Medigadda: మేడిగడ్డ గేట్ల తొలగింపు పనుల ప్రారంభం

కాళేశ్వరం ఎత్తిపోతలలోని మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్‌లో గేట్లను తొలగించే పనులను అధికారులు ప్రారంభించారు.

Published : 26 May 2024 04:57 IST

నాలుగింటిని కట్‌ చేసి తొలగించే యోచనలో అధికారులు
ఏడో బ్లాక్‌లోకి నీటి ప్రవాహం రాకుండా మళ్లింపు

మేడిగడ్డ బ్యారేజీ ఎగువన ఏడో బ్లాక్‌ 20 పియర్‌ ఎదుట బయటపడిన బుంగ వద్ద నిషేధిత ప్రదేశంగా ఏర్పాటు 

మహదేవపూర్, న్యూస్‌టుడే: కాళేశ్వరం ఎత్తిపోతలలోని మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్‌లో గేట్లను తొలగించే పనులను అధికారులు ప్రారంభించారు. 20, 21 గేట్లను పూర్తిగా తొలగించాలని నేషనల్‌ డ్యాం సేప్టీ అథారిటీ (ఎన్‌.డి.ఎస్‌.ఎ.) సూచించింది. ఏడో బ్లాక్‌లో ఏడు గేట్లను ఎత్తే ప్రక్రియ మిగిలి ఉంది. 18, 19, 20, 21 పియర్‌ల గేట్లు ఎత్తడానికి వీలు లేకపోవడంతో వాటిని కట్‌ చేసి తొలగించే యోచనలో అధికారులు ఉన్నారు. శనివారం 20వ గేటు కటింగ్‌ పనులను ప్రారంభించారు. ఈ బ్లాక్‌లోని మిగిలిన మూడు గేట్లు ఎత్తడానికి వీలుగా ఉన్నట్లు అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు, బ్యారేజీ దిగువన ఏడో బ్లాక్‌ ప్రాంతంలో భారీగా నీటి ఊటలు వస్తున్నట్లు తెలుస్తోంది. వాటిని గుర్తించి, నియంత్రించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. 

రోజుకో సమస్య..

మేడిగడ్డ బ్యారేజీ తాత్కాలిక పునరుద్ధరణ చర్యల్లో రోజుకో సమస్య ఎదురవుతోంది. మూసిఉన్న గేట్లను ఎత్తే ప్రక్రియలో భాగంగా 15వ గేటును ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎత్తారు. 16వ గేటు ఎత్తే క్రమంలో ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. మిగతా గేట్లను ఎత్తడానికి సమాయత్తం అవుతూనే.. ఏడో బ్లాక్‌ ప్రదేశంలో పునరుద్ధరణ చర్యలను కొనసాగిస్తున్నారు. శుక్రవారం పనులు చేస్తున్న క్రమంలో 20వ పియర్‌ వద్ద భారీ బుంగను ఇంజినీరింగ్‌ అధికారులు గుర్తించారు. ఇసుక, ఇసుక బస్తాలు వేసి పూడ్చివేశారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు పూర్తిస్థాయి పరిశీలన, బుంగల సమస్య తీరేవరకు ఈ ప్రాంతాన్ని నిషేధిత ప్రదేశంగా ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలో పలు చిన్న చిన్న బుంగలు ఏర్పడగా.. వాటిని సైతం పూడ్చి వేశారు. బ్యారేజీ దిగువన సీసీ బ్లాక్‌ల ఏర్పాటు పనులు కొనసాగిస్తున్నారు. ఏడో బ్లాక్‌ ప్రాంతంలోకి నీటి ప్రవాహం రాకుండా మళ్లింపు పనులు చేపట్టారు.


మేడిగడ్డ బ్యారేజీ దిగువన నీటి ఊటలు వస్తున్నట్లు భావిస్తున్న ప్రదేశం

అనధికార ఆంక్షలు!

మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతిన్న రోజు నుంచి మీడియా, సామాన్య ప్రజలు లోపలికి వెళ్లకుండా ఆంక్షలు ఉండగా.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వాటిని ఎత్తివేసింది. తాజాగా మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ చర్యలు చేపడుతున్న నేపథ్యంలో అనధికార ఆంక్షలను కొనసాగిస్తున్నారు. ఇతరులెవరూ లోనికి వెళ్లకుండా నిర్మాణ సంస్థ ప్రైవేటు సిబ్బంది ద్వారా కట్టడి చేస్తోంది. ఈ విషయమై సంబంధిత శాఖ అధికారులను సంప్రదించడానికి ప్రయత్నిస్తే అందుబాటులోకి రావడం లేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సూచన, ఆదేశాలు లేనప్పటికీ మేడిగడ్డ ప్రాంతంలో అనధికార ఆంక్షలు సాగుతున్నాయి. 

గేటు తొలగించేందుకు కటింగ్‌ పనులు


సీకెంట్‌ పైల్స్‌ నిర్మాణంపై దృష్టి  

ఈనాడు, హైదరాబాద్‌: మేడిగడ్డ బ్యారేజీని వరద ముప్పు నుంచి రక్షించేందుకు ఉన్న మార్గాలపై జ్యుడిషియల్‌ కమిషన్‌ ఆదేశాల మేరకు ఏర్పాటైన కమిటీ దృష్టి సారించింది. ఎన్‌.డి.ఎస్‌.ఎ. అందించిన మధ్యంతర నివేదిక ప్రకారం కాళేశ్వరం ఎత్తిపోతలలోని మూడు బ్యారేజీల వద్ద పరిరక్షణ చర్యల పర్యవేక్షణకు ఈ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఛైర్మన్, ఈఎన్సీ (జనరల్‌) అనిల్‌కుమార్‌ నేతృత్వంలో హైదరాబాద్‌లో శనివారం కమిటీ సమావేశమైంది. బ్యారేజీ పరిరక్షణ చర్యలపై చర్చించింది. ఎగువ భాగంలో సీకెంట్‌ పైల్స్‌ నిర్మాణం చేపట్టడం ద్వారా వరద ముప్పు నుంచి బ్యారేజీకి రక్షణ ఉంటుందని, గేట్లు పూర్తిగా తెరిచి ఉంచాలని, గ్రౌటింగ్‌ పనులకు సంబంధించి ఎన్‌.డి.ఎస్‌.ఎ. కమిటీ అనుమతుల కోసం లేఖ రాయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఐఐటీ హైదరాబాద్‌ ప్రొఫెసర్‌ శశిధర్‌ను ఈ సమావేశానికి ఆహ్వానించి.. పలు సూచనలు తీసుకున్నారు. సమావేశంలో ఓ అండ్‌ ఎం ఈఎన్సీ నాగేంద్రరావు, సీడీవో సీఈ మోహన్‌ కుమార్, రామగుండం సీఈ సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు