MBBS: రాష్ట్రంలో పెరగనున్న ఎంబీబీఎస్‌ సీట్లు

రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో ప్రవేశాలు చేపట్టడానికి అనుగుణంగా తనిఖీల ప్రక్రియ చురుకుగా కొనసాగుతోంది. పాత మెడికల్‌ కాలేజీల్లో జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) వర్చువల్‌ తనిఖీలను ఇప్పటికే పూర్తి చేసింది.

Published : 25 May 2024 04:17 IST

కొత్తగా ఎనిమిది ప్రభుత్వ, రెండు ప్రైవేటు వైద్య కళాశాలలు
పదేళ్లు ముగుస్తున్న నేపథ్యంలో కన్వీనర్‌ కోటా సీట్లపైనా దృష్టి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో ప్రవేశాలు చేపట్టడానికి అనుగుణంగా తనిఖీల ప్రక్రియ చురుకుగా కొనసాగుతోంది. పాత మెడికల్‌ కాలేజీల్లో జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) వర్చువల్‌ తనిఖీలను ఇప్పటికే పూర్తి చేసింది. ఈ నెలాఖరులో కొత్త వైద్య కళాశాలల్లో నేరుగా తనిఖీలు చేయనుంది. అనంతరం 2024-25 విద్యా సంవత్సరంలో కొత్తగా వైద్య కళాశాలల్లో అడ్మిషన్లకు పూర్తిస్థాయి అనుమతులను ఇస్తుంది. జూన్‌ రెండోవారంలో ఎంబీబీఎస్‌ అడ్మిషన్ల ప్రక్రియ మొదలవుతుందని వైద్య విద్య డైరెక్టరేట్‌ (డీఎంఈ) వర్గాలు తెలిపాయి. కొత్త కాలేజీలతోపాటు ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో తెలంగాణ విద్యార్థులకు అదనంగా సీట్లు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. రాష్ట్రంలో ములుగు, గద్వాల, నారాయణపేట, నర్సంపేట, మెదక్, భువనగిరి, కుత్బుల్లాపూర్, మహేశ్వరంలలో కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు ఎన్‌ఎంసీ ప్రాథమిక అనుమతిచ్చింది. వీటిల్లో తరగతుల ప్రారంభానికి వీలుగా పలుచోట్ల కొత్త భవనాల నిర్మాణం కొనసాగుతోంది. వీటికి అనుబంధ ఆసుపత్రులను సిద్ధం చేస్తున్నారు. కొత్త భవనాలు పూర్తికాని చోట అందుబాటులో ఉన్న ప్రభుత్వ/ప్రైవేటు భవనాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి కొత్త వైద్య కళాశాలకు విధిగా 220 పడకల ఆసుపత్రి అనుబంధంగా ఉండాలని, తరగతుల ప్రారంభం నాటికే అక్కడ పూర్తిస్థాయిలో వైద్యం అందాలని ఎన్‌ఎంసీ నిబంధన విధించింది. 

ఆ కన్వీనర్‌ సీట్లపై  ప్రభుత్వ నిర్ణయం కీలకం 

రాష్ట్రంలో గత విద్యా సంవత్సరం వరకు 56 వైద్య కళాశాలలు ఉన్నాయి. వీటిలో 8,440 ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్నాయి. తాజాగా ఎనిమిది ప్రభుత్వ, రెండు ప్రైవేటు వైద్య కళాశాలలకు పూర్తి స్థాయిలో అనుమతులు లభిస్తే మరో 500 సీట్లు అదనంగా వస్తాయి. దీంతోపాటు తెలంగాణ ఏర్పాటై పదేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో విభజన చట్టం ప్రకారం కన్వీనర్‌ కోటా సీట్లు పూర్తిగా తెలంగాణ విద్యార్థులకు దక్కుతాయని వైద్యారోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. అంటే, జాతీయ కోటా పోగా మిగిలిన సీట్లు రాష్ట్ర విద్యార్థులకే లభించే అవకాశాలు ఉన్నాయి. అయితే, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర పునర్విభజన చట్టం మేరకు 2014 నుంచి కన్వీనర్‌ కోటా సీట్లలో 15% సీట్లకు ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు సైతం పోటీ పడుతున్నారు. ఈ ఏడాది జూన్‌ రెండో తేదీతో పదేళ్ల గడువు పూర్తికానుంది. గత ఏడాదే అప్పటి ప్రభుత్వం తెలంగాణ, ఏపీ విద్యార్థులు ఉమ్మడిగా పోటీపడే ఎంబీబీఎస్‌ సీట్లపై దృష్టి సారించింది. రెండు రాష్ట్రాల విద్యార్థులు పోటీపడే 15% సీట్లను 2014కు ముందు ఏర్పాటైన 20 వైద్య కళాశాలలకే పరిమితం చేసింది. 2014 తర్వాత ఏర్పడిన 36 కళాశాలల్లోని మొత్తం సీట్లు రాష్ట్ర విద్యార్థులకు దక్కేలా ఉత్తర్వులిచ్చింది. అందుకనుగుణంగా తెలంగాణ మెడికల్, డెంటల్‌ కాలేజీల అడ్మిషన్‌ నిబంధనలు-2017లో సవరణలు చేసింది. దాంతో ఏపీ విద్యార్థులు కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు