Medigadda: మేడిగడ్డ పునరుద్ధరణ బాధ్యత నిర్మాణ సంస్థదే

‘మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనలో పునరుద్ధరణ పనులను నిర్మాణ సంస్థే చేయాల్సి ఉండగా ఎందుకు చేయడం లేదు? పని పూర్తి కాకుండానే సర్టిఫికెట్‌ ఇచ్చిన ఇంజినీర్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదు’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.

Published : 19 May 2024 06:24 IST

మంత్రి ఉత్తమ్‌తో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 
ఎన్డీఎస్‌ఏ నివేదికపై సుదీర్ఘ చర్చ
బాధ్యులపై క్రిమినల్‌ చర్యలకు వెనకాడొద్దని స్పష్టీకరణ 
వచ్చే వారంలో ప్రాజెక్టు వద్దకు సీఎం

ఈనాడు, హైదరాబాద్‌: ‘మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనలో పునరుద్ధరణ పనులను నిర్మాణ సంస్థే చేయాల్సి ఉండగా ఎందుకు చేయడం లేదు? పని పూర్తి కాకుండానే సర్టిఫికెట్‌ ఇచ్చిన ఇంజినీర్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదు’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ‘పని పూర్తయితే, నిర్మాణ సంస్థ గడువు పొడిగించాలని ఎందుకు కోరింది? నీటిపారుదల శాఖ ఎందుకు పొడిగించింది? నిర్మాణ సంస్థపైన, బాధ్యులైన ఇంజినీర్లపైన ఎందుకు చర్యలు తీసుకోలేదు? మొత్తం రికార్డులన్నీ పరిగణనలోకి తీసుకొని నిర్మాణ సంస్థతోనే పని చేయించాలి’ అని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం నుంచి అనుమతి రాక శనివారం మంత్రివర్గ సమావేశం వాయిదా పడగా... మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథార్టీ(ఎన్డీఎస్‌ఏ) ఇచ్చిన మధ్యంతర నివేదిక, వర్షాకాలంలోగా చేయాలని సూచించిన పనుల గురించి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి.. ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. ఆ సమయంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం... ఎన్డీఎస్‌ఏ నివేదికలో ఉన్న ముఖ్యమైన అంశాలు, సిఫార్సులన్నింటినీ ఉత్తమ్‌ వివరించారు. ‘2019లోనే బ్యారేజీలకు ప్రమాదం ఉన్నట్లు తేలింది. మరమ్మతులు, పునరుద్ధరణ చర్యలు చేపట్టినా ప్రాజెక్టుకు ముప్పు ఉండదని తోసిపుచ్చలేం’ అని ఎన్డీఎస్‌ఏ తన నివేదికలో స్పష్టం చేసిందని ఉత్తమ్‌ వివరించారు. మరో నెల రోజుల్లో వర్షాకాలం ప్రారంభమవుతున్నందున ఈలోగా తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించాల్సి ఉంటుందని సీఎం అన్నారు. రిపేర్లు చేయాలా.. ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయా.. మరింత నష్టం జరగకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలనే విషయాలపై ఇరిగేషన్‌ అధికారులతో కలిసి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ‘ఎన్డీఎస్‌ఏ చెప్పిన విధంగా ముందుకు వెళ్లాలి. ఏజెన్సీతో పనులు చేయించాలి. వచ్చే వారం నేను మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లకు వెళ్తా. అక్కడి పంపు హౌస్‌లను పరిశీలిస్తా’ అని ముఖ్యమంత్రి చెప్పారు. ఎన్డీఎస్‌ఏ సూచన మేరకు మూడు బ్యారేజీలకు జియోటెక్నికల్, జియో ఫిజికల్‌ ఇన్వెస్టిగేషన్స్‌ చేయించాల్సి ఉందని మంత్రి ఉత్తమ్‌ వివరించారు. ఆ సూచనలను పరిగణనలోకి తీసుకొని ప్రముఖ సంస్థలతోనే ఇన్వెస్టిగేషన్‌ చేయించాలని ముఖ్యమంత్రి చెప్పారు. అవసరమైతే రెండు, మూడు సంస్థలను ఎంపిక చేసి చేయించాలని సూచించారు. సి.డబ్ల్యు.పి.ఆర్‌.ఎస్‌., ఎన్‌.జి.ఆర్‌.ఐ. తదితర సంస్థలతో చేయించాలని నిపుణుల కమిటీ సూచించినట్లు మంత్రి.. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

రికార్డులన్నీ కమిషన్‌కు అప్పగించండి.. 

2019లోనే బ్యారేజీకి నష్టం వాటిల్లితే మళ్లీ పూర్తి స్థాయిలో నీటిని ఎలా పెట్టారనే అంశంపైన, డిజైన్‌ సరిగా లేదని, షూటింగ్‌ వెలాసిటీ.. డిజైన్‌ కంటే ఎక్కువ వచ్చిందని వివిధ ఏజెన్సీలు పేర్కొనడంపైన కూడా చర్చించినట్లు తెలిసింది. దీనిపై అప్పటి సీడీవో ఇంజినీర్లతో చర్చించానని, డిజైన్‌ సరిగా ఉన్నా, దానికి తగ్గట్లుగా నిర్మాణం జరగలేదని జవాబిచ్చారని మంత్రి ఉత్తమ్‌... సీఎం రేవంత్‌కు చెప్పినట్లు సమాచారం. డిజైన్, ఎగ్జిక్యూషన్, ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్, క్వాలిటీ కంట్రోల్‌ ఇలా అన్నింటిలో వైఫల్యం చెందినట్లు స్పష్టంగా కనిపిస్తోందని, ఈ అంశాలకు సంబంధించిన రికార్డులన్నింటినీ జ్యుడిషియల్‌ కమిషన్‌కు అప్పగించాలని సీఎం సూచించినట్లు సమాచారం. ‘పని పూర్తయినట్లు సర్టిఫికెట్‌ ఇచ్చారు.. తర్వాత పెండింగ్‌లో ఉన్న పనిని పూర్తి చేయడానికి ఎక్స్‌టెన్షన్‌ ఆఫ్‌ టైం(ఈవోటీ) ఇచ్చారు... ఫైనల్‌ బిల్లు కాలేదు... అంటే ఇచ్చిన సర్టిఫికెట్‌కు విలువ లేదనే కదా! దానిని ఎందుకు రద్దు చేయలేదు’ అని కూడా ముఖ్యమంత్రి అడిగినట్లు తెలిసింది. ‘ఇందులో బ్యారేజీ ఇంజినీర్లు, నిర్మాణ సంస్థ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. వారిపైన చర్యలు తీసుకోవాలి. అవసరమైతే క్రిమినల్‌ చర్యలకు కూడా వెనుకాడవద్దు’ అని సీఎం రేవంత్‌ స్పష్టం చేసినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని