RRR: పెరుగుతున్న భూ సేకరణ వ్యయం!

ప్రాంతీయ రింగు రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) భూ సేకరణ వ్యయం క్రమంగా పెరుగుతోంది. రాష్ట్రాన్ని అవుటర్, ప్రాంతీయ రింగు రోడ్ల కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఆయా ప్రణాళికల రూపకల్పనలో భాగంగా అధికారులు భూసేకరణ వ్యవహారాలపై దృష్టి పెట్టారు.

Published : 08 Jun 2024 05:49 IST

 రూ.5,500 కోట్లు దాటుతుందని అంచనా 
 ప్రాంతీయ రింగు రోడ్డుపై ప్రభుత్వం కసరత్తు
 నిధుల సమీకరణకు ప్రతిపాదనలు 

ఈనాడు, హైదరాబాద్‌: ప్రాంతీయ రింగు రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) భూ సేకరణ వ్యయం క్రమంగా పెరుగుతోంది. రాష్ట్రాన్ని అవుటర్, ప్రాంతీయ రింగు రోడ్ల కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఆయా ప్రణాళికల రూపకల్పనలో భాగంగా అధికారులు భూసేకరణ వ్యవహారాలపై దృష్టి పెట్టారు. అవసరమయ్యే నిధుల సమీకరణకు కసరత్తు చేస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ను 348 కిలోమీటర్ల పొడవున రెండు భాగాలుగా నిర్మించనున్నారు. దీనికి పది వేల ఎకరాల వరకు భూసేకరణ చేపట్టాల్సి ఉంటుంది. 158.65 కిలోమీటర్ల మేర ఉత్తర భాగంలో 4,700 ఎకరాలు, 189.2 కిలోమీటర్ల మేర దక్షిణ భాగానికి 5,300 ఎకరాల వరకు సేకరించాల్సి వస్తుందని అంచనా. మొత్తం భూసేకరణకయ్యే వ్యయాన్ని చెరి సమానంగా భరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందం చేసుకున్నాయి. రాష్ట్ర వాటాగా ఉత్తర భాగానికి రూ.2,200 కోట్లు, దక్షిణ భాగానికి రూ.3,300 కోట్లు... మొత్తంగా రూ.5,500 కోట్లు అవుతుందని అధికారులు చెబుతున్నారు. గతంలో ఇది రూ.4,000 కోట్ల నుంచి రూ.4,500 కోట్ల మధ్య ఉంటుందని అంచనా వేశారు. సేకరించాల్సిన భూమి విస్తీర్ణంతోపాటు ధరలు కూడా పెరగడంతో అంచనా వ్యయం పెరిగినట్లు ఉన్నతాధికారి ఒకరు ‘ఈనాడు’తో తెలిపారు. నిధుల సమీకరణలో భాగంగా రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ పరిధిలో ఉన్న రహదారి అభివృద్ధి కార్పొరేషన్‌(ఆర్డీసీ) కింద రుణం తీసుకోవాలని నిర్ణయించారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం పూచీకత్తు ఇవ్వాలని నిర్ణయించింది. గతంలో వివిధ బ్యాంకుల నుంచి రుణం తీసుకునేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ బ్యాంకుల కన్సార్షియం తుది దశలో వివిధ ప్రశ్నలను లేవనెత్తడంతో ప్రక్రియ ముందుకు సాగలేదు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం... హడ్కో నుంచి పెద్ద మొత్తంలో రుణం తీసుకోనుంది. అదేబాటలో ఆర్డీసీ పేరిట కూడా రుణ ప్రతిపాదనలను పంపారు. వాటిని పరిశీలించిన తర్వాత రూ.3000 కోట్లు ఇచ్చేందుకు హడ్కో సుముఖత వ్యక్తం చేసింది. 

మిగిలిన నిధులు ఎలా...? 

దక్షిణ భాగం రహదారికి అవసరమైన భూసేకరణకు రూ.3,300 కోట్లకుపైగా అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ భాగానికి కేంద్రం నుంచి సూత్రప్రాయ అనుమతి లభించింది. అలైన్‌మెంట్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదం తెలిపాయి. దీనికి జాతీయ రహదారి నంబరు కేటాయించాల్సి ఉంది. ఈ మార్గం భూసేకరణ నిధులను ముందుగానే సమీకరించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ప్రభుత్వం స్పష్టంచేసింది. బ్యాంకులను ఆశ్రయించడమా లేదంటే మళ్లీ హడ్కోకు ప్రతిపాదనలు పంపడమా అనే దానిపై అధికారులు చర్చిస్తున్నారు. అయితే, దక్షిణ భాగం భూసేకరణ తుది దశకు రావడానికి ఎంత సమయం పడుతుందనేది అధికారులు సైతం అంచనా వేయలేని పరిస్థితి. అందుకే రుణాన్ని తక్షణం సేకరించాలా? మరికొంత సమయం వేచి చూడాలా? అన్న విషయంపైనా అధికారులు ఆలోచిస్తున్నారు. అయితే, ప్రాంతీయ రింగు రోడ్డు అనుమతుల నుంచి నిధుల సమీకరణ వరకు ముందస్తు ప్రణాళికలను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసినట్లు ఓ ఉన్నతాధికారి ‘ఈనాడు’తో తెలిపారు. ఆ మేరకు కసరత్తు చేస్తున్నట్లు వివరించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని