Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో స్తబ్ధత

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తులో స్తబ్ధత నెలకొంది. కీలక నిందితులు విదేశాల్లో ఉండటం, వారిని రప్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ప్రాథమిక దశలోనే ఉండటం దర్యాప్తునకు ఆటంకంగా మారింది.

Published : 11 Jun 2024 04:26 IST

 

ప్రభాకర్‌రావు విచారణతో మరిన్ని విషయాలు వెల్లడయ్యే అవకాశం
ఆయనను రప్పించేందుకు పోలీసుల యత్నాలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తులో స్తబ్ధత నెలకొంది. కీలక నిందితులు విదేశాల్లో ఉండటం, వారిని రప్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ప్రాథమిక దశలోనే ఉండటం దర్యాప్తునకు ఆటంకంగా మారింది. స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచి(ఎస్‌ఐబీ) కేంద్రంగా జరిగిన ట్యాపింగ్‌ వ్యవహారంపై ఫిబ్రవరి 10వ తేదీన పంజాగుట్ట పోలీస్‌స్టేషన్లో కేసు నమోదైంది. నిందితులు ప్రణీత్‌రావు, రాధాకిషన్‌రావు, భుజంగరావు, తిరుపతన్నలను అరెస్టు చేశారు. వారిని విచారించి.. వాంగ్మూలాలు నమోదు చేశారు. ట్యాపింగ్‌ ఎలా చేశారు, ఆధారాలు ఎలా ధ్వంసం చేశారు, ఎవరి ఆదేశాల మేరకు చేశారు వంటి విషయాలను పోలీసులు రాబట్టారు. రాజకీయ నాయకులు మొదలు హైకోర్టు జడ్జీల ఫోన్‌ల వరకూ ట్యాప్‌ చేసినట్లు వారు స్వయంగా అంగీకరించారు. ఈ వ్యవహారంలో ఎస్‌ఐబీ ఓఎస్డీగా పనిచేసిన ప్రభాకర్‌రావును ప్రధాన నిందితుడని పోలీసులు గుర్తించారు. అయితే కేసు నమోదయ్యే నాటికే ఆయన అమెరికా వెళ్లారు. మరో నిందితుడు శ్రవణ్‌రావు కూడా విదేశాలకు వెళ్లిపోయాడు. ప్రభాకర్‌రావు ఆచూకీ కోసం ఇంటర్‌పోల్‌ ద్వారా బ్లూ కార్నర్‌ నోటీసు జారీ చేయించేందుకు పోలీసులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. 

ఈ కేసులో సూత్రధారి ప్రభాకర్‌రావేనా?, ఇంకా ఎవరైనా ఉన్నారా? అన్నది తేలాల్సి ఉంది. రాజకీయ లబ్ధి కోసమే ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారనే ఆరోపణలు వ్యక్తమైన నేపథ్యంలో ఆయనను విచారించాల్సి ఉంది. ప్రభాకర్‌రావును విచారిస్తే మరిన్ని విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. నిందితులు ధ్వంసం చేసిన ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల శకలాలను మూసీ నది నుంచి సేకరించారు. కట్టర్‌తో కత్తిరించి మరీ బురదలో పడేయడం, కాగితాలను తగలబెట్టడం వల్ల.. వాటి నుంచి డేటా తిరిగిపొందటం సాధ్యం కాకపోవచ్చు. ఆధారాలను ధ్వంసం చేశారని నిరూపించవచ్చు తప్ప.. ఎవరెవరి ఫోన్లు ట్యాప్‌ చేశారు వంటి వివరాలు రాబట్టడం కష్టతరంగా మారింది. న్యాయస్థానానికి కావాల్సింది నిందితుల వాంగ్మూలాలు మాత్రమే కాదు.. ఆధారాలు కూడా. విదేశాల్లో ఉన్న నిందితులను రప్పించి, వారిని విచారించడం ద్వారా మరికొన్ని ఆధారాలు సేకరించవచ్చని పోలీసు అధికారులు భావిస్తున్నారు. అయితే, వారంతట వారు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. సాంకేతిక కారణాల వల్ల చట్టపరంగా తిరిగి రప్పించడం కూడా వెంటనే సాధ్యం అయ్యేలా లేదు. ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తులో వేగం మందగించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని