Kaleshwaram Project: ఒకవైపు విచారణ.. మరోవైపు పదోన్నతి

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన బ్యారేజీలపై ఒక పక్క విచారణ జరుగుతుండగా, ఇంకో పక్క ఎంక్వయిరీ ఎదుర్కొంటున్న ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌కు సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.

Published : 25 May 2024 03:37 IST

‘కాళేశ్వరం’ ఈఈ సర్దార్‌ ఓంకార్‌ సింగ్‌కు ఎస్‌ఈగా పూర్తి అదనపు బాధ్యతలు
సీఎం రేవంత్‌రెడ్డి సూచనలకు భిన్నంగా నియామకం

ఈనాడు, హైదరాబాద్‌: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన బ్యారేజీలపై ఒక పక్క విచారణ జరుగుతుండగా, ఇంకో పక్క ఎంక్వయిరీ ఎదుర్కొంటున్న ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌కు సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇది నీటిపారుదల శాఖలో చర్చనీయాంశంగా మారింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో గోదావరిపై నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగింది. ఏడో బ్లాక్‌లో పియర్స్, గేట్లు దెబ్బతిన్నాయి. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో సీపేజీ ఏర్పడింది. సీసీ బ్లాకులు కొట్టుకుపోయాయి. మేడిగడ్డపై విజిలెన్స్‌ దర్యాప్తు పూర్తయి నివేదిక సమర్పించాల్సి ఉంది. దీంతో పాటు మూడు బ్యారేజీలపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ పీసీ ఘోష్‌ నేతృత్వంలో న్యాయవిచారణ జరుగుతోంది. బ్యారేజీల సమస్యలపై నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథార్టీ(ఎన్‌డీఎస్‌ఏ) అధ్యయనం చేస్తోంది. ఒక పక్క ఇన్ని రకాల విచారణలు జరుగుతుండగా, ఇంకోవైపు సుందిళ్ల బ్యారేజీ, పంపుహౌస్‌ల బాధ్యతలను(ఇరిగేషన్‌ డివిజన్‌-3, రామగుండం) చూస్తున్న  ఈఈ సర్దార్‌ ఓంకార్‌ సింగ్‌కు వరంగల్‌ ఇరిగేషన్‌ సర్కిల్‌ ఎస్‌ఈగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ నీటిపారుదల శాఖ కార్యదర్శి ఈ నెల 22న మెమో జారీ చేశారు. నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌(పరిపాలన) నుంచి వచ్చిన ప్రతిపాదన ఆధారంగా ఈ నియామకం చేసినట్లు అందులో పేర్కొన్నారు. మహబూబాబాద్‌ ఇరిగేషన్‌ సర్కిల్‌ ఎస్‌ఈ..  వరంగల్‌ సర్కిల్‌ ఎస్‌ఈగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తుండగా ఆయనను తొలగించి ఓంకార్‌ సింగ్‌ను నియమించారు.

మేడిగడ్డ పునాదుల సమయంలో ఈయనే ఈఈ

మేడిగడ్డ బ్యారేజీ పునాదుల పనులు చేపట్టిన సమయంలో ఓంకార్‌ ఈఈగా ఉన్నారు. తర్వాత సుందిళ్లకు బదిలీ అయ్యారు. ఈ ప్రాజెక్టు టెండర్‌ ప్రక్రియ మొదలు ఇప్పటివరకు చోటుచేసుకున్న పరిణామాలపై విచారణ జరుగుతోంది. బ్యారేజీ వైఫల్యానికి బాధ్యులైన వారిపై చర్య తీసుకోవడంతోపాటు చాలా కాలంగా ఇక్కడ పని చేస్తున్నవారిని లూప్‌లైన్‌లోకి పంపించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల నిర్వహించిన సమావేశంలో సూచించినట్లు చెప్తున్న నీటిపారుదల శాఖ వర్గాలు, అందుకు భిన్నంగా ఓ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌కు ఎస్‌ఈగా అదనపు బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశంగా మారింది. గతంలో సీనియారిటీని పట్టించుకోకుండా కొందరికి అదనపు బాధ్యతలు అప్పగించారు. పదవీ విరమణ చేసిన వారి సర్వీసును పొడిగించారు. ఇప్పుడు కూడా సీనియార్టీకి తిలోదకాలిచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇరిగేషన్‌ ఇంజినీరింగ్‌ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పదవీ విరమణ చేసినవారి సర్వీసును పొడిగించవద్దని ఇటీవల నీటిపారుదల శాఖ మంత్రికి కూడా విజ్ఞప్తి చేశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని