Malla Reddy: మాదంటే మాదే!

భూవివాదంలో ఇరువర్గాల మధ్య తలెత్తిన ఘర్షణ పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉద్రిక్తతకు దారితీసింది. 

Updated : 19 May 2024 09:12 IST

జీడిమెట్లలో 1.29 ఎకరాల స్థలంపై ఘర్షణ.. ఉద్రిక్తత
తమదేనన్న మాజీ మంత్రి మల్లారెడ్డి
15 మంది కలిసి కొన్నామంటున్న అవతలి వర్గీయులు
పరస్పర ఫిర్యాదులతో మల్లారెడ్డి, ఎమ్మెల్యే రాజశేఖర్‌రెడ్డి సహా పలువురిపై కేసులు

పోలీసులతో మల్లారెడ్డి వాగ్వాదం

ఈనాడు, హైదరాబాద్‌ - పేట్‌బషీరాబాద్, న్యూస్‌టుడే: భూవివాదంలో ఇరువర్గాల మధ్య తలెత్తిన ఘర్షణ పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉద్రిక్తతకు దారితీసింది.  పేట్‌బషీరాబాద్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జీడిమెట్ల డివిజన్‌ పరిధి సుచిత్ర కూడలి సమీపంలో జీడిమెట్ల సర్వే నంబరు 82లో ఎకరా 29 గుంటలు, సర్వే నంబరు 83లో 3 వేల గజాల స్థలాన్ని 2011లో కొన్నట్లు మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన కుమారుడు భద్రారెడ్డి, అల్లుడు, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి చెబుతున్నారు. అప్పటినుంచి ఈ స్థలం వీరి అధీనంలోనే ఉంది. అందులో షెడ్లు వేసి అద్దెకు ఇచ్చారు. జీహెచ్‌ఎంసీకి పన్నులు సైతం చెల్లిస్తున్నారు. సర్వే నంబరు 82లోని ఎకరా 29 గుంటల స్థలం తాము కొనుగోలు చేశామంటూ శ్రీనివాస్‌రెడ్డి అనే వ్యక్తి తన అనుచరులతో కలసి శుక్రవారం రాత్రి అక్కడకు వెళ్లి సీసీ కెమెరాలు, షెడ్లను తొలగించి.. స్థలం చుట్టూ రేకులతో కంచె ఏర్పాటు చేయించారు. విషయం తెలుసుకున్న మల్లారెడ్డి, భద్రారెడ్డి, రాజశేఖర్‌రెడ్డిలు శనివారం ఉదయం తొలుత పేట్‌బషీరాబాద్‌ ఠాణాకు వెళ్లారు. సీఐ, ఎస్‌ఐలు అందుబాటులో లేకపోవటంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆ భూమి తమదంటే తమదంటూ ఇరువర్గాలు వాగ్వాదం చేసుకున్నాయి. కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ స్థలంలో కొత్తగా చేపట్టిన రేకుల కంచెను మల్లారెడ్డి అనుచరులు తొలగించడంతో గొడవ పెరిగింది. పేట్‌బషీరాబాద్‌ ఏసీపీ కె.రాములు, సీఐలు కె.విజయవర్ధన్, శ్రీనాథ్, రాహుల్‌దేవ్‌ అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు యత్నించారు. శ్రీనివాస్‌రెడ్డి, మల్లారెడ్డిల వద్ద ఉన్న పత్రాలను పోలీసులు పోలీస్‌ స్టేషన్‌లో పరిశీలించారు. అదే సమయంలో స్టేషన్‌ వద్దకు వచ్చిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి, ఆయన అనుచరులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. గేటు బయట బైఠాయించారు. పరస్పర ఫిర్యాదులతో మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే రాజశేఖర్‌రెడ్డిలతో పాటు శేరి శ్రీనివాస్‌రెడ్డి, బషీర్, సుధామలపై పేట్‌బషీరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. వివాదానికి కారణమైన స్థలాన్ని సర్వే చేయించాలని కుత్బుల్లాపూర్‌ తహసీల్దార్‌ రహమాన్‌ను పోలీసులు కోరినట్లు సమాచారం. 

వివాదాస్పద స్థలంలో కంచెను తొలగిస్తున్న మల్లారెడ్డి అనుచరులు

2011లో కొనుగోలు చేశాం: మల్లారెడ్డి

2011లో రెండున్నర ఎకరాల భూమిని తాను, కుమారుడు భద్రారెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి కొనుగోలు చేసినట్లు మాజీ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. అప్పటి నుంచి మున్సిపాలిటీకి పన్నులు చెల్లిస్తున్నామన్నారు. విద్యుత్‌ మీటర్లు కూడా తమ పేర్లపై ఉన్నాయని చెప్పారు. స్థలంలో షెడ్లు వేసి అద్దెకు ఇచ్చామన్నారు. శ్రీనివాస్‌రెడ్డి తన అనుచరులతో కలిసి శుక్రవారం రాత్రి దౌర్జన్యంగా షెడ్లను ధ్వంసం చేశారన్నారు. తన స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. శేరి శ్రీనివాస్‌రెడ్డి, బషీర్, సుధామ అనుచరులపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. 

న్యాయస్థానం తీర్పుతోనే..

జీడిమెట్ల గ్రామంలోని సర్వే నంబరు 82లో సుధామ నుంచి 2016లో 1.29 ఎకరాలు కొనుగోలు చేశామని బషీర్‌ తెలిపారు. సుమారు 15 మంది కలసి 300, 400, 500 గజాల చొప్పున కొన్నట్లు చెప్పారు. అప్పటినుంచి స్థలం తమ అధీనంలో ఉన్నా... అప్పటి ప్రభుత్వం అండతో తమను బయటకు పంపారని ఆరోపించారు. దీనిపై తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించామన్నారు. ఆ స్థలంలోకి మల్లారెడ్డి కుటుంబ సభ్యులెవరూ ప్రవేశించవద్దంటూ 2016లో న్యాయస్థానం తీర్పు ఇచ్చిందన్నారు. తమ స్థలం కావడం వల్ల తాము శుక్రవారం అందులోకి వెళ్లామన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని