Monsoon Season: ఈ వానాకాలం ఆశాజనకమే!

రాష్ట్రంలో వానాకాలం సీజన్‌ ఆశాజనకంగా ఉంటుందని, నిరుటి కంటే అధిక విస్తీర్ణంలో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ పేర్కొంది.

Updated : 22 May 2024 05:40 IST

151.93 లక్షల ఎకరాల్లో సాగు అంచనా
నిరుటి కంటే 11.19 లక్షల ఎకరాలు అధికం 
వరి, పత్తి పంటలకే అగ్రాసనం
వ్యవసాయ శాఖ ప్రణాళిక వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో వానాకాలం సీజన్‌ ఆశాజనకంగా ఉంటుందని, నిరుటి కంటే అధిక విస్తీర్ణంలో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ పేర్కొంది. మొత్తంగా 151.93 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని, అందులో 66 లక్షల ఎకరాల్లో వరి, 55 లక్షల ఎకరాల్లో పత్తి వేస్తారని అంచనా వేసింది. నైరుతి రుతు పవనాలు జూన్‌ 7, 8 తేదీల్లో రాష్ట్రంలో ప్రవేశిస్తాయంది. ఈ మేరకు వానాకాలం సీజన్‌ కార్యాచరణ ప్రణాళికను వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు మంగళవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ప్రవేశపెట్టగా, దానికి ఆమోదం లభించింది. ప్రణాళిక మేరకు పంటలు సాగయ్యేలా చూడాలని అధికారులకు మంత్రిమండలి సూచించింది. గత వానాకాలంలో 140.74 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. నిరుటితో పోలిస్తే ఈసారి 11.19 లక్షల ఎకరాల్లో అధికంగా సాగవుతాయని వ్యవసాయ శాఖ పేర్కొంది. వేరుసెనగ మినహా ఇతర అన్ని పంటల విస్తీర్ణంలో పెరుగుదలను చూపింది. వరి నిరుటి కంటే 5,748 ఎకరాలు పెరగనుండగా పత్తి ఏకంగా 10,07,526 ఎకరాల్లో అధికంగా సాగవుతుందని వెల్లడించింది. మొక్కజొన్న 67,003 ఎకరాలు, ఆయిల్‌పామ్‌ 66,178, సోయా 42,068, జొన్న 8,446, మిరప 5,808 ఎకరాలు పెరుగుతుందంది. వేరుసెనగ 844 ఎకరాలు, మామిడి తోటల పెంపకం 14,141 ఎకరాలు తగ్గుతుందని తెలిపింది. 

11.24 లక్షల టన్నుల ఎరువులు సిద్ధం 

వానాకాలం సీజన్‌కు యూరియా 10.42 లక్షల టన్నులు, డీఏపీ 2.41 లక్షల టన్నులు, కాంప్లెక్స్‌ 8.20 లక్షల టన్నులు, ఎంవోపీ 0.38లక్షల టన్నులు, ఎస్‌ఎస్‌పీ 0.33 లక్షల టన్నులు అవసరమని వ్యవసాయ శాఖ గుర్తించింది. ఇందులో ఇప్పటికే 6.25 లక్షల టన్నుల యూరియా, 0.76 లక్షల టన్నుల డీఏపీ, 3.84 లక్షల టన్నుల కాంప్లెక్స్, 0.24 లక్షల టన్నుల ఎంవోపీ, 0.14 లక్షల టన్నుల ఎస్‌ఎస్‌పీ చొప్పున మొత్తం 11.24 లక్షల టన్నుల మేరకు ప్రారంభ నిల్వలు ఉన్నాయని తెలిపింది. 

అందుబాటులో వరి విత్తనాలు 

వరికి 16.50 లక్షల క్వింటాళ్ల విత్తనాలు, పత్తికి 54 వేల క్వింటాళ్లు, మొక్కజొన్నకు 48 వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరం. వరి విత్తనాలకు లోటు లేదని, అవసరానికంటే అధికంగా ఉన్నాయంది. పచ్చిరొట్ట ఎరువులైన జీలుగ, జనుము, పిల్లిపెసర విత్తనాలను 15.75 లక్షల ఎకరాల్లో వేసేందుకు 1.35 లక్షల క్వింటాళ్లను రాయితీపై విక్రయిస్తున్నట్లు పేర్కొంది. నకిలీ విత్తనాల నిరోధానికి పటిష్ఠమైన చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటివరకు 12 మందిని పట్టుకుని క్రిమినల్‌ కేసులు నమోదు చేసినట్లు తెలిపింది. అన్నదాతలనూ అప్రమత్తం చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు