్రస్థాయి పర్యటన సందర్భంగా కమిషన్‌ దృష్టికి వచ్చిన అంశాలపై చర్చించినట్లు తెలిసింది. 


కమిషన్‌కు 54 ఫిర్యాదులు

విచారణ వేగంగా సాగుతోందని జస్టిస్‌ పీసీ ఘోష్‌ తెలిపారు. ‘ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రాజెక్టును సందర్శించాను. విచారణకు హాజరు కావాల్సిన అధికారులు, ఇంజినీర్లకు నోటీసులిస్తున్నాం. అన్ని విషయాలు రానున్న రోజుల్లో బయటకు వస్తాయి. విజిలెన్స్‌ విభాగం వద్ద ఉన్న అన్ని వివరాలను ప్రభుత్వం అందజేసింది. వాటిని కూడా పరిశీలిస్తాం. కమిషన్‌కు ఇప్పటి వరకు 54 ఫిర్యాదులొచ్చాయి. వాటిలో భూసేకరణ, నష్టపరిహారానికి సంబంధించినవి కూడా ఉన్నాయి. కమిషన్‌కు సంబంధం లేని అంశాలపై ప్రభుత్వానికి సూచనలు చేస్తాం. బ్యారేజీల రక్షణ చర్యలు, మరమ్మతులనేవి నా పని కాకపోయినా.. ప్రజాప్రయోజనాల దృష్ట్యా తగిన భద్రత చర్యలు చేపట్టాలని సూచించాను. ఇంజినీర్లు, నిర్మాణ సంస్థలు స్పందించి పనులు చేపట్టాయి’ అని ఆయన వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు