Kamareddy: కామారెడ్డి డీఎంహెచ్‌వో సస్పెన్షన్‌

వైద్యాధికారిణులపై లైంగిక వేధింపుల ఆరోపణల వ్యవహారంలో కామారెడ్డి జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌వో) లక్ష్మణ్‌సింగ్‌పై వేటు పడింది. ఉన్నతాధికారుల విచారణ నివేదిక ఆధారంగా అతడిని సస్పెండ్‌ చేస్తూ ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్‌ చోంగ్తూ శనివారం ఉత్తర్వులు జారీచేశారు.

Published : 26 May 2024 03:12 IST

ఉన్నతాధికారుల నివేదిక ఆధారంగా చర్యలు

కామారెడ్డి పట్టణం, న్యూస్‌టుడే: వైద్యాధికారిణులపై లైంగిక వేధింపుల ఆరోపణల వ్యవహారంలో కామారెడ్డి జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌వో) లక్ష్మణ్‌సింగ్‌పై వేటు పడింది. ఉన్నతాధికారుల విచారణ నివేదిక ఆధారంగా అతడిని సస్పెండ్‌ చేస్తూ ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్‌ చోంగ్తూ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. పరిపాలన వ్యవహారాల్లో నిబంధనలు అతిక్రమించారని తేలింది. లక్ష్మణ్‌సింగ్‌ సంగారెడ్డి డీఎంహెచ్‌వోగా... కామారెడ్డికి ఇన్‌ఛార్జి అధికారిగా వ్యవహరిస్తున్నారు. ఈనెల 8న కామారెడ్డి జిల్లాకేంద్రంలో ఆరోగ్యశాఖ సమీక్ష సమావేశంలో కొందరు వైద్యాధికారుణులతో అసభ్యంగా మాట్లాడారని లక్ష్మణ్‌సింగ్‌పై కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదులు అందాయి. రాష్ట్ర వైద్యశాఖ అదనపు సంచాలకులు అమర్‌సింగ్‌ కామారెడ్డిలోని ఆరోగ్యశాఖ కార్యాలయానికి వచ్చి విచారణ జరిపారు.  వైద్యాధికారిణుల చేతులు తాకడం, సెల్‌ఫోన్‌లో అసభ్యంగా మాట్లాడడం వంటి చర్యలకు పాల్పడ్డారని మహిళా వైద్యాధికారులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ వ్యవహారంలో డీఎంహెచ్‌వోపై కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి పోలీసుస్టేషన్‌లో ఏడు లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి. పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా షరతులతో కూడిన బెయిల్‌ మంజూరైంది. 

కామారెడ్డి వైద్యశాఖ కార్యాలయంలో సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌నాయక్‌ ఆల్కహాల్‌ తాగి జిల్లాలోని వైద్యాధికారిణికి అసభ్య సందేశాలు పంపినట్లు విచారణలో తేలింది. అతడిని ఈనెల 21న సస్పెండ్‌ చేశారు. ఈ ఘటనను రాష్ట్ర వైద్యశాఖ తీవ్రంగా పరిగణించింది. ఇద్దరు అధికారులపై వేటువేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని