బడి బస్సులు ఎంత భద్రం?

రాష్ట్రంలో పాఠశాలలు తెరిచేందుకు ఇంకా మూడు రోజుల సమయమే ఉంది. రవాణాశాఖ అధికారుల లెక్కల మేరకు బడి బస్సుల్లో 60 శాతం మాత్రమే ఫిట్‌గా ఉన్నాయి.

Updated : 09 Jun 2024 07:49 IST

కనిపించని ప్రథమ చికిత్స కిట్లు 
అరిగిపోయిన టైర్లు, పగిలిన అద్దాలు    
రాష్ట్రంలో ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ లేని బస్సులు 9,654 
ఈనాడు, హైదరాబాద్‌

ఖమ్మంలో బస్సులోకి వెళ్లి పరిశీలిస్తున్న రవాణాశాఖ అధికారులు 

రాష్ట్రంలో పాఠశాలలు తెరిచేందుకు ఇంకా మూడు రోజుల సమయమే ఉంది. రవాణాశాఖ అధికారుల లెక్కల మేరకు బడి బస్సుల్లో 60 శాతం మాత్రమే ఫిట్‌గా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 23,824 విద్యాసంస్థల బస్సులు ఉంటే.. 9,654 బస్సులు ఇంకా సామర్థ్య(ఫిట్‌నెస్‌) ధ్రువీకరణ పత్రాలు పొందలేదు. ఇందులో మూడింట రెండొంతులకుపైగా జీహెచ్‌ఎంసీ వెలుపల తెలంగాణ జిల్లాల పరిధిలోనే ఉన్నాయి. వేలాది బస్సులు ఫిట్‌నెస్‌ పరీక్షలో పాస్‌ కాని నేపథ్యంలో వాటిలో విద్యార్థుల ప్రయాణం ఎంత మేరకు భద్రం అన్న సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి.

కరీంనగర్‌ జిల్లాలోని ఓ బడి బస్సులో మందులు లేకుండా ఖాళీగా ఉన్న ప్రథమ చికిత్స పెట్టె 

ఎన్నెన్నో లోపాలు

యాజమాన్యాలు తమ బస్సుల్ని రవాణా శాఖ కార్యాలయాలకు పంపిస్తున్నాయి. వాటిలో భూతద్దం పెట్టి వెతికినా ప్రథమ చికిత్స(ఫస్ట్‌ ఎయిడ్‌) కిట్లు కనిపించడం లేదు. ఫిట్‌నెస్‌ పరీక్షలో పాస్‌ అయినట్లు అధికారులు ధ్రువీకరిస్తున్న 90శాతం బస్సుల్లోనూ ఇదే పరిస్థితి. కొత్తగా కొనుగోలు చేసిన వాటిలో మాత్రమే ఈ కిట్లు ఉంటున్నాయి. ఫిట్‌నెస్‌ను పరిశీలించే విధానం గతంలో కొంటే కొంత మెరుగుపడినా అనేక లోపాలున్నాయి. ప్రతి దాన్ని స్వయంగా నడిపి పరీక్షించాలి. కానీ ఒక్కో విద్యాసంస్థకు సంబంధించి పదుల సంఖ్యలో వాహనాలుంటే పలు రవాణా కార్యాలయాల్లో కొన్నింటినే పరిశీలిస్తున్నారు. ఎక్కువ లోపాలు ఉన్నవాటికి మాత్రం సర్టిఫికెట్లు నిరాకరిస్తున్నారు. సామర్థ్య పరీక్షకు వస్తున్న బస్సుల్లో కొన్ని అరిగిన టైర్లతో వస్తుంటే.. మరికొన్ని పగిలిన అద్దాలతో... ఇంకొన్నింట్లో పిల్లలు ఎక్కే మెట్లు జారేలా ఉండటం.. ఇండికేటర్లు సరిగా లేకపోవడం, వెనకభాగంలో రేడియం స్టిక్కర్లు లేకపోవడం వంటి లోపాలున్నాయి.  

జిల్లాల వారీగా పరిస్థితులు..

  • హనుమకొండ జిల్లాలో 1058 విద్యా సంస్థల బస్సులుంటే ధ్రువీకరణ పత్రం పొందినవి 798 మాత్రమే. 149 బస్సులకు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ నిరాకరిస్తూ యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చారు. మిగిలినవి కార్యాలయాలకే తీసుకురాలేదు.  
  • మహబూబ్‌నగర్‌ జిల్లాలో 439 ఉంటే 226 ఫిట్‌నెస్‌ పరీక్షలో పాస్‌ కాగా, 22 వాహనాలకు సర్టిఫికెట్‌ తిరస్కరించారు. 191 పరీక్షకే తీసుకురాలేదు. 
  • ఖమ్మం జిల్లాలో 648 బడి, కళాశాల బస్సుల్లో ఏకంగా 344 ఫిట్‌నెస్‌ పరీక్షకే రాలేదు. ఫిట్‌నెస్‌ సాధించినవి 284.  
  • మెదక్, సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో మొత్తం 262, 140, 784, 465, 238 చొప్పున బడి బస్సులుంటే ఇప్పటివరకు ఆయా జిల్లాల్లో ఫిట్‌నెస్‌ సాధించినవి 70, 40, 479, 293, 82 మాత్రమే.  

 15 ఏళ్లు దాటిన బస్సులూ అధికమే 

ఒక వాహనం జీవితకాలం 15 సంవత్సరాలు. ఆ తర్వాత స్క్రాప్‌గా మార్చాలి. కానీ పలు జిల్లాల్లో యాజమాన్యాలు కాలం చెల్లిన డొక్కు బస్సులకు తాత్కాలిక మరమ్మతులు చేయించి నడిపిస్తూ పిల్లల భద్రతతో చెలగాటం ఆడుతున్నాయి. ఇలాంటి వాటికి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని అధికారులు పైకి చెబుతున్నారు. కానీ వాటిని తిరగకుండా ఆపేందుకు కఠిన చర్యలు తీసుకోవడం కార్యాచరణలో కనిపించడం లేదు. 

కరీంనగర్‌ జిల్లాలోనే 15 ఏళ్లు దాటిన డొక్కు బస్సులు 450 ఉన్నట్లు సమాచారం. జగిత్యాలలో 235, పెద్దపల్లిలో 18,  సిరిసిల్లలో 22 ఉన్నాయి. ఈ నాలుగు జిల్లాల్లో మొత్తం 1,637 బస్సులుంటే 15 ఏళ్లు దాటిన వాటి సంఖ్య ఏకంగా 725. అంటే 44 శాతం. 

12 నుంచి ప్రత్యేక డ్రైవ్‌

విద్యాసంస్థల బస్సులకు 12వ తేదీ నుంచి ప్రత్యేకడ్రైవ్‌ నిర్వహించాలని రవాణాశాఖ నిర్ణయించింది. ఫిట్‌నెస్‌ లేకుండా రోడ్డు ఎక్కే వాటిని తనిఖీ చేసి జరిమానా వేస్తామని రవాణాశాఖ వర్గాలు చెబుతున్నాయి. కానీ ఏటా పాఠశాలల ప్రారంభంలో కొద్దిరోజులు మాత్రమే ఓ తంతుగా సాగుతోంది. ఈసారి నిబంధనల్ని ఎలా అమలుచేస్తారన్నది చూడాలి. మరోవైపు కొన్ని విద్యాసంస్థలు వ్యూహాత్మకంగానే ఇప్పటివరకు తమ వాహనాలను ఫిట్‌నెస్‌ పరీక్షకు పంపలేదన్న అనుమానాలున్నాయి. పాఠశాలల ప్రారంభానికి ఒకట్రెండు రోజుల ముందు పంపిస్తే.. ఒకేసారి వేలాదిగా వెళ్తే అధికారులు పైపైనే పరీక్షలు చేస్తారన్న వ్యూహంతో జాప్యం చేస్తున్నట్లు తెలుస్తోంది.


ఫిట్‌నెస్‌ ఎలా ఉందంటే..?

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి.. ఈ మూడు జిల్లాల్లో మొత్తం 12,631 బస్సులున్నాయి. ఇక్కడ పరిస్థితి జిల్లాల కంటే కొంత మెరుగ్గా ఉంది. ఈ మూడు జిల్లాల్లో ఫిట్‌నెస్‌ పొందినవాటి సంఖ్య 9,488. సర్టిఫికెట్‌ లేనివి 3,143 ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని