Uttam: నిర్మాణ సంస్థల ఖర్చులతోనే మరమ్మతులు

పూర్తిస్థాయిలో వర్షాలు, వరదలు వచ్చేలోపు నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ(ఎన్‌డీఎస్‌ఏ) సిఫార్సుల మేరకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో పనులు పూర్తవ్వాలని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిర్మాణ సంస్థలను, ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు.

Published : 08 Jun 2024 05:44 IST

సుందిళ్లలో ఆశించిన మేర లేని పనుల పురోగతి
వేగం పెంచాలని నిర్మాణ సంస్థను హెచ్చరించాం
ఈ ఏడాది కొత్తగా 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రణాళిక
మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి
కాళేశ్వరం బ్యారేజీల పరిశీలన

దెబ్బతిన్న మేడిగడ్డ బ్యారేజీ 20వ పియర్‌ వద్ద పనులను పరిశీలిస్తున్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 

ఈనాడు, పెద్దపల్లి; ఈనాడు డిజిటల్, జయశంకర్‌ భూపాలపల్లి; మహదేవపూర్, కాళేశ్వరం, మంథని గ్రామీణం, న్యూస్‌టుడే: పూర్తిస్థాయిలో వర్షాలు, వరదలు వచ్చేలోపు నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ(ఎన్‌డీఎస్‌ఏ) సిఫార్సుల మేరకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో పనులు పూర్తవ్వాలని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిర్మాణ సంస్థలను, ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన వరుసగా పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం వద్ద నిర్మించిన సుందిళ్ల, భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలోని అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలను సందర్శించారు. అనంతరం మేడిగడ్డ వద్ద విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘గతేడాది అక్టోబరులో మేడిగడ్డ కుంగింది. గత భారాస ప్రభుత్వం పట్టించుకుంటే ఇంత నష్టం జరిగేది కాదు. మేడిగడ్డను నిర్మించిన ఎల్‌అండ్‌టీ, అన్నారం నిర్మించిన ఆప్కాన్స్, సుందిళ్ల పనులు చేసిన నవయుగ సంస్థల ఖర్చులతోనే తాత్కాలిక మరమ్మతులు, పనులు చేపడుతున్నట్లు చెప్పారు. ఎన్‌డీఎస్‌ఏ కమిటీ సూచించిన పనులు ఎలా జరుగుతున్నాయో పరిశీలించా. సుందిళ్ల పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. వేగం పెంచాలని నిర్మాణ సంస్థను హెచ్చరించా’ అని చెప్పారు. గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును రూ.94 వేల కోట్లతో నిర్మించిందన్నారు. ‘‘ఆయకట్టు స్థిరీకరణ పేరుతో గత ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మోసం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు కింద కొత్తగా లక్ష ఎకరాల ఆయకట్టుకు మాత్రమే నీరిచ్చింది. పాలమూరు రంగారెడ్డికి రూ.23 వేల కోట్లు, సీతారాంసాగర్‌ ప్రాజెక్టుకు రూ.7 వేల కోట్లు ఖర్చుపెట్టి ఒక్క ఎకరానికి కూడా నీరివ్వలేదు. 

  •  తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కడితే రూ.38 వేల కోట్లతో 16 లక్షల ఎకరాలకు గ్రావిటీతో నీరందేది. ఆ ప్రాజెక్టుకు ఏడాదికి విద్యుత్తు ఖర్చు రూ.వెయ్యి కోట్లు.. కాళేశ్వరానికి రూ.10 వేల కోట్లు భారం పడుతుంది. 
  •  కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వాలని అప్పటి ప్రభుత్వం కేంద్రానికి ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదు. పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వాలని అప్పటి జలనవనరులశాఖ మంత్రి షెకావత్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చాం. జాతీయ హోదా ఇవ్వడం కుదరదని ప్రాజెక్టుకయ్యే 60% నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు. 
  •  రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మిస్తాం. ఈ ఏడాది కొత్తగా 7 లక్షల ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం’ అని తెలిపారు. భూపాలపల్లి, రామగుండం, ధర్మపురి ఎమ్మెల్యేలు సత్యనారాయణరావు, మక్కాన్‌సింగ్‌ ఠాకూర్, లక్ష్మణ్‌రావు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఈఎన్సీ అనిల్‌కుమార్‌ పాల్గొన్నారు. 

బ్యారేజీల పరిశీలన ఇలా..

మంత్రి ఉత్తమ్‌ సుందిళ్లలో ఆశించిన మేర పనుల పురోగతి లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పునరుద్ధరణ పనుల్లో అలసత్వం, నిర్లక్ష్యం చేయవద్దని హెచ్చరించారు. ‘అవసరమైతే అదనపు బృందాలను ఏర్పాటు చేసి పనులు వేగంగా పూర్తి చేయండి.  ఏ పని ఎప్పటి వరకూ పూర్తవుతుందో షెడ్యూల్‌ రూపొందించి ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వండి’ అని ఇంజినీర్లకు స్పష్టం చేశారు. రాబోయే పది రోజుల్లో పునరుద్ధరణ పనులు వేగవంతం చేస్తామని ఈఎన్‌సీ అనిల్‌కుమార్‌ మంత్రికి తెలియజేశారు. అన్నారం బ్యారేజీలో సీపేజీలు ఎక్కడ జరిగాయని అధికారులను మంత్రి ప్రశ్నించారు. మూడు ప్రాంతాలలో సీపేజీలు ఏర్పడ్డాయని.. ముందుగా రసాయన పదార్థాలతో నియంత్రించామని తిరిగి సిమెంట్‌ గ్రౌటింగ్‌ చేపట్టినట్లు వారు వివరించారు. మేడిగడ్డలో ఎగువ, దిగువ భాగాన కాలినడకన సాగుతూ 7వ బ్లాక్‌లో పరిశీలించారు. పగుళ్లు ఏర్పడిన 20వ పియర్‌ను చూసి అక్కడ చేస్తున్న పనులను అడిగి తెలుసుకున్నారు.

ఏళ్లుగా గోస పడుతున్నాం... 

సుందిళ్ల బ్యారేజీ, అన్నారం పంప్‌హౌస్‌ల నిర్మాణంతో ఏళ్లుగా గోస పడుతున్నామని మంథని మండలం సిరిపురం, ఉప్పట్ల, గుంజపడుగు గ్రామస్థులు కొద్దిసేపు ఆందోళన చేశారు. సుందిళ్ల వద్ద మంత్రి  హెలిప్యాడ్‌ వద్ద దిగి వాహనాల కాన్వాయ్‌లో ప్రాజెక్టును సందర్శించేందుకు వస్తున్నప్పుడు ప్రజలు రహదారిపై బైఠాయించగా పోలీసులు చెదరగొట్టారు. సిరిపురం రైతు ఇసంపల్లి శ్రీనివాస్‌ ప్రాజెక్టు ముఖద్వారం వద్ద బైఠాయించి తమ సమస్యలు మంత్రి వినాల్సిందేని భీష్మించడంతో పోలీసులు ఆయనను ఉత్తమ్‌ వద్దకు తీసుకెళ్లారు. మంత్రి.. శ్రీనివాస్‌తో మాట్లాడి ఆయన చెప్పిన ముంపు ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. ఇంజినీరింగ్‌ అధికారులతో మాట్లాడి మరోమారు ముంపు గ్రామాల ప్రజలకు సమస్యలు తలెత్తకుండా పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు