Telangana: ఆ బడులకు మళ్లీ పాత పనివేళలు

రాష్ట్రంలో జూన్‌ 12వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత బడుల పనివేళలు మారాయి. 2022-23 విద్యాసంవత్సరం వరకు ఆ పాఠశాలలు ఉదయం 9 గంటలకే తెరుచుకునేవి.

Updated : 26 May 2024 09:40 IST

ఉదయం 9 గంటలకే ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు..

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో జూన్‌ 12వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత బడుల పనివేళలు మారాయి. 2022-23 విద్యాసంవత్సరం వరకు ఆ పాఠశాలలు ఉదయం 9 గంటలకే తెరుచుకునేవి. గత విద్యాసంవత్సరం(2023-24)లో 9.30 గంటలకు ప్రారంభమయ్యేలా మార్చారు. అయితే, ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థులు ఉదయం 8 గంటలకే బస్సులెక్కి వెళ్లిపోతుంటే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉదయం 9.30 గంటలకు వెళ్లడం వల్ల సర్కారు బడులపై తల్లిదండ్రులకు చులకన భావం ఏర్పడుతుందని విద్యాశాఖ అధికారులు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంకు వివరించారు. దీంతో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను ఉదయం 9 గంటలకే ప్రారంభించాలన్న ప్రతిపాదనకు ఆయన ఆమోదం తెలిపారు. ఉన్నత పాఠశాలలు మాత్రం ఉదయం 9.30 గంటల నుంచే పనిచేస్తాయి. వాటి పనివేళలను కూడా ఉదయం 9 గంటలకే మార్చాలని అధికారులు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఉన్నత పాఠశాలలను ఉదయం 9.30 గంటలకు తెరిస్తే సాయంత్రం 4.45 గంటల వరకు విద్యార్థులు బడిలోనే ఉండాల్సి ఉంటుందని, చలి, వర్షాకాలాల్లో వారు ఇళ్లకు వెళ్లేసరికి ఆలస్యమై, బాలికలకు రక్షణ కరవవుతుందని నిపుణులు చెబుతున్నారు.

‘గణితం’ బాధ్యత భౌతికశాస్త్రం ఉపాధ్యాయులదే..

ఆరు, ఏడు తరగతుల గణితం సబ్జెక్టును ఇక నుంచి భౌతికశాస్త్రం ఉపాధ్యాయులే బోధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రెండు తరగతులకు గణితం టీచర్లు బోధిస్తే వారిపై పనిభారం పెరుగుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని