Komatireddy: రహదారుల విషయంలో అశ్రద్ధ వద్దు

గడిచిన అయిదేళ్లలో రాష్ట్రంలో రహదారులకు మరమ్మతులు చేయకపోవడంతో అధ్వానంగా తయారయ్యాయని రహదారులు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.

Published : 06 Jun 2024 06:04 IST

వెంటనే మరమ్మతులు చేపట్టండి
ఆసుపత్రుల నిర్మాణంలో వేగం పెంచాలి:  మంత్రి కోమటిరెడ్డి 

ఈనాడు, హైదరాబాద్‌: గడిచిన అయిదేళ్లలో రాష్ట్రంలో రహదారులకు మరమ్మతులు చేయకపోవడంతో అధ్వానంగా తయారయ్యాయని రహదారులు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. కొత్త రహదారులు నిర్మించకపోవడంతో ఉన్న వాటిపైనే వాహనాల రద్దీ పెరిగిందని తెలిపారు. వెంటనే పరిస్థితిని చక్కదిద్దాలని అధికారులను ఆదేశించారు. ప్రజల జీవితాలను ప్రభావితం చేసే రహదారుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రహదారులను పర్యవేక్షించేందుకు నిరంతర వ్యవస్థను ఏర్పాటు చేయాలని మార్గనిర్దేశం చేశారు. సచివాలయంలో బుధవారం ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తరవాత రహదారుల పరిస్థితిపై సమీక్షించేందుకు సమయం లేకుండా పోయిందని, వెంటనే లోక్‌సభ ఎన్నికల కోడ్‌ వచ్చిందని, ఇప్పటికైనా రహదారులపై దృష్టి సారించాలని పేర్కొన్నారు.

నగరానికి నాలుగు వైపులా నిర్మిస్తున్న ఆసుపత్రుల నిర్మాణంలో జాప్యం జరగటంపై మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఎల్బీనగర్, అల్వాల్‌ ఆసుపత్రుల నిర్మాణానికి నిరభ్యంతర పత్రం కావాలంటే నాలుగు రోజుల్లోనే ఇప్పించాను. ఇంకా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి కృషి చేస్తా. పనుల్లో మాత్రం అలసత్వాన్ని సహించేది లేదు. నిమ్స్, ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులకు రోగుల తాకిడి ఎక్కువగా ఉంది. పడకలు, వెంటిలేటర్లు సరిపడా లేని కారణంగా రోగులు ఇబ్బందులు పడుతున్నారు. వీలును బట్టి బ్లాకుల వారీగా నిర్మించి సేవలు నిర్వహిస్తూ సమాంతరంగా పనులు చేపట్టేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలి. ఆసుపత్రుల నిర్మాణానికి అవసరమైన రూ.5,000 కోట్లను బ్యాంకులు రుణంగా ఇస్తున్న దృష్ట్యా పనులు నిర్వహించటంలో జాప్యం జరగకుండా చూడాలి. సెంట్రల్‌ రోడ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌(సీఆర్‌ఐఎఫ్‌) పనులను కూడా త్వరితగతిన ప్రారంభించాలి’ అని ఆదేశించారు. 

పార్కింగ్‌ సదుపాయం లేకుండా సచివాలయ నిర్మాణమా?

పార్కింగ్‌ సదుపాయం లేకుండా సచివాలయ భవన నిర్మాణానికి ఎలా అనుమతించారో అర్థం కావటం లేదని ఈ సందర్భంగా మంత్రి వ్యాఖ్యానించారు. ‘కనీసం 750 నుంచి వెయ్యి వాహనాలను నిలిపేందుకు వీలుగా సౌకర్యాలు కల్పించాలి. పార్కింగ్‌ ప్రాంగణం నిర్మించేందుకు ఇప్పటికే రూ.30 కోట్లు మంజూరయ్యాయి. ఆ పనులకు తక్షణం టెండర్లు ఆహ్వానించాలి. సచివాలయంలో చేపట్టే పనులు ఉద్యోగులు, సిబ్బందికి ఉపయుక్తంగా ఉండాలి. అధికారుల వాహనాల డ్రైవర్లు మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత నిర్మాణాలు చేపట్టాలి’ అని ఆదేశాలిచ్చారు. హైదరాబాద్‌ కలెక్టరేట్‌ నిర్మాణంపైనా అధికారులను ఆరా తీశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని