Telangana: 46 లక్షల టన్నుల ధాన్యం సేకరణ

యాసంగి ధాన్యం కొనుగోళ్లు దాదాపుగా పూర్తయ్యాయి. జూన్‌ 4వ తేదీ నాటికి రాష్ట్రవ్యాప్తంగా 46.38 లక్షల టన్నుల వడ్లు సేకరించారు. వీటి విలువ రూ.10,201.91 కోట్లు.

Published : 06 Jun 2024 06:04 IST

యాసంగి కొనుగోళ్లు దాదాపుగా పూర్తి
రూ.10,201 కోట్ల విలువైన వడ్ల కొనుగోలు

ఈనాడు, హైదరాబాద్‌: యాసంగి ధాన్యం కొనుగోళ్లు దాదాపుగా పూర్తయ్యాయి. జూన్‌ 4వ తేదీ నాటికి రాష్ట్రవ్యాప్తంగా 46.38 లక్షల టన్నుల వడ్లు సేకరించారు. వీటి విలువ రూ.10,201.91 కోట్లు. రాష్ట్రంలోని 32 జిల్లాల్లో 7,178 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. 8,20,096 మంది రైతుల నుంచి ధాన్యం కొన్నారు. వరి కోతలు ఏప్రిల్, మే నెలల్లోనే పూర్తయ్యాయి. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం రావడం కూడా దాదాపుగా నిలిచిపోయింది.

గతేడాదితో పోలిస్తే తగ్గిన ధాన్యం సేకరణ

అత్యధికంగా నిజామాబాద్‌ జిల్లాలో 4.27 లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. జగిత్యాలలో 4.17 లక్షల టన్నులు, కామారెడ్డిలో 3.15 లక్షల టన్నులు, నల్గొండలో 3.07 లక్షల టన్నుల ధాన్యం కొన్నారు. గతేడాది యాసంగితో పోలిస్తే ఈసారి ధాన్యం సేకరణ తగ్గింది. 2023 యాసంగిలో 65.10 లక్షల టన్నుల వడ్లు కొన్నారు. ఈసారి 75.10 లక్షల టన్నులు కొనాలని పౌరసరఫరాల సంస్థ లక్ష్యం నిర్దేశించుకోగా.. జూన్‌ 4వ తేదీ నాటికి 46.38 లక్షల టన్నులు సేకరించింది. గతేడాదితో పోలిస్తే నల్గొండ జిల్లాలో ఈసారి 50 శాతం కూడా ధాన్యం కొనుగోళ్లు జరగలేదు. నిజామాబాద్, సూర్యాపేట జిల్లాల్లోనూ గణనీయంగా తగ్గాయి. ఈసారి వరి సాగు దాదాపు ఐదు లక్షల ఎకరాల్లో తగ్గిందని పౌరసరఫరాల సంస్థ అధికారులు చెబుతున్నారు. మరోవైపు, ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్లు పెద్దమొత్తంలో రైతుల నుంచి కొనుగోలు చేయడంతో కేంద్రాలకు వచ్చే ధాన్యం తగ్గింది. గత సంవత్సరం యాసంగి ధాన్యాన్ని పక్కదారి పట్టించిన కొందరు మిల్లర్లు ఆ లెక్కల్ని సర్దుబాటు చేసేందుకు రైతుల నుంచి భారీగా కొన్నారు. కొనుగోళ్లపై అన్ని జిల్లాల అధికారులతో ఉన్నతాధికారులు బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల్లో ఇంకా ఎక్కడెక్కడ ధాన్యం ఉందో అధికారులు ఆరా తీశారు. కొన్ని కేంద్రాల్లో మాత్రమే ఉందని అధికారులు తెలిపారు. కొన్నిచోట్ల 100-200 టన్నులు.. మరికొన్ని చోట్ల 3-4 వేల టన్నులు ఉన్నట్లు వెల్లడించారు. మొత్తంగా 40 వేల టన్నుల వరకు ధాన్యం ఉంటుందని పౌరసరఫరాల సంస్థ అంచనాకు వచ్చింది. మిగిలిన ధాన్యం కొనుగోళ్లు రెండు, మూడు రోజుల్లో పూర్తవుతాయని తెలుస్తోంది. అకాల వర్షాలతో తడిసిన వడ్లను బాయిల్డ్‌ కోటాలో సర్దుబాటు చేస్తున్నారు. బాగా రంగుమారిన, మిల్లింగ్‌కు అనుకూలంగా లేనివీ తీసుకున్నట్లు పౌరసరఫరాల సంస్థ వర్గాల సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు