Kaleshwaram: ఊపందుకొంటున్న ‘కాళేశ్వరం’ మరమ్మతులు

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో తాత్కాలిక మరమ్మతుల పనులు, ఇన్వెస్టిగేషన్స్‌ ఇప్పుడిప్పుడే ఊపందుకొంటున్నాయి.

Published : 08 Jun 2024 06:33 IST

పనులకోసం మరిన్ని యంత్రాల సమీకరణ
పురోగతిని తెలుసుకున్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 

సుందిళ్ల బ్యారేజీ వద్ద అధికారులతో మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో తాత్కాలిక మరమ్మతుల పనులు, ఇన్వెస్టిగేషన్స్‌ ఇప్పుడిప్పుడే ఊపందుకొంటున్నాయి. గ్రౌటింగ్, చెల్లాచెదురైన సీసీబ్లాక్‌ల పునరుద్ధరణ, సీపేజీని గుర్తించి అరికట్టడం,  ఇసుక తొలగింపు, ఇన్వెస్టిగేషన్స్‌ ఇలా అనేక పనులు చేయాలని నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథార్టీ(ఎన్‌డీఎస్‌ఏ) సూచించింది. గత కొన్ని రోజులుగా ఈ పనులు జరుగుతున్నాయి. ఒక బ్యారేజీలో ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతుంటే, రెండు బ్యారేజీల్లో కొన్ని రోజుల క్రితం ప్రారంభమై వేగం అందుకొంటున్నాయి. పనులకోసం మరిన్ని యంత్రాలను సమీకరిస్తున్నారు. పురోగతిని తెలుసుకొనేందుకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి... ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ అనిల్‌కుమార్‌తో కలిసి శుక్రవారం కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగమైన సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల్లో మరమ్మతులను పరిశీలించారు. ఎన్‌డీఎస్‌ఏ సూచించిన ప్రకారం పనులు చేయాలని, ప్రతి రోజు పనుల పురోగతి గురించి నివేదిక ఇవ్వాలని ఇంజినీర్లను మంత్రి ఆదేశించారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని ఏజెన్సీలకు సూచించారు. ఎలాంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని కోరారు. 

మేడిగడ్డ పియర్‌కు స్కానింగ్‌ చేస్తున్న దిల్లీకి చెందిన సీ.ఎస్‌.ఎం.ఆర్‌.ఎస్‌. ప్రతినిధులు

సుందిళ్ల బ్యారేజీలో... 

సుందిళ్ల బ్యారేజీలో చెల్లా చెదురైన సీసీబ్లాక్‌లను అమర్చే పని ప్రారంభమైంది. ఇక్కడ నాలుగు వెంట్లలో సీపేజీ ఉందని, గ్రౌటింగ్‌ ఇంకా ప్రారంభం కాలేదని ఈఎన్సీ మంత్రి దృష్టికి తెచ్చారు. ‘గ్రౌటింగ్‌ చేసేందుకు బోర్‌హోల్స్‌ వేయడం, గ్రౌటింగ్‌ చేయడం, జియో టెక్నికల్‌ ఇన్వెస్టిగేషన్స్‌కు బోర్‌హోల్స్‌ వేయడం ఇంకా ప్రారంభం కాలేదు. సీసీ బ్లాకులను పునరుద్ధరించే పని ఇంకా 59 వెంట్ల వద్ద చేయాల్సి ఉంది’ అని ఇంజినీర్లు తెలిపారు. పెండింగ్‌ పనులపై ఎస్‌ఈ కరుణాకర్, ఈఈ ఓంకార్‌సింగ్‌ను మంత్రి ప్రశ్నించారు. ‘ఎన్‌డీఎస్‌ఎ నివేదిక ప్రకారం పనులు చేయాలని ఏజెన్సీకి ఎప్పుడు లేఖ ఇచ్చారు? ఆ ప్రకారం పనులు జరుగుతున్నాయో లేదో ఎందుకు పట్టించుకోలేదు’ అని అడిగారు. ‘సీసీ బ్లాకుల పునరుద్ధరణ పని సగం అయిపోయింది. డీవాటరింగ్‌ చేసిన వెంటనే బోర్‌హోల్స్‌ వేసి గ్రౌటింగ్‌ చేస్తాం. నిర్ణీత సమయంలోగానే పనులు పూర్తి చేస్తాం’ అని నిర్మాణ సంస్థ నవయుగ డైరెక్టర్‌ రమేష్‌ మంత్రికి వివరించారు. వేగంగా చేస్తే సుందిళ్లలో పది రోజుల్లో పనులు అయిపోతాయని ఈఎన్సీ మంత్రి దృష్టికి తెచ్చారు.

మేడిగడ్డలో షీట్‌పైల్స్‌ పనితీరు గురించి తెలుసుకొనేందుకు చేస్తున్న డ్రిల్లింగ్‌

అదనపు స్టిల్లింగ్‌ బేసిన్‌ అవసరం

అన్నారంలో తాత్కాలిక మరమ్మతులు వేగంగా జరుగుతున్నాయని, శాశ్వత పరిష్కారానికి అదనపు స్టిల్లింగ్‌ బేసిన్‌ అవసరమని ఇంజినీర్లు, నిర్మాణ సంస్థ ప్రతినిధి మంత్రి దృష్టికి తెచ్చారు. చెల్లా చెదురైన సీసీ బ్లాకులను అమర్చడం, డ్రిల్లింగ్, గ్రౌటింగ్‌ ప్రారంభమయ్యాయని బ్యారేజీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ యాదగిరి, నిర్మాణ సంస్థ ఆప్కాన్స్‌ ప్రతినిధి మల్లికార్జునరావు వివరించారు. ‘సిమెంట్‌ గ్రౌటింగ్‌ చేశాం. పై నుంచి దిగువదాకా ఎక్కడా సీపేజీ కనిపించడం లేదు. అయినా ఉంటుందనే అభిప్రాయాన్ని ఎన్‌ఐటీ నిపుణులు వ్యక్తం చేశారు. దాంతో సిమెంట్‌ వాల్‌ గ్రౌటింగ్‌ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఇసుకను తీయించాం. ఎగువ, దిగువ 600 మీటర్ల దూరం నదిలో పరీక్ష చేయడానికి కూడా ఏర్పాటు చేశాం. పుణెలోని సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌(సెంట్రల్‌ వాటర్‌ అండ్‌ పవర్‌ రీసెర్చ్‌ స్టేషన్‌) నిపుణులు వచ్చి పరిశీలించారు. ఏమేం పరీక్షలు చేయాలో నివేదిక ఇచ్చారు. వారికి రూ.కోటి 13 లక్షలు చెల్లించాల్సి ఉంది’ అని తెలిపారు. ఈ చెల్లింపులలో ఎందుకు జాప్యం జరుగుతోందని మంత్రి అధికారులను ప్రశ్నించారు. 24 గంటల్లో చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని, 72 గంటల్లో పరీక్షలు ప్రారంభించాలని సూచించారు. మేడిగడ్డ, సుందిళ్లకు టెయిల్‌ వాటర్‌ ఉందని, అన్నారం బ్యారేజీకి లేకపోవడం వల్ల సమస్యలు వస్తున్నాయని ఇంజినీర్లు మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ సమస్య ఎందుకొచ్చిందని ప్రశ్నించగా, డిజైన్‌ లోపమని సమాధానమిచ్చారు. షూటింగ్‌ వెలాసిటీ డిజైన్‌ ప్రకారం 4.85 మీటర్‌/సెకండ్‌ కాగా, వివిధ అధ్యయనాల ప్రకారం 16 నుంచి 18 మీటర్‌/సెకండ్‌ ఉన్నందున ప్రస్తుతం చేసే మరమ్మతు పనులు నిలుస్తాయా అని ఇంజినీర్లను అడగ్గా, పుణెలోని సీడబ్ల్యుపీఆర్‌ఎస్‌లో అధ్యయనం చేయించామని, అదనంగా స్టిల్లింగ్‌ బేసిన్‌ నిర్మించడమే దీనికి పరిష్కారమని చెప్పారని నిర్మాణ సంస్థ ప్రతినిధి మంత్రికి ఆ నివేదికను అందజేశారు. ఈ నివేదికను కూడా ఎన్‌డీఎస్‌ఏకు ఇవ్వాలని మంత్రి సూచించారు.

గేట్లు పూర్తిగా తెరిచి పెట్టేందుకు చర్యలు 

ఎన్‌డీఎస్‌ఏ సిఫార్సు మేరకు మేడిగడ్డలోని అన్ని గేట్లను పైకి ఎత్తాల్సి ఉండగా, ఏడో బ్లాక్‌లో మరో నాలుగు గేట్లను ఇంకా పైకి లేపాల్సి ఉంది. వరద వచ్చే లోగా ఈ గేట్లను కూడా ఎత్తి ఉంచడానికి చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. సీసీ బ్లాకుల పునరుద్ధరణ, డ్రిల్లింగ్, గ్రౌటింగ్, షీట్‌ పైల్స్‌ తదితర అంశాల గురించి చీఫ్‌ ఇంజినీర్‌ సుధాకర్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ తిరుపతిరావు, ఎల్‌అండ్‌టీ నిర్మాణ సంస్థ ప్రతినిధి సురేష్‌కుమార్‌లు వివరించారు. ‘ఏడో బ్లాక్‌లో పరీక్షలకోసం బ్యారేజీ ఎగువన 11 చోట్ల డ్రిల్లింగ్‌ చేయాల్సి ఉండగా తొమ్మిది చోట్ల, దిగువన నాలుగు చోట్ల పూర్తయింది. జియో టెక్నికల్‌ ఇన్వెస్టిగేషన్, జియో ఫిజికల్‌ ఇన్వెస్టిగేషన్‌ కోసం బోర్‌ హోల్‌ డేటాకు డ్రిల్లింగ్‌ చేపట్టాల్సి ఉంది. ఏడో బ్లాక్‌లో జడ్‌ టైప్‌ షీట్‌ పైల్స్‌ 320 వేయాల్సి ఉండగా, 50 పూర్తయ్యాయి. రాఫ్ట్‌ ప్రాంతంలో ఇసుక బస్తాలు వేయడం, సీసీ బ్లాకులను అమర్చడం తదితర పనులు జరుగుతున్నాయి’ అని వివరించారు. దిల్లీలోని సి.ఎస్‌.ఎం.ఆర్‌.ఎస్‌.(సెంట్రల్‌ సాయిల్‌ అండ్‌ మెటీరియల్స్‌ రీసెర్చ్‌ స్టేషన్‌) ప్రతినిధులు అవసరమైన పరీక్షలు చేస్తున్నారు. పియర్స్‌ నాణ్యత, నీటి ప్రవాహ వేగాన్ని అంచనా వేసేందుకు అల్ట్రాసౌండ్‌ సీస్మిక్‌ వెలాసిటీ టెస్ట్‌ జరుగుతోంది. ‘ఈ పరీక్ష మనిషి శరీరానికి స్కానింగ్‌ లాంటిది. నీటి ప్రవాహ వేగం ఉండాల్సినంత ఉంటే ఎలాంటి సమస్య లేనట్లు. తక్కువ ఉంటే సమస్య ఉన్నట్ల’ని సి.ఎస్‌.ఎం.ఆర్‌.ఎస్‌ సంస్థ ప్రతినిధి ఎస్‌.కె.ద్వివేది తెలిపారు. షీట్‌పైల్స్‌ ఎలా ఉన్నాయో తెలుసుకొనేందుకు మరో పరీక్ష చేస్తున్నారు. పనుల వేగాన్ని మరింత పెంచాలని మంత్రి ఉత్తమ్‌ ఆదేశించారు. ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌(ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌) నాగేంద్రరావు, ఇతర ఇంజినీర్లు పాల్గొన్నారు. ఇసుక సమస్య గురించి భూపాలపల్లి కలెక్టర్‌తో చర్చించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని