Phone Tapping Case: 4 నెలల్లో 1,300 ఫోన్ల ట్యాపింగ్‌!

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో దర్యాప్తు లోతుల్లోకి వెళ్తున్నకొద్దీ విస్మయకర కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దందా సుదీర్ఘకాలంగా సాగినా ఇటీవలి శాసనసభ ఎన్నికల సమయంలో తార స్థాయికి చేరినట్లు తెలుస్తోంది.

Updated : 19 May 2024 11:47 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో దర్యాప్తు లోతుల్లోకి వెళ్తున్నకొద్దీ విస్మయకర కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దందా సుదీర్ఘకాలంగా సాగినా ఇటీవలి శాసనసభ ఎన్నికల సమయంలో తార స్థాయికి చేరినట్లు తెలుస్తోంది. గతేడాది ఆగస్టు నుంచి నవంబరు చివరి వరకు నాలుగు నెలల కాలంలోనే 1,300 ఫోన్లను ట్యాప్‌ చేసినట్లు వెల్లడైంది. అంటే రోజుకు సగటున పదికిపైగా ఫోన్లపై నిఘా ఉంచినట్లు తేలింది. స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎస్‌ఐబీ) కేంద్రంగా రహస్యంగా సాగిన ఈ దందాను నవంబరు నెలాఖరున ముగించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. దీన్నిబట్టి శాసనసభ ఎన్నికల్లో భారాసకు లబ్ధి చేకూర్చడంపైనే ఎస్‌ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావు బృందం శ్రద్ధ వహించినట్లు వెల్లడవుతోంది. శాసనసభ ఎన్నికలు నవంబరు 30న జరిగిన సంగతి తెలిసిందే. అలా ఎన్నికలు ముగిసిన వెంటనే ఫోన్‌ ట్యాపింగ్‌ సైతం ఆగిపోయినట్లు గుర్తించారు. భారాస అభ్యర్థులపై పోటీ చేసిన ప్రత్యర్థుల కదలికలపై నిఘా ఉంచడం.. వారి అనుచరుల కార్యకలాపాల్ని పసిగట్టడం.. వారికి ఆర్థిక వనరులు అందకుండా నియంత్రించడం.. వీలు కుదిరితే భారాసకు అనుకూలంగా మార్చడం.. లాంటి వ్యవహారాలపై ప్రభాకర్‌రావు బృందం దృష్టి పెట్టినట్లు తేలింది. పలు చోట్ల భారాస ప్రత్యర్థి పార్టీలకు చెందిన సొమ్మును జప్తు చేయించగలిగినట్లు తెలుస్తోంది. ఆ ఎన్నికల వేళ హైదరాబాద్‌ సహా శివార్లలో రూ.కోట్ల సొమ్మును పట్టుకున్నారు.  

1,300 ఫోన్లపై నిఘా ఉంచినట్లు దర్యాప్తు క్రమంలో వెల్లడి కావడంతో తదుపరి అంకంపై హైదరాబాద్‌ పోలీసులు దృష్టి సారించారు. ఆయా బాధితులకు సమాచారమిస్తూ వారితో వాంగ్మూలాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. చట్టవిరుద్ధంగా ఫోన్లను ట్యాప్‌ చేయడం ద్వారా జరిగిన నష్టం గురించి బాధితులతో చెప్పిస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి అక్రమంగా ఫోన్‌ ట్యాపింగ్‌ చేసినట్లు నిందితులు అంగీకరించినా వాటి పర్యవసానాలను న్యాయస్థానం ముందు ఉంచాల్సిన అవసరం దర్యాప్తు అధికారులపైనే ఉంది. ఇందులో బాధితుల వాంగ్మూలాలే కీలకం కావడంతో ఈ ప్రక్రియపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని