Phone Tapping Case: ప్రతిపక్షాల కట్టడికే ఫోన్‌ ట్యాపింగ్‌

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుకు సంబంధించి పలు సంచలన అంశాలు వెల్లడయ్యాయి. ఎందుకు ట్యాపింగ్‌ చేయాల్సి వచ్చింది? అందుకు అనుసరించిన వ్యూహమేంటి? ఎలా అమలు చేశారు వంటి వివరాలు బయటపడ్డాయి.

Updated : 28 May 2024 10:53 IST

చట్టవిరుద్ధమని తెలిసీ చేశాం
భాజపాను ఇరుకునపెట్టేందుకే ఎమ్మెల్యేల కొనుగోలు కేసు
కేసీఆర్‌ను విమర్శించే వారిని లక్ష్యంగా చేసుకున్నాం
రేవంత్‌రెడ్డి, ఈటల, బండి సంజయ్, ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌... పట్నం మహేందర్‌రెడ్డి సహా కొందరు భారాస నేతలపైనా నిఘా ఉంచాం
రాధాకిషన్‌రావు వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుకు సంబంధించి పలు సంచలన అంశాలు వెల్లడయ్యాయి. ఎందుకు ట్యాపింగ్‌ చేయాల్సి వచ్చింది? అందుకు అనుసరించిన వ్యూహమేంటి? ఎలా అమలు చేశారు వంటి వివరాలు బయటపడ్డాయి. ఈ కేసులో అరెస్టయిన టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు ఈ విషయాలను దర్యాప్తు అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో స్వయంగా వెల్లడించారు. వివరాలు ఇలా.. 

‘‘కొద్దిపాటి విమర్శ వచ్చినా కేసీఆర్‌ చిరాకుపడేవారు. ప్రతిపక్ష నాయకులను ఎప్పటికప్పుడు గమనించేందుకు ఎస్‌ఐబీ డీఎస్పీ ప్రణీత్‌రావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఎస్‌ఐబీ ఐజీ ప్రభాకర్‌రావు ఏర్పాటు చేసిన తర్వాత నేను కూడా ఆయనతో కలిసి పనిచేయడం మొదలుపెట్టా. వివిధ పార్టీల నాయకుల ఫోన్లను పర్యవేక్షించడం ద్వారా సేకరించిన సమాచారాన్ని ప్రణీత్‌రావు నాకు పంపేవారు. కొన్ని సందర్భాల్లో ఇలాంటి సమాచారాన్ని పోలీసు కమిషనర్‌కు పంపాలని ప్రణీత్‌రావుకు చెప్పేవాడిని. కమిషనర్‌ ఆదేశాల ప్రకారమే టాస్క్‌ఫోర్స్‌ పనిచేస్తోందని నమ్మించేందుకే ఇలా చేసేవాళ్లం. ప్రతిపక్షాలకు చెందిన డబ్బు పట్టుకోవడం, భారాస అవసరాల కోసం అందుతున్న డబ్బు సజావుగా రవాణా అయ్యేలా చూడటంలో ప్రణీత్‌రావుతో కలిసి పనిచేయాలని ప్రభాకర్‌రావు నన్ను ఆదేశించారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మొదలైన ఈ పని.. 2019 లోక్‌సభ ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలు, 2023 ఎన్నికల్లోనూ కొనసాగింది. 2020లో పదవీ విరమణ చేసిన తర్వాత కేసీఆర్‌ ఆశీస్సులతో ప్రభాకర్‌రావు మళ్లీ ఎస్‌ఐబీ అధినేతగా నియమితులయ్యారు. కొంతకాలం నిఘా విభాగాధిపతిగానూ పనిచేశారు. 

భారాస నాయకుల ఫోన్లూ... 

రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి, భారాసకు, ఆ పార్టీ నేతలకు ముప్పుగా భావించే నాయకులకు సంబంధించిన సమాచారం సేకరణపై ప్రభాకర్‌రావు నాతో తరచూ చర్చించేవారు. ఈ విషయాలను ప్రణీత్‌రావుతోనూ ఎప్పటికప్పుడు పంచుకునేవారు. వీటి ఆధారంగా ప్రణీత్‌రావు ఆయా నాయకులను పర్యవేక్షిస్తూ (ఫోన్‌ట్యాపింగ్‌) ఉండేవారు. వీరిలో అనేకమంది భారాస నాయకులు సైతం ఉన్నట్లు నాకు తెలిసింది. అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, టి.రాజయ్య, పట్నం మహేందర్‌రెడ్డి, ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్, ఈటల రాజేందర్, బండి సంజయ్, జానారెడ్డి కుమారుడు రఘువీర్‌ తదితరులు ఇందులో ఉన్నారు. వ్యాపారులు, స్థిరాస్తి సంస్థల వారినీ పర్యవేక్షించారు.

భాజపాకు బ్రేక్‌ వేయాలని

దుబ్బాక, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో భాజపా విజయాలు సాధించిన తర్వాత ఆ పార్టీకి బ్రేక్‌ వేయాలన్న ఉద్దేశంతో మునుగోడు ఉప ఎన్నికను కేసీఆర్‌ చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. భాజపాలో పెద్దలుగా చెప్పుకొంటున్న కొందరు తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిని తమ పార్టీలో చేరాలని ప్రలోభపెడుతున్నట్లు 2022 అక్టోబరు చివర్లో ఆయనకు తెలిసింది. మరికొందరు భారాస ఎమ్మెల్యేలనూ తనతోపాటు తేవాలని రోహిత్‌రెడ్డిపై ఒత్తిడి తెచ్చినట్లు కూడా సమాచారం అందింది. దీని ఆధారంగా భాజపాను ఇరుకునపెట్టాలని కేసీఆర్‌ భావించారు. ఇందుకు బాధ్యులైన వారందర్నీ పర్యవేక్షించాలన్న ఆయన ఆదేశాలకు అనుగుణంగా ప్రణీత్‌రావు ఈ బాధ్యతలు చేపట్టారు. కొందరి ఫోన్లు ట్యాప్‌ చేసి, వారి సంభాషణలకు సంబంధించిన ఒక ఆడియో క్లిప్‌ రూపొందించి కేసీఆర్‌కు ఇచ్చారు. దాని ఆధారంగా వ్యూహం పన్నారు. ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టిన నందుతోపాటు ఇద్దరు స్వామీజీలను మొయినాబాద్‌ దగ్గర్లోని అజీజ్‌నగర్‌లో ఉన్న ఒక ఫామ్‌హౌస్‌కు రప్పించారు. ఈ పనికోసమే నేను టాస్క్‌ఫోర్స్‌ సీఐ శ్రీనాథ్‌రెడ్డి, ఎస్సై శ్రీకాంత్‌లను దిల్లీ పంపించి స్పై కెమెరాలను తెప్పించాను. వాటిని టాస్క్‌ఫోర్స్‌ అధికారులు అశోక్‌రెడ్డి, మల్లికార్జున్, శ్రీకాంత్‌లు ఫామ్‌హౌస్‌లో అమర్చారు. వేర్వేరు సామాజికవర్గాలకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను ఈ ఆపరేషన్‌లో పాల్గొనాలని పెద్దాయన(కేసీఆర్‌) ఆదేశించారు. అనుకున్నట్లుగానే ఆపరేషన్‌ పూర్తయింది. సైబరాబాద్‌ ఎస్‌వోటీ తదుపరి చర్యలు తీసుకొంది. అనంతరం సిట్‌ ఏర్పాటు చేశారు. భాజపా జాతీయ నాయకుడు బి.ఎల్‌.సంతోష్‌ను అరెస్టు చేసి, తద్వారా ఈడీ కేసులో తన కుమార్తె కవితను ఇబ్బందిపెడుతున్న ఆ పార్టీని తమతో సయోధ్యకు వచ్చేలా చేయాలన్నదే కేసీఆర్‌ లక్ష్యం. అయితే కొంతమంది సైబరాబాద్‌ పోలీసుల అసమర్థత వల్ల కేరళలోని మాతా అమృతానందమయి సంస్థలోని కీలక వ్యక్తి ఒకరు తప్పించుకొని పారిపోయారు. ఎస్పీ రెమా రాజేశ్వరి, ఎస్‌ఐబీ సీఐ గట్టు రాజమల్లు హుటాహుటిన ప్రత్యేక విమానంలో కేరళ వెళ్లినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆ తర్వాత బీఎల్‌ సంతోష్‌ను అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు కేసు సిట్‌ నుంచి సీబీఐకి బదిలీ అయింది. అనుకున్నట్లు పని పూర్తికాకపోవడంతో కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా..

మునుగోడు ఉప ఎన్నిక సమయంలో భాజపా అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల డబ్బు స్వాధీనం చేసుకోవాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు అందాయి. పేర్లు, వారి ఫోన్‌ నంబర్లు పోలీసు కమిషనర్‌ ద్వారా నాకు అందేవి. వారి ఫోన్లు ట్యాప్‌ చేసి.. సమాచారం సేకరించేందుకు ప్రణీత్‌రావు సాయం తీసుకునేవాడిని. జి.వివేక్, రాజగోపాల్‌రెడ్డిల పేర్లు ఉన్న చేతిరాత కాగితం ఒకటి సీఎంవో నుంచి రావడం నాకు బాగా గుర్తుంది. వీరిద్దరి సహచరుల ఆర్థిక లావాదేవీలపై కన్నేసేందుకే ఎస్‌ఐబీకి వీరి పేర్లు ఉన్న కాగితం పంపారు. ఈటల రాజేందర్‌ పీఏ జనార్దన్‌కు సంబంధించిన సమాచారాన్ని ప్రణీత్‌రావు నాకు పంపారు. దీని ఆధారంగా భారతీయ విద్యాభవన్‌ దగ్గర రూ.90 లక్షలు స్వాధీనం చేసుకొని జూబ్లీహిల్స్‌ పోలీసులకు అప్పగించాం. రాజగోపాల్‌రెడ్డికి ఇచ్చేందుకు ఈటల ఈ డబ్బును పంపుతున్నారు. అక్టోబరు రెండో వారంలో ప్రభాకర్‌రావు సూచనల మేరకు ప్రణీత్‌రావు మాకు కొన్ని వివరాలు పంపారు. వాటి ఆధారంగా టాస్క్‌ఫోర్స్‌ సీఐ టి.శ్రీనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలోని బృందం మ్యారియేట్‌ హోటల్‌ వద్ద రాజగోపాల్‌రెడ్డి అనుచరుల నుంచి రూ.3.5 కోట్లు స్వాధీనం చేసుకొని గాంధీనగర్‌ పోలీసులకు అప్పగించింది. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా భారాసకు చెందిన డబ్బును ఎలాంటి ఆటంకాలు లేకుండా రవాణా చేయాలని ఎస్‌ఐబీతోపాటు నిఘా విభాగానికి చెందిన ఉన్నతాధికారులను కేసీఆర్‌ ఆదేశించారు. అదనపు ఎస్పీ భుజంగరావు పర్యవేక్షణలో నల్గొండ పోలీసుల సహకారంతో ప్రైవేటు వాహనాల్లో ఆ డబ్బును ఓఆర్‌ఆర్‌ మీదుగా మునుగోడుకు తరలించారు. ప్రణీత్‌రావు ఇచ్చిన కీలక సమాచారం, మా మధ్య ఉన్న మంచి సమన్వయం ద్వారా ప్రతిపక్షాల ఆర్థిక మూలాలను దెబ్బకొట్టగలిగాం. చట్టబద్ధంగా అయితేనేం, చట్టవ్యతిరేకంగా అయితేనేం ప్రణీత్‌రావు మాత్రం ఫోన్లు ట్యాప్‌ చేయడం ద్వారా అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరిస్తుండేవారు. ప్రత్యేక టూల్స్‌ ద్వారా ఆయా వ్యక్తుల ఇంటర్నెట్‌ సమాచారం కూడా సేకరించేవారు. ఇలాంటి పనులు చేయడంలో పూర్తి పట్టు సాధించగలిగాం. ఇందుకు చాలామంది జిల్లా అధికారులు, ఉన్నతాధికారులు సహకరించేవారు. లేదంటే తమకు ఏమీ పట్టనట్లు వ్యవహరించేవారు. వీరందరికీ కేసీఆర్‌ ఆశీస్సులు ఉంటాయని, మంచి పోస్టింగులు దక్కుతాయని చెప్పేవాళ్లం. 

ప్రణీత్‌రావు వాంగ్మూలంలో నాటి మంత్రి పేరు

ఇదే కేసులో తొలుత అరెస్టయిన ప్రణీత్‌రావు కూడా తన వాంగ్మూలంలో పలు విషయాలు వెల్లడించారు. ‘‘2023 శాసనసభ ఎన్నికల సందర్భంగా ప్రభాకర్‌రావు నన్ను తన ఇంటికి రమ్మన్నారు. ఐన్యూస్‌ ఎండీ శ్రవణ్‌రావును కలుస్తుండాలని, ఆయన ద్వారా అనేక మంది ఫోన్‌ నంబర్లు వస్తాయని ప్రభాకర్‌రావు ద్వారా అప్పటి మంత్రి హరీశ్‌రావు చెప్పించారు. ఇలా వచ్చిన సమాచారం ఆధారంగా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉన్న వాటిని భుజంగరావు, రాధాకిషన్‌రావులకు చేరవేస్తుండేవాడిని. ప్రతిపక్ష నాయకులు, వారి మద్దతుదారులు, కాంగ్రెస్, భాజపాలకు ఆర్థికంగా మద్దతు ఇస్తున్నవారికి సంబంధించిన నిర్దుష్టమైన సమాచారం సేకరించేవాళ్లం. ప్రతిపక్షాలకు చెందిన డబ్బు పట్టుకోవడమే మా లక్ష్యం. మేము చేస్తోంది చట్టవిరుద్ధమని తెలిసిన తర్వాత కూడా కొనసాగించాం. అందుకే మేము ఎప్పుడూ వాయిస్‌ ఓవర్‌ ఇంటర్నెట్‌ ప్రొటోకాల్‌(వీవోఐపీ) లేదా వాట్సప్‌ ద్వారానే మాట్లాడుకునేవాళ్లం. ఇటీవలి ఎన్నికల్లో భారాస ఓడిపోవడంతో మాపై చర్యలు తప్పవని భావించాం. ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు ముందుజాగ్రత్త చర్యగా మా వద్ద ఉన్న అన్ని ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు, వాటిలోని ఆధారాలను ధ్వంసం చేశాం. ఎస్‌ఐబీ ఉద్యోగుల సహకారంతో అన్ని హార్డ్‌డిస్కులను తొలగించి, వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేశాం. పాతవాటిని ధ్వంసం చేశాం. ఇందుకు ఆర్‌ఎస్‌ఐ హరికృష్ణ తదితరులు సహకరించారు. ఎస్‌ఐబీ ఏర్పాటు నుంచీ సేకరించి నిల్వ చేసిన వామపక్ష తీవ్రవాదానికి సంబంధించిన సమాచారం అంతా ధ్వంసం అవుతుందని తెలిసినప్పటికీ మమ్మల్ని మేము కాపాడుకోవడానికి వేరే మార్గం కనిపించలేదు’’ అని ప్రణీత్‌రావు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు.


ప్రతిపక్షాలను కట్టడి చేసేందుకు అప్పటి ప్రభుత్వం ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యూహాన్ని రచించింది. భారాస ప్రయోజనాల దృష్ట్యా కీలకమైన హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ విభాగానికి అధికారిగా తమ సామాజికవర్గానికే చెందిన నమ్మకస్థుడు కావాలని సీఎం కేసీఆర్‌ కోరుకున్నారు. ఆయన అభీష్టం, ప్రభాకర్‌రావు సూచన మేరకు నన్ను టాస్క్‌ఫోర్స్‌ డీసీపీగా నియమించారు. అప్పటినుంచి కేసీఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా ఆయనతోపాటు ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులకు సంబంధించిన ముఖ్యమైన పనులు చక్కబెట్టడం మొదలుపెట్టా. సివిల్‌ వివాదాల పరిష్కారంతోపాటు ముఖ్యమంత్రికి, భారాసకు సమస్యలు సృష్టిస్తున్నవారిని దారిలోకి తేవడం, ఆందోళనలను అణచివేయడం వంటివి ఈ పనుల్లో ఉండేవి. 

వాంగ్మూలంలో రాధాకిషన్‌రావు


తీవ్ర విమర్శలు చేస్తున్నవారిపై..

కేసీఆర్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యులపై, ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు చేస్తున్న తీన్మార్‌ మల్లన్నను ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు 2021 ఆగస్టులో చిలకలగూడ పరిధిలో నమోదైన బెదిరింపుల కేసులో భాగంగా అరెస్టు చేశాం. 2021 ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు మల్లన్న తీవ్ర పోటీ ఇచ్చారు. ఆయనను నిరంతరం గమనిస్తుండాలని ప్రభాకర్‌రావును ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రణీత్‌రావు నిరంతరం మల్లన్నకు సంబంధించిన సమాచారం చేరవేస్తుండేవారు. కేసీఆర్‌ను విమర్శిస్తూ పోస్టులు పెట్టినందుకు 2022లో ఎస్‌ఐబీ ఇచ్చిన సమాచారం ఆధారంగా సైబరాబాద్‌ పరిధిలోని సునీల్‌ కనుగోలు కార్యాలయంలో హైదరాబాద్‌ నగర పోలీసులు, సీసీఎస్‌ పోలీసులు కలిసి సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దమొత్తంలో ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు స్వాధీనం చేసుకున్నారు. కాంగ్రెస్‌ నాయకులకు సంబంధించిన కీలక సమాచారం సేకరించి, వారికి ఆటంకం కలిగించే ఉద్దేశంతోనే చట్టవిరుద్ధంగా ఈ సోదాలు నిర్వహించారని పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. 2023 ఎన్నికల్లో భారాస ఓడిపోయిన తర్వాత ప్రభాకర్‌రావు, నేను రాజీనామా చేశాం. ఫోన్‌ట్యాపింగ్‌ కేసు నమోదై, నన్ను అరెస్టు చేసిన తర్వాత నా వద్ద ఉన్న రెండు ఫోన్లు అధికారులకు అప్పగించా. ఇందులో ఒక ఫోన్‌లో సమాచారం చెరిపివేశా. అందులో ప్రభాకర్‌రావు, ప్రణీత్‌రావు, భుజంగరావు, ఇతర అధికారులు, ప్రైవేటు వ్యక్తులతో జరిపిన ఛాటింగ్‌లు ఉన్నాయి. మరో ఫోన్‌లో నాకు ఇష్టమైన మనుమరాలు ఫొటోతోపాటు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. అందుకే అందులోని సమాచారం చెరిపివేయలేదు’’ అని తన వాంగ్మూలంలో రాధాకిషన్‌రావు వెల్లడించారు.


ఇంటర్నెట్‌ కాల్స్‌ను కూడా 

ఎస్‌ఐబీ తమ ఫోన్లను ట్యాప్‌ చేస్తుందన్న భయంతో అనేక మంది రాజకీయ నాయకులు, న్యాయవాద వృత్తికి చెందినవారు, అధికారులు సాధారణ ఫోన్లు వాడటం మానేసి వాట్సప్, సిగ్నల్, స్నాప్‌చాట్‌ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. వారి ఇంటర్నెట్‌ ఫోన్‌ కాల్స్‌ను గమనించేందుకు ప్రభాకర్‌రావు, ప్రణీత్‌రావు, ఆయన బృందంలోని సభ్యులు ఇంటర్నెట్‌ ప్రొటోకాల్‌ డేటా రికార్డ్‌(ఐపీడీఆర్‌) సేకరించడం మొదలుపెట్టారు. 2023 ఎన్నికల సందర్భంగా అక్టోబరు, నవంబరు నెలల్లో శ్రవణ్‌కుమార్‌ అప్పటి మంత్రి హరీశ్‌రావు తరఫున ఎస్‌ఐబీ చీఫ్‌ ప్రభాకర్‌రావును కలుస్తుండేవారు. శ్రవణ్‌కుమార్‌ను కలుస్తుండాలని ప్రణీత్‌రావుకు ప్రభాకర్‌రావు చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు