Phone Tapping Case: కాంగ్రెస్‌ డబ్బు పట్టుకోవడమే లక్ష్యం: తిరుపతన్న

ప్రతిపక్షాలు.. ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన డబ్బు రవాణాను అడ్డుకోడమే లక్ష్యంగా పనిచేశామని ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో అరెస్టయిన స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎస్‌ఐబీ) అదనపు ఎస్పీ తిరుపతన్న పేర్కొన్నారు.

Published : 29 May 2024 05:16 IST

ఇందుకోసం ప్రత్యేక బృందాలు
వాంగ్మూలంలో తిరుపతన్న

ప్రతిపక్షాలు.. ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన డబ్బు రవాణాను అడ్డుకోడమే లక్ష్యంగా పనిచేశామని ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో అరెస్టయిన స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎస్‌ఐబీ) అదనపు ఎస్పీ తిరుపతన్న పేర్కొన్నారు. ఇందుకోసం గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎస్‌ఐబీ ఓఎస్డీ ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసుకున్నామన్నారు. కాంగ్రెస్‌కు చెందిన డబ్బు పెద్దమొత్తంలో పట్టుకున్నామని, కామారెడ్డి నియోజకవర్గం కోసం మరో బృందం ఏర్పాటు చేశామని తెలిపారు. పోలీసుల విచారణలో తిరుపతన్న వెల్లడించిన వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘నేను నల్గొండ జిల్లాలో ఎస్సైగా పనిచేసినప్పుడు ప్రభాకర్‌రావు అక్కడ ఓఎస్డీగా ఉండేవారు. అప్పటి నుంచే మా ఇద్దరికీ పరిచయం ఉంది. ఎస్‌ఐబీలోకి వచ్చిన తర్వాత మావోయిస్టు అనుబంధ సంఘాల కదలికలు గమనించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చే విధులు నిర్వర్తించేవాడిని. ఏడుగురు కానిస్టేబుళ్లు, ఒక హెడ్‌ కానిస్టేబుల్‌తో కలిసి మూడు షిఫ్టుల్లో 24 గంటలూ పనిచేసేవాళ్లం. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా మావోయిస్టుల కదలికలు గమనించేందుకు పోలింగ్‌ రోజు అక్కడికి వెళ్లా. ఫోన్‌కాల్స్‌ను పర్యవేక్షించేందుకు ప్రణీత్‌రావు ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎస్‌వోటీతో ప్రతిరోజూ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య ప్రభాకర్‌రావుతో సమావేశం ఉండేది. ఇందులో నేను కూడా పాల్గొనేవాడిని. ఏ ఒక్కరోజు కూడా ప్రణీత్‌రావు వచ్చేవారు కాదు. ఆయనకు ఎలాంటి పనులు అప్పగించేవారో అప్పుడైతే నాకు తెలియదు. ఇటీవలి శాసనసభ ఎన్నికల సందర్భంగా ప్రతిపక్షాలకు సంబంధించిన నగదు రవాణా సమాచారం విషయంలో ప్రణీత్‌రావుతో కలిసి పనిచేయాలని నన్ను ప్రభాకర్‌రావు ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బృందంలో సీఐలు గట్టుమల్లు, చైతన్య, మల్లికార్జున్, ఆర్‌ఎస్‌ఐలు రాజవర్ధన్‌రెడ్డి, ఐదుగురు హెడ్‌కానిస్టేబుళ్లు, పది మంది కానిస్టేబుళ్లు ఉండేవారు. మేమంతా వాట్సప్‌లోనే సంప్రదించుకునేవాళ్లం. 40 నుంచి 50 మందికి చెందిన ఫోన్లను ట్యాప్‌ చేసే బాధ్యత ఈ బృందానికి అప్పగించారు. సేకరించిన సమాచారాన్ని స్థానిక పోలీసులు, టాస్క్‌ఫోర్స్, ఎస్‌వోటీకి చేరవేసి.. కాంగ్రెస్‌కు చెందిన డబ్బును విజయవంతంగా పట్టుకునేలా చూశాం.

శాసనసభ ఎన్నికల్లో లక్ష్యంగా చేసుకున్నవారిని గమనించేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మా బృందంలో ఉన్న వేణుగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పోల్‌-2023 పేరుతో వాట్సప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసుకున్నాం. ప్రణీత్‌రావు ఇచ్చిన సమాచారం ఆధారంగా పెద్దమొత్తంలో డబ్బు పట్టుకోగలిగాం. అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి సన్నిహితుడైన గాలి అనిల్‌కుమార్‌కు చెందిన రూ.90 లక్షలను కొల్లూరు వద్ద పట్టుకోగలిగారు. రేవంత్‌రెడ్డి మిత్రుడైన వినయ్‌రెడ్డి, మరో నలుగురి వద్ద రూ.1,99,85,000, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ ఇన్‌ఫ్రా డబ్బు రూ.7.5 కోట్లను షేక్‌ బిలాల్, రఘురామిరెడ్డి నుంచి స్వాధీనం చేసుకున్నాం. వీరి నుంచే మరోసారి రూ.3 కోట్లు, రాజగోపాల్‌రెడ్ది అనుచరుల నుంచి రూ.2.6 కోట్లు, విశాఖ ఇండస్ట్రీస్‌కు చెందిన కందుల రవికిశోర్‌ నుంచి రూ.50.45 లక్షలు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సన్నిహితుడైన గిరిధర్‌రెడ్డి నుంచి రూ.35 లక్షలు, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అత్త ఝాన్సీరెడ్డికి చెందిన రూ.90 లక్షలు, మాదాపూర్‌ తీగల వంతెన వద్ద జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన రూ.20 లక్షలు, తారామతి బారాదారి వద్ద రూ.70 లక్షలు, ఖమ్మంలో పొంగులేటి అనుచరుడైన వ్యాపారి నుంచి రూ.10 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నాతోపాటు బృందంలో పనిచేసిన ఇతర సభ్యులు ఇచ్చిన సమాచారం ఆధారంగా స్థానిక పోలీసులు ఈ డబ్బు పట్టుకొని.. ఆయా స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు కాంగ్రెస్‌కు చెందిన డబ్బు రవాణాను నియంత్రిస్తూ భారాసకు సజావుగా డబ్బు రవాణా అయ్యేలా చూశాం. ఇదంతా భారాసను మళ్లీ అధికారంలోకి తెచ్చే ప్రయత్నంలో భాగంగా ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలోనే జరిగింది. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారాలు బయటపడకూడదని ప్రభాకర్‌రావు ఆదేశాలు, ప్రణీత్‌రావు సూచనల మేరకు 3 కంప్యూటర్ల హార్డ్‌ డిస్కులను ధ్వంసం చేశాం. వాటి స్థానాల్లో కొత్తవి పెట్టాం. ఇతర కంప్యూటర్లలోని హార్డ్‌ డిస్కులు, సర్వర్లను ధ్వంసం చేసి కొత్తవి పెట్టాం’’ అని తిరుపతన్న పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు