RRR: ఆర్‌ఆర్‌ఆర్‌ అటవీ భూసేకరణ మళ్లీ మొదటికి..!

హైదరాబాద్‌ అవుటర్‌ రింగు రోడ్డు ఆవల నిర్మించే ప్రాంతీయ రింగు రోడ్డు కోసం అటవీ భూసేకరణ కథ మళ్లీ మొదటికి వచ్చింది. సకాలంలో వివరాలు ఇవ్వకపోవటంతో మునుపటి ప్రతిపాదనల దరఖాస్తు రద్దు అయినట్లు సమాచారం.

Published : 19 May 2024 09:18 IST

నర్సాపూర్‌ రిజర్వు ఫారెస్ట్‌ భూసేకరణలో జాప్యం
గడువు ముగియడంతో మునుపటి దరఖాస్తు రద్దు

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ అవుటర్‌ రింగు రోడ్డు ఆవల నిర్మించే ప్రాంతీయ రింగు రోడ్డు కోసం అటవీ భూసేకరణ కథ మళ్లీ మొదటికి వచ్చింది. సకాలంలో వివరాలు ఇవ్వకపోవటంతో మునుపటి ప్రతిపాదనల దరఖాస్తు రద్దు అయినట్లు సమాచారం. ప్రాంతీయ రింగు రోడ్డు దక్షిణ భాగంలోని కొంత నర్సాపూర్‌ రిజర్వు ఫారెస్ట్‌ నుంచి వెళ్లేలా ఎలైన్‌మెంట్‌ను రూపొందించారు. దక్షిణ భాగాన్ని చౌటుప్పల్‌-ఆమనగల్లు-షాద్‌నగర్‌-సంగారెడ్డి మీదుగా సుమారు 186 కిలోమీటర్ల మేర నిర్మించాల్సి ఉంది. రిజర్వు ఫారెస్ట్‌ భూమిని సేకరించేందుకు కేంద్ర, రాష్ట్ర అటవీ శాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది. దీనికి సంబంధించి అధికారులు దరఖాస్తు సమర్పించినప్పటికీ అది తిరస్కరణకు గురైంది. ఈ లోపు దరఖాస్తు గడువు తీరిపోయిందని సమాచారం. రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశం సందర్భంగా నర్సాపూర్‌ అటవీ భూసేకరణ అంశం తెరపైకి వచ్చింది. 

మరోసారి దరఖాస్తు చేయాల్సిందే...

మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ రిజర్వు అటవీ ప్రాంతంలోని 79 హెక్టార్ల భూమిని ప్రాంతీయ రింగు రోడ్డు కోసం సేకరించాల్సి ఉంది. తూప్రాన్, శివంపేట, నర్సాపూర్‌ మండలాల పరిధిలోని రిజర్వు ఫారెస్టు నుంచి ప్రాంతీయ రింగు రోడ్డు రహదారి నిర్మించాలని అధికారులు ఎలైన్‌మెంట్‌ను రూపొందించారు. ఆ ప్రతిపాదనలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతి లభించింది. భూసేకరణ కోసం అటవీ శాఖకు రెవెన్యూ అధికారులు 2023 మార్చి నెలలో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేశారు. క్షేత్రస్థాయి పరిశీలన చేసిన అధికారులు ఇచ్చిన ప్రతిపాదనల్లో వివరాలు సమగ్రంగా లేవని గుర్తించి మరోసారి అప్‌లోడ్‌ చేయాలని రెవెన్యూ శాఖకు తెలిపినట్లు సమాచారం. అటవీ శాఖ నిబంధనల మేరకు 90 రోజుల వ్యవధిలో వివరాలు అప్‌లోడ్‌ చేయని పక్షంలో 91వ రోజు దరఖాస్తు రద్దవుతుంది. అటవీ భూమి కోసం మరో దఫా దరఖాస్తు చేయాల్సి ఉంటుందని ఉన్నతాధికారి ఒకరు ‘ఈనాడు’తో చెప్పారు.  సేకరించాల్సిన భూమి రిజర్వు ఫారెస్ట్‌కు సంబంధించినది కావటంతో రాష్ట్ర అటవీ శాఖతోపాటు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ నుంచి కూడా అనుమతి తీసుకోవాల్సి ఉంది. ఈ ప్రక్రియ మళ్లీ మొదటికి రావటంతో భూసేకరణ మరింత ఆలస్యమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని