Counterfeit Drugs: ప్రజారోగ్యంతో చెలగాటం

జ్వరం, దగ్గు, నొప్పులు, రక్తపోటు, మధుమేహం, చివరికి ప్రాణాంతక క్యాన్సర్‌కు మనం వాడుతున్న చాలా మందుల్లో ఏవి అసలైనవో ఏవి నకిలీవో తెలియని దుస్థితి.

Published : 24 May 2024 04:25 IST

నకిలీ మందులకు మార్కెట్‌గా రాష్ట్రం  
ప్రజల ప్రాణాలు పణంగా వ్యాపారం 
ప్రముఖ కంపెనీల లేబుళ్లతో విక్రయాలు 
కోకొల్లలుగా అనుమతి లేని మందుల దుకాణాలు 
డీసీఏ తనిఖీల్లో ప్రతిచోటా నివ్వెరపోయే ఉదంతాలు

మచ్చబొల్లారంలో అధికారులు స్వాధీనం చేసుకున్న రూ.4.35 కోట్ల విలువైన నకిలీ క్యాన్సర్‌ నివారణ మందులు

హైదరాబాద్‌ సమీపంలోని మచ్చబొల్లారంలో ఆస్ట్రా జెనెరిక్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ అనే సంస్థపై దాడి చేసినప్పుడు... దానికి ఎలాంటి లైసెన్సు లేదని వెల్లడైంది. ఈ కంపెనీ ఏకంగా 36 రకాల మందుల్ని తయారు చేస్తోంది. వాటిలో క్యాన్సర్‌ నివారణ మందులూ ఉండటం గమనార్హం. 

- అల్సర్లను తగ్గించేందుకు కూకట్‌పల్లిలో నకిలీ మందులను తయారు చేసి రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో విక్రయిస్తున్న వ్యవహారం వెలుగు చూసింది. 


చౌటుప్పల్‌ సమీపంలోని కొయ్యలగూడెంలో ఎస్‌వీ ల్యాబ్స్, జిన్నారం మండలం గుండ్లపోచంపల్లిలో మేకా ల్యాబ్స్, గుమ్మడిదల మండలం బొంతపల్లిలో రక్షిత్‌ డ్రగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వంటి సంస్థలు అనుమతులు లేకుండానే ఔషధాలు తయారు చేస్తున్న వ్యవహారం వెల్లడైంది. 

ఖమ్మం శివారులోని టీఎస్‌ఐఐసీ పారిశ్రామికవాడలో నకిలీ మందుల తయారీకి వాడుతున్న పదార్థాలు, యంత్రాలు

ఈనాడు, హైదరాబాద్‌: జ్వరం, దగ్గు, నొప్పులు, రక్తపోటు, మధుమేహం, చివరికి ప్రాణాంతక క్యాన్సర్‌కు మనం వాడుతున్న చాలా మందుల్లో ఏవి అసలైనవో ఏవి నకిలీవో తెలియని దుస్థితి... అవి నాణ్యమైనవా, కల్తీవా అనేది గుర్తించలేని పరిస్థితి... నోట్లో వేసుకున్న మందు, ఒంటికి రాసుకున్న ఆయింట్‌మెంట్‌ పనిచేస్తోందో లేదోననే ఆందోళన... వీటికితోడు కాలం చెల్లిన మందులు, వాటిని విక్రయించే అనుమతిలేని మెడికల్‌ షాపులు... అధిక ధరలతో రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యం దైవాధీనంగా తయారైంది. ఆందోళనకు గురిచేస్తున్న ఈ అంశాలన్నీ సాక్షాత్తూ రాష్ట్ర ఔషధ నియంత్రణ మండలి(డీసీఏ) చేస్తున్న దాడులు, తనిఖీల్లో వెల్లడైనవే కావడం గమనార్హం. హైదరాబాద్‌తోపాటు వివిధ జిల్లాల్లో గత ఏడెనిమిది నెలలుగా డీసీఏ తనిఖీలు చేస్తోంది. ఒకవైపు కేసుల నమోదు, నకిలీ మందుల స్వాధీనం వంటివి జరుగుతున్నా... మరోవైపు యథేచ్ఛగా అక్రమాలు కొనసాగుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి కల్తీ ఔషధాలు రాష్ట్రానికి కుప్పలు తెప్పలుగా తీసుకొస్తుండగా మరికొన్ని రాష్ట్రంలోనే తయారవుతున్నాయి.

ఉత్తరాది నుంచి ఉత్తుత్తి ఔషధాలు 

హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని కాశీపుర్, కొత్‌ద్వార్‌లలో తయారైన నకిలీ మందులు రాష్ట్రానికి యథేచ్ఛగా వస్తున్నాయి. ఈ వ్యవహారంలో భారీ రాకెట్‌ను డీసీఏ ఛేదించింది. అక్కడ నుంచి కొరియర్‌ కంపెనీల ద్వారా మందులను తెప్పించి ఇక్కడ విక్రయిస్తున్నారు. వాటిలో యాంటీబయాటిక్స్, రక్తపోటు, కొలెస్ట్రాల్‌ తగ్గించేవి ఉన్నాయి. ప్రముఖ తయారీ సంస్థలైన సన్‌ఫార్మా, గ్లెన్‌మార్క్‌ ఫార్మా, అరిస్టో ఫార్మా వంటి సంస్థల మాత్రలు, మందులకు నకిలీలను తయారు చేయిస్తున్నారు. 

అనుమతి లేని మెడికల్‌ షాపులు 

రాష్ట్రంలో లైసెన్సు లేని మెడికల్‌ షాపులు భారీగా వెలుగు చూస్తున్నాయి. హైదరాబాద్‌ సహా రాష్ట్రంలో మండల కేంద్రాలు, గ్రామాల వరకు ఇదే పరిస్థితి ఉంది. వివిధ నర్సింగ్‌హోంలు సైతం అనుమతి తీసుకోకుండానే మెడికల్‌ షాపులను నిర్వహిస్తున్నాయి. గ్రామాల్లో ఆర్‌ఎంపీలు ఇళ్లలోనే మందుల దుకాణాలు నడుపుతున్నారు. 

ఇష్టారాజ్యంగా ధరలు 

ధరల సీలింగ్‌ ఉన్న మందులకు తప్పుడు గరిష్ఠ ధరలను ముద్రిస్తూ 30-40% వరకు అధికంగా తీసుకుంటున్నారు. ఇలాంటి వ్యవహారాలపై ఇటీవల 50కి పైగా కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌లోని బీరంగూడ, మల్కాజిగిరిలో వాస్ఫిన్‌-ఓ 5 ఎంజీ ఆయింట్‌మెంట్‌ను రూ.113.60లకు కాకుండా రూ.140కి విక్రయించిన తీరు వెల్లడైంది. ఇట్రాకాప్‌-200 పది మాత్రలకు రూ.247.70 తీసుకోవాల్సి ఉండగా రూ.285కి అమ్ముతున్నారు. 

క్యాన్సర్‌నూ తగ్గిస్తామని దగా 

మధుమేహం, రక్తపోటు తగ్గిస్తాయని, కిడ్నీలు, గాల్‌బ్లాడర్‌లో రాళ్లను కరిగిస్తాయని చివరకు క్యాన్సర్‌లాంటి ప్రాణాంతక వ్యాధుల్నీ బాగు చేస్తాయని ఆయుర్వేద మందులను విక్రయిస్తున్నారు. అనుమతి లేకుండా కాస్మొటిక్‌ లైసెన్సు లేకుండా కుటీర పరిశ్రమల స్థాయిలో రకరకాల సౌందర్య లేపనాల తయారీ కొనసాగిస్తున్నారు. 

తనిఖీల్లో వెలుగు చూసిన వాస్తవాలు 

  • ఫుడ్‌లైసెన్స్‌ అనుమతి తీసుకుని మందు బిళ్లల తయారీ. పెప్టిక్‌ అల్సర్లను, జ్వరాలను తగ్గిస్తాయని పేర్కొంటూ నకిలీ మందుల విక్రయం.  ప్రముఖ కంపెనీల దొంగ లేబుళ్లు, అల్యూమినియం ఫాయిల్స్, ఇతర ప్యాకింగ్‌ మెటీరియల్‌ తయారీకి ప్రత్యేకంగా వెలిసిన సంస్థలు.  
  • ధరల నియంత్రణ ఉన్న ఔషధాలను సైతం ఇష్టారాజ్యంగా అధిక ధరలకు విక్రయించడం. 
  • అక్రమంగా బ్లడ్‌బ్యాంకుల నిర్వహణ. అనుమతి లేకుండానే దాతల నుంచి ప్లాస్మాను సేకరించడం. 
  • ఇన్సులిన్‌లాంటి వాటిని సైతం గది ఉష్ణోగ్రత వద్దే భారీ పరిమాణంలో నిల్వ ఉంచడం. భారీ పరిమాణంలో ఔషధాలను బిల్లులు లేకుండానే కొనడం.  నిబంధనలకు విరుద్ధంగా దగ్గు మందుల నిల్వ, విక్రయం. లక్షల రూపాయల విలువైన గడువు ముగిసిన మందులు. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని