Medigadda Barrage: మేడిగడ్డకు కొత్త సమస్యలు

మేడిగడ్డ బ్యారేజీకి తాత్కాలిక మరమ్మతుల్లో కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. దిగువ భాగాన గతంలో భారీ గొయ్యి ఏర్పడగా 25వేలకు పైగా ఇసుక బస్తాలతో పూడ్చివేశారు.

Updated : 25 May 2024 07:00 IST

ఏడో బ్లాక్‌ ప్రాంతంలో భారీ బుంగ
మరికొన్ని చిన్నచిన్నవి కూడా
తాత్కాలిక మరమ్మతుల్లో వెలుగులోకి
పూడ్చివేసిన ఇంజినీరింగ్‌ అధికారులు

మేడిగడ్డ బ్యారేజీ ఎగువ ప్రాంతంలో 20 పియర్‌ వద్ద బయటపడిన బుంగ

ఈనాడు హైదరాబాద్‌; మహదేవపూర్, న్యూస్‌టుడే: మేడిగడ్డ బ్యారేజీకి తాత్కాలిక మరమ్మతుల్లో కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. దిగువ భాగాన గతంలో భారీ గొయ్యి ఏర్పడగా 25వేలకు పైగా ఇసుక బస్తాలతో పూడ్చివేశారు. తాజాగా ఏడో బ్లాక్‌ వద్ద ఆ ప్రాంతాన్నంతా శుభ్రం చేస్తుండగా మరో భారీ బుంగ, మరికొన్ని చిన్న చిన్నవి కనిపించగా పూడ్చివేశారు. మరోవైపు బ్యారేజీ నిర్మాణానికి ముందుగా జియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(జీఎస్‌ఐ) అధికారులు నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించి ఇచ్చిన ఇన్వెస్టిగేషన్‌ నివేదిక అందుబాటులో లేదని తెలిసింది. ‘అసలు జీఎస్‌ఐతో సర్వే చేయించారా లేదా అనేదానిపై కూడా స్పష్టత లేదు. కీలకమైన ఈ నివేదిక జీఎస్‌ఐ దగ్గర ఉంటే తీసుకొనే ప్రయత్నం చేస్తాం’ అని నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొన్నాయి. వర్షాకాలంలోగా గేట్లన్నీ తెరిచి ఉంచాలని నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథార్టీ(ఎన్‌డీఎస్‌ఏ) సూచించగా, 8 గేట్లు పైకెత్తడం సమస్యగా మారినట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్‌ చేపట్టిన తర్వాతనే ఎలాంటి సమస్యలున్నాయి, ఏం చేయాలనే దానిపై ఓ అంచనాకు రావడం సాధ్యమవుతుందని నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.

20వ పియర్‌ ప్లాట్‌ఫాం ఎదుట....

మేడిగడ్డ బ్యారేజీ తాత్కాలిక మరమ్మతుల్లో భాగంగా కుంగిన ఏడో బ్లాక్‌ వద్ద ఏరియా క్లియరెన్స్‌ పనులను చేపట్టారు. ఆ ప్రాంతంలో ఉన్న నీటిని పూర్తిగా తోడేయగా 20వ పియర్‌ ప్లాట్‌ఫాం ఎదుట పెద్ద బుంగ బయటపడింది. బుంగను ఇంజినీరింగ్‌ అధికారులు గుర్తించి శుక్రవారం సాయంత్రానికి పూడ్చేశారు. ఏడో బ్లాక్‌ ప్రదేశంలో పలు చోట్ల చిన్న బుంగలు ఏర్పడగా వాటిని కూడా పూడ్చేసినట్లు తెలిసింది. గతంలో బ్యారేజీకి దిగువన సీకెంట్‌ పైల్స్‌కు 20 మీటర్ల దూరంలో భారీ గొయ్యి బయటపడగా ఇసుక బస్తాలతో పూడ్చేశారు. అయితే ఇప్పుడు సీసీ బ్లాకులకు దగ్గరగా పెద్ద బుంగను గుర్తించారు. ఇన్వెస్టిగేషన్స్‌ పూర్తయితే కానీ వాటి తీవ్రత, ఏర్పడటానికి కారణం తెలియదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ‘బుంగలు పడటమంటే ఫాల్ట్‌జోన్‌ ఉన్నట్లుగా భావించాల్సి ఉంటుంది. పైన అంతా ఇసుక గట్టిగానే ఉండి మధ్యలో నీటి ప్రవాహం ఉండటం, బర్రీడ్‌ ఛానల్స్‌ ఏమైనా ఉన్నాయా అనే అంశాన్ని కూడా పరిశీలించి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది’ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ పరీక్షలకు సంబంధించి ఎన్‌డీఎస్‌ఏ ఇచ్చిన మధ్యంతర నివేదికలో కూడా పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఎన్‌డీఎస్‌ఏ మధ్యంతర నివేదికలో పేర్కొన్న ఐ.ఎస్‌.కోడ్‌లు నిర్మాణ సంస్థలతో చేసుకొన్న ఒప్పందాల్లో లేవని, దానివల్ల నిర్మాణ సమయంలో ఈ పరీక్షలు చేసి ఉండకపోవచ్చని కూడా ఇంజినీర్లు పేర్కొంటున్నారు.

మేడిగడ్డ బ్యారేజీ దిగువన సీసీ బ్లాక్‌ల అమరిక పనులు 

ఎనిమిది గేట్లు మినహా...

మేడిగడ్డ బ్యారేజీలో మొత్తం 85 గేట్లున్నాయి. వర్షాకాలం ప్రారంభానికి ముందే ఈ గేట్లన్నీ ఎత్తి ఉంచాలని ఎన్‌డీఎస్‌ఏ  సూచించింది. ఇందులో భాగంగా ఒకటి నుంచి ఆరో బ్లాక్‌ వరకు, అలాగే ఎనిమిదో బ్లాక్‌లోను ఉన్న మొత్తం గేట్లు 74 పూర్తి స్థాయి నీటిమట్టం వరకు ఎత్తి ఉంచారు. దెబ్బతిన్న ఏడో బ్లాక్‌లో మొత్తంగా 11 గేట్లు ఉండగా ఎనిమిది గేట్లపై ప్రభావం ఉండడంతో అవి మూసి ఉన్నాయి. ఇందులో మిగిలిన వాటితో కూడా కలిపి మొత్తం 77 గేట్లు పైకెత్తారు. రెండు గేట్లను పూర్తిగా తొలగించాలి. ఆరు ఎత్తాల్సి ఉంది. ఇందులో ఒక గేటు 90 మీటర్ల వరకు మాత్రమే ఎత్తారు. మిగిలిన గేట్లన్నీ అలానే ఉన్నాయి. 16వ నంబరు గేటు ఎత్తే ప్రయత్నం చేయగా పగుళ్లు మరింత పెరగడంతో నిలిపివేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో మిగిలిన గేట్లను ఎత్తడం సమస్యగా మారే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఎత్తడానికి వీలు లేకుంటే ఈ గేట్లను కూడా తొలగించాలి. ఏడో బ్లాక్‌ ప్రాంతంలో షీట్‌ పైల్స్‌ పనులు చేయడానికి కసరత్తు చేస్తున్నారు. బ్యారేజీ దిగువన సీసీ బ్లాక్‌ అమరిక పనులు ప్రారంభించారు. బోర్‌వెల్‌ డేటా కోసం డ్రిల్లింగ్‌ కూడా చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని