Amrabad Tiger Reserve: అమ్రాబాద్‌ అభయారణ్యంలో.. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌పై నిషేధం

అమ్రాబాద్‌ పెద్దపులుల అభయారణ్యంలో ఒకసారి వాడి పారేసే (సింగిల్‌ యూజ్‌) ప్లాస్టిక్‌ను నిషేధించాలని అటవీ శాఖ నిర్ణయించింది. జులై 1వ తేదీ నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేయనున్నట్లు సమాచారం.

Published : 30 May 2024 03:59 IST

జులై 1 నుంచి అమలులోకి..
ప్లాస్టిక్‌ బాటిళ్లను అనుమతించరు

ఈనాడు, హైదరాబాద్‌: అమ్రాబాద్‌ పెద్దపులుల అభయారణ్యంలో ఒకసారి వాడి పారేసే (సింగిల్‌ యూజ్‌) ప్లాస్టిక్‌ను నిషేధించాలని అటవీ శాఖ నిర్ణయించింది. జులై 1వ తేదీ నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేయనున్నట్లు సమాచారం. ప్లాస్టిక్‌ నీళ్ల బాటిళ్లు అనుమతించరు. పైలట్‌ ప్రాజెక్టుగా అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వులో అమలుచేశాక.. దశలవారీగా రాష్ట్రంలోని ఇతర అభయారణ్యాల్లో అమలుచేసే అవకాశముందని అటవీ శాఖ అధికారి ఒకరు తెలిపారు.

వన్యప్రాణులకు తీవ్ర హాని...

అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు నాగర్‌కర్నూల్, నల్గొండ జిల్లాల్లోని 2611.4 చ.కి.మీ.లలో విస్తరించి ఉంది. ఇందులో హైదరాబాద్‌-శ్రీశైలం మార్గంలోని మన్ననూరు చెక్‌పోస్టు నుంచి దోమలపెంట మధ్య ఉన్న ప్రాంతం అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు(ఏటీఆర్‌) పరిధిలోకి వస్తుంది. ఈ మార్గం గుండా రాకపోకలు సాగించే ప్రయాణికులు అధికంగా ప్లాస్టిక్‌ నీళ్ల సీసాలు, ఇతర వ్యర్థాలను రోడ్ల వెంట పారేస్తున్నారు. వీటి కారణంగా వన్యప్రాణుల ఆరోగ్యానికి హాని కలుగుతోంది. అడవుల్లో మంటల వ్యాప్తికి ఈ వ్యర్థాలు కారణం అవుతున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌పై నిషేధం విధించి, ఏటీఆర్‌ను ప్లాస్టిక్‌ ఫ్రీ జోన్‌గా చేయాలని అటవీశాఖ సంకల్పించింది. ఇందుకు చెక్‌పోస్టుల వద్ద విస్తృతంగా తనిఖీలు నిర్వహించనుంది.

నీళ్లకు గాజు సీసాలు...

శ్రీశైలం మార్గంలో మన్ననూరు, దోమలపెంట, వటవార్లపల్లిలోని దుకాణాల్లో ప్లాస్టిక్‌కు బదులుగా గాజు సీసాల్లో నీటిని విక్రయించాలని, కాగితపు, వస్త్ర, జనపనార సంచులు, విస్తరాకుల వంటి పర్యావరణహిత ఉత్పత్తులను విక్రయించేలా చూడాలని అటవీ శాఖ నిర్ణయించింది. స్టీల్, మల్టీ యూజ్‌ ప్లాస్టిక్‌ నీళ్ల బాటిళ్లతో వచ్చేవారిని ఏటీఆర్‌లోకి అనుమతిస్తూ ఇవి లేనివారి కోసం గాజు సీసాల్లో నీటిని అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని