Narayanpet - kodangal Lift Irrigation Scheme: ‘నారాయణపేట-కొడంగల్‌’పై లైడార్‌ సర్వే పూర్తి

నారాయణపేట-కొడంగల్‌ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి సంబంధించిన లైడార్‌ సర్వే పూర్తయింది. హెలికాప్టర్‌ ద్వారా నిర్వహించిన ఈ సర్వేలో నీటిని తీసుకునే స్థానం నుంచి సరఫరా చేసే చివరి పాయింట్‌ వరకు సమగ్ర అధ్యయనాన్ని పూర్తి చేశారు.

Published : 27 May 2024 05:27 IST

డీపీఆర్‌.. పర్యావరణ అనుమతులకు డేటా మదింపు
జలాశయాల సామర్థ్యం 3.50 టీఎంసీలకు పెంపు

నారాయణపేట-కొడంగల్‌ ఎత్తిపోతల పథకానికి నీటిని అందించనున్న భూత్పూర్‌ జలాశయం

ఈనాడు, హైదరాబాద్‌: నారాయణపేట-కొడంగల్‌ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి సంబంధించిన లైడార్‌ సర్వే పూర్తయింది. హెలికాప్టర్‌ ద్వారా నిర్వహించిన ఈ సర్వేలో నీటిని తీసుకునే స్థానం నుంచి సరఫరా చేసే చివరి పాయింట్‌ వరకు సమగ్ర అధ్యయనాన్ని పూర్తి చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని నారాయణపేట, కొడంగల్, మక్తల్‌ నియోజకవర్గాల్లోని లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం రూ.3,556 కోట్ల అంచనా వ్యయంతో ఈ పథకాన్ని నిర్మిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సీఎం రేవంత్‌రెడ్డి లిఫ్టు పనులకు శంకుస్థాపన చేశారు. దీనికి భీమా పథకంలో భాగంగా నిర్మించిన భూత్పూర్‌ జలాశయం నుంచి నీటిని తీసుకుంటారు. ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ పథకం రూపుదిద్దుకోగా 2014లో పరిపాలన అనుమతులు మంజూరయ్యాయి. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ప్రక్రియలో వేగం పుంజుకుంది. మొదట... నాలుగు దశల్లో కృష్ణా జలాలను ఎత్తిపోసి, ఏడు టీఎంసీలను లక్ష ఎకరాలకు ఇవ్వాలని అనుకున్నారు. భూసేకరణ సమస్యలు వస్తాయనే ఆలోచనతో ప్రస్తుతం... మూడు దశల్లోనే చేపట్టాలని, భూగర్భ సొరంగాల స్థానంలో ప్రెషర్‌ మెయిన్‌ నిర్మించాలని నిర్ణయించారు. మొత్తం 10 చెరువులకు నీటిని మళ్లించాల్సి ఉండగా వాటి సామర్థ్యాన్ని 0.9 టీఎంసీల నుంచి 2.1 టీఎంసీకి పెంచాలని మొదట్లో నిర్ణయించారు. తాజాగా 3.6 టీఎంసీల నిల్వకు వీలుగా జలాశయాలను సిద్ధం చేసేలా అంచనా వేస్తున్నారు. 

డీపీఆర్‌ రూపకల్పనకు కసరత్తు

  • పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల్లోని వివిధ ప్యాకేజీలకు సర్వే నిర్వహించిన సంస్థే నారాయణపేట-కొడంగల్‌ పథకం సర్వేను చేపట్టింది. తాజాగా లైడర్‌ సర్వే పూర్తి చేయగా గుర్తించిన అంశాల(డేటా) మదింపు చేపడుతున్నారు. కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ నుంచి పొందాల్సిన పర్యావరణ అనుమతులకు సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు.
  • మూడు దశల ఎత్తిపోతల్లో 208 మెగావాట్ల సామర్థ్యమున్న ఏడు పంపులు (మొదటి పాయింట్‌లో ఒకటి) వినియోగిస్తారు.
  • పథకం అంచనాల్లో భూగర్భ సొరంగాలు ఉన్నప్పుడు పంపులు, విద్యుత్‌ సబ్‌స్టేషన్లు ఇతరత్రా కలుపుకొని రూ.496 కోట్ల అంచనా వ్యయం ఉండగా ప్రెషర్‌ మెయిన్‌కు మారిన తర్వాత రూ.920 కోట్ల వరకు అంచనాలు పెరిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. 
  • ఎలక్ట్రికల్‌ పనులకు సంబంధించి సాంకేతిక అనుమతుల దస్త్రం నీటిపారుదల శాఖ వద్ద పరిశీలనలో ఉంది.

రూ.1,894 కోట్ల టెండర్లు పిలిచి వెనక్కి 

ఎత్తిపోతల పథకంలోని వివిధ పనులకు ఈ ఏడాది ఫిబ్రవరిలోనే నీటిపారుదల శాఖ మొదటిసారి టెండర్లు పిలిచింది. ప్రధాన పనులకు రూ.1,894 కోట్లకు టెండర్‌ ప్రకటన జారీ చేసినప్పటికీ తర్వాత... వెనక్కి తీసుకుంది. లోక్‌సభ ఎన్నికలు రావడంతో ఈ ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది. సాంకేతిక అనుమతులు రాకపోవడం కూడా టెండర్ల వాయిదాకు కారణమని తెలిసింది. త్వరలో మరోసారి టెండర్లు పిలిచేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు