LLM: రాజ్యాంగంపై తెలుగులో ఎల్‌ఎల్‌ఎం

పోటీ ప్రపంచానికి దీటుగా సరికొత్త కోర్సులు... ఒప్పందాలతో న్యాయ విద్యలో ఉన్న అన్ని అవకాశాలను, పరిశోధనలను విద్యార్థులకు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని నల్సార్‌ యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ శ్రీకృష్ణదేవరావు చెప్పారు.

Updated : 29 May 2024 05:25 IST

దేశంలో తొలిసారిగా రెండేళ్ల ఆన్‌లైన్‌ కోర్సు
త్వరలో డిగ్రీలో మూడేళ్ల లా కోర్సు తీసుకొస్తాం
స్థిరాస్తి రంగంపై మాస్టర్‌ డిగ్రీ
ఈనాడుతో నల్సార్‌ వీసీ శ్రీకృష్ణదేవరావు 

ఈనాడు, హైదరాబాద్‌: పోటీ ప్రపంచానికి దీటుగా సరికొత్త కోర్సులు... ఒప్పందాలతో న్యాయ విద్యలో ఉన్న అన్ని అవకాశాలను, పరిశోధనలను విద్యార్థులకు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని నల్సార్‌ యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ శ్రీకృష్ణదేవరావు చెప్పారు. క్షేత్రస్థాయిలో కూడా అనుభవం గడించేలా లా డిగ్రీ కోర్సులను ప్రవేశపెడుతున్నామని తెలిపారు. ప్రపంచీకరణ నేపథ్యంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యావిధానంలో మార్పులు అవసరం అని...అందులో భాగంగా న్యాయ విద్యలో పలు సంస్కరణలు తెస్తున్నామని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు చేసుకుని కొత్త కోర్సులు పెడుతున్నట్లు తెలిపారు. ‘రాజ్యాంగంపై అవగాహన కల్పించడానికి దేశంలో మొదటిసారి తెలుగులో రాజ్యాంగంపై రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం ఆన్‌లైన్‌ కోర్సు ప్రారంభానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మూడేళ్ల లా డిగ్రీని ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఇందుకోసం సిటీలో కార్యాలయం ఏర్పాటుకు భవన వసతి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరాం. అన్నీ అనుకూలిస్తే 2025లో ప్రారంభిస్తాం’ అని చెప్పారు. న్యాయవిద్యలో వస్తున్న మార్పులు, కొత్త కోర్సులు తదితర అంశాలను ‘ఈనాడు’ ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు.

నిర్మాణ రంగం విస్తరిస్తున్న నేపథ్యంలో న్యాయ విద్యలో మార్పులపై మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి?

జ: రియల్‌ ఎస్టేట్‌కు సంబంధించి ఎక్కువ సమస్యలు ఎదురవుతున్నాయి. అందుకే కొత్త కోర్సును ప్రవేశపెడుతున్నాం. న్యాక్‌ (నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌), కాంట్రాక్టర్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీడీఐ)తో కలిపి మాస్టర్స్‌ డిగ్రీ ఇన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ రియల్‌ ఎస్టేట్‌ కోర్సును ప్రారంభించాలనుకుంటున్నాం. రెరాతో ఒప్పందం చేసుకోబోతున్నాం. ఎల్‌ఎల్‌ఎం ఇన్‌ ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్‌రప్టసీ పేరు మీద కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక కోర్సు ప్రారంభిస్తున్నాం. ఒక ఏడాది ఇక్కడ, మరో ఏడాది దిల్లీలో చదువు కోవాల్సి ఉంటుంది. డ్యుయల్‌ డిగ్రీ అన్నది మొదట ఇక్కడే ప్రారంభిస్తున్నాం. 

ఏడీఆర్‌ (ఆల్టర్‌నేటివ్‌ డిస్‌ప్యూట్‌ రిజల్యూషన్‌)కు సంబంధించి యూనివర్సిటీ చర్యలు ఏమిటి ?

జ: ఆర్బిట్రేషన్‌పై కొత్తగా యూనివర్సిటీలో కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ రోహింగ్టన్‌ నారీమన్‌ నేతృత్వం వహిస్తుండటం గొప్ప విషయం. సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది గౌరవ్‌ బెనర్జీ తన తండ్రి పేరుతో ‘మిలన్‌ కె.బెనర్జీ సెంటర్‌ ఫర్‌ ఆర్బిట్రేషన్‌ లా’ను నల్సార్‌తో కలిసి ఏర్పాటు చేస్తూ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. హైదరాబాద్‌లోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ అండ్‌ మీడియేషన్‌ సెంటర్‌ (ఐఏఎంసీ)తోనూ ఒప్పందం ఉంది. నల్సార్‌తో కలిపి ఎల్‌ఎల్‌ఎం ఇన్‌ ఆర్బిట్రేషన్‌ అండ్‌ మీడియేషన్‌ కోర్సు, ఎల్‌ఎల్‌ఎం క్రిమినల్‌ జస్టిస్‌ కోర్సు ప్రారంభానికి యూకే, యూఎస్‌ యూనివర్సిటీలు ఆసక్తి చూపుతున్నాయి.

అంతర్జాతీయ స్థాయి వివాదాల పరిష్కారంలో యూనివర్సిటీ దృక్కోణం ఎలా ఉంది?

జ:సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ జీవన్‌రెడ్డి సౌజన్యంతో ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ లా కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. మాజీ అటార్నీ జనరల్‌ కె.కె.వేణుగోపాల్‌ సౌజన్యంతో ఏర్పాటైన సార్క్‌లా కేంద్రాన్ని ఆధునికీకరిస్తున్నాం. ఈ కేంద్రం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ రవీంద్రభట్‌ నేతృత్వంలో సేవలు అందించనుంది. ఏవియేషన్‌ లాపై కోర్సు కొనసాగుతోంది. సముద్ర జలాల వివాదంపై కోర్సును ఇంకా ప్రారంభించలేదు.

విద్యార్థులకు సైబర్‌ లాలో ప్రత్యేక శిక్షణ ఏమైనా ఇస్తున్నారా?

జ: హైదరాబాద్‌ ఫోరెన్సిక్‌ డిపార్ట్‌మెంట్, ట్రూత్‌ల్యాబ్స్‌తో కలిపి సైబర్‌ లా కోర్సులు అందిస్తున్నాం. ప్రస్తుత సవాళ్లకు అనుగుణంగా కోర్సును తీర్చిదిద్దుతున్నాం. సెంటర్‌ ఫర్‌ డ్రగ్, సైబర్‌ క్రైం ఇన్‌స్టిట్యూట్‌లతో కలిపి ప్రాక్టికల్, థియరీ ఉండేలా చూస్తున్నాం. థియరీ, లాకు సంబంధించిన అంశాలను యూనివర్సిటీ బోధిస్తే, క్షేత్రస్థాయిలో మెలకువలను ఆ సంస్థల ద్వారా నేర్చుకోవాల్సి ఉంటుంది.

వర్సిటీలో ప్రాంగణ నియామకాలకు ఉన్న అవకాశాలు ఏమిటి?

జ: నల్సార్‌లో దాదాపుగా 100 శాతం ప్రాంగణ నియామకాలు ఉంటున్నాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లోని పలు కార్పొరేట్‌ సంస్థల్లో అవకాశాలు దక్కుతున్నాయి. కార్పొరేట్‌ సంస్థల్లో ఐదారేళ్లు పనిచేసి అనుభవం గడించాక న్యాయవాద వృత్తిలోకి వస్తున్నారు. భవిష్యత్తులో హైకోర్టు న్యాయమూర్తులుగానూ మా విద్యార్థులు ఉంటారు.

నల్సార్‌లో విద్య కేవలం ఉన్నతాదాయ  వర్గాలకే పరిమితమా?

జ: నల్సార్‌లో ఫీజు కాస్త ఎక్కువ ఉండటంతో ఉన్నతాదాయ వర్గాలకే అని అభిప్రాయం వ్యక్తమవుతోంది. క్లాట్‌లో మెరిట్‌ సాధించి సీటు పొందితే ఫీజు చెల్లించలేక చదువు ఆపేసిన విద్యార్థులు లేరు. అలాంటివారికి యూనివర్సిటీ అండగా ఉంటూ స్కాలర్‌షిప్‌లను అందజేస్తుంది. వారి ఆర్థిక పరిస్థితులను పరిశీలించి అర్హులైన వారికి ఫీజు రాయితీ కల్పిస్తాం.

పాత తీర్పులకు భిన్నంగా ఉన్న జడ్జిమెంట్‌లకు సంబంధించి బోధన ఎలా ఉంటుంది?

జ: తరగతి గదిలో కేసు ఆధారిత అధ్యయనం జరుగుతుంది. పాత, కొత్త తీర్పులపై చర్చ ఉంటుంది. విద్యార్థులకు కోర్టులో మాదిరి వాద ప్రతివాదాలకు అవకాశం కల్పిస్తాం. 

కాలేజీలో చేరి నేరుగా చదువుకోలేనివారికి ఏవైనా కోర్సులున్నాయా?

జ: ప్రస్తుతం 25 దూరవిద్య కోర్సులు ఉన్నాయి. త్వరలో మరో 10 ప్రారంభించనున్నాం. ఫార్మా రంగంలో హైదరాబాద్‌ కీలక పాత్ర పోషిస్తోంది. ఫార్మసీ, డ్రగ్‌ రెగ్యులేటరీపై ఇప్పటిదాకా కోర్సు ఇంకా ప్రారంభం కాలేదు. దీనిపై కసరత్తు ప్రారంభించాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు