Ramoji Rao: రామోజీరావుకు సీనియర్‌ పాత్రికేయుల ఘన నివాళి

పత్రికా రంగంలోనే కాకుండా వివిధ రంగాల్లో తనదైన ముద్ర వేసుకున్న రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు తెలుగువారందరికీ ఆదర్శమని పలువురు సీనియర్‌ పాత్రికేయులు కొనియాడారు.

Updated : 11 Jun 2024 04:40 IST

రామోజీరావుకు నివాళులు అర్పిస్తున్న సీనియర్‌ పాత్రికేయులు

ఖైరతాబాద్, న్యూస్‌టుడే: పత్రికా రంగంలోనే కాకుండా వివిధ రంగాల్లో తనదైన ముద్ర వేసుకున్న రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు తెలుగువారందరికీ ఆదర్శమని పలువురు సీనియర్‌ పాత్రికేయులు కొనియాడారు. రామోజీరావు మృతికి ‘ఈనాడు’ వయోధిక పాత్రికేయులు సంతాపం ప్రకటించారు. సోమవారం సోమాజిగూడలోని హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో ‘ఈనాడు’తో, రామోజీరావుతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా రెండు నిమిషాలు మౌనం పాటించి.. నివాళులు అర్పించారు. వల్లీశ్వర్‌ మాట్లాడుతూ.. వృత్తిని, వ్యాపారాన్ని ఆయన ఒకే గాటన కట్టలేదని, వార్తలు రాసేవారికి ధైర్యం ఇచ్చి ప్రోత్సహించారని అన్నారు. ‘ఈనాడు’లో పనిచేయడం గర్వంగా ఉండేదన్నారు. ప్రతినెలా ఒకటో తేదీ కంటే ముందే జీతాలిచ్చిన ఏకైక సంస్థ అని కొనియాడారు. ఎ.రజాహుస్సేన్‌ మాట్లాడుతూ.. నిష్పాక్షిక వార్తల కోసం ‘ఈనాడు’ను మాత్రమే పాఠకులు చదువుతారని, వార్తల విషయంలో రామోజీరావు నిక్కచ్చిగా ఉండేవారని తెలిపారు. మండవ దుర్గాకుమార్‌ మాట్లాడుతూ.. ఎందరికో ఉపాధి కల్పించిన గొప్ప వ్యక్తి రామోజీరావు అని కొనియాడారు. పాశం యాదగిరి మాట్లాడుతూ.. ‘ఈనాడు పాత్రికేయ పాఠశాల’లో శాస్త్రీయ శిక్షణ ఇచ్చి ఉత్తమ పాత్రికేయుల్ని తీర్చిదిద్దిన ఘనత రామోజీరావుదన్నారు. లాభాలతో ప్రమేయం లేకుండా పత్రికను నడిపిన పాత్రికేయ దిగ్గజమని కొనియాడారు. పత్రికను ఉదయాన్నే పాఠకుల ముంగిట్లో ఉండేలా చేయడమే ఆయన విజయానికి ముఖ్య కారణమన్నారు. చెన్నయ్య మాట్లాడుతూ.. రామోజీరావు మహా సామ్రాజ్యాన్ని స్థాపించారన్నారు. మధు మాట్లాడుతూ.. ఉద్యోగులతో రామోజీరావు సత్సంబంధాలు కలిగి ఉండేవారన్నారు. పల్లె వార్తలకు ఎంతో ప్రాధాన్యమిచ్చి వార్తాలోకంలో సంచలనం సృష్టించారని వినయ్‌కుమార్‌ పేర్కొన్నారు. జమున భావోద్వేగానికి లోనవుతూ.. ‘ఈనాడు’ నుంచి బయటకు వచ్చినా ఆయనపై ప్రేమ, అభిమానం ఏమాత్రం తగ్గలేదన్నారు. తన హాస్యానికి రామోజీరావే కారణమని శంకరనారాయణ అన్నారు. మలి వయసు జీవితం, స్మృతివనం గురించి ఆయన తన ఆలోచనను అప్పుడే చెప్పారని గుర్తుచేసుకున్నారు. తెలుగు జాతి, తెలుగు భాష ఘనకీర్తికి రామోజీరావు కారణమని సుందరసాయి కొనియాడారు. శ్రీనివాస్‌రెడ్డి, మధు, విశ్వేశ్వర్‌రెడ్డి, రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కె.వేణుగోపాల్, ఇస్మాయిల్, హేమసుందర్, ఎల్‌.వేణుగోపాలనాయుడు, కేశవులు, మల్లికార్జునరావు, కేవీ సుబ్రహ్మణ్యం, శరత్‌కుమార్, రాధాకృష్ణ, కాంతయ్య, సర్వేశ్వరరెడ్డి, రామకృష్ణ, రాజేశ్వరరావు తదితరులు నివాళులర్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు