Sonia Gandhi: అవతరణ వేడుకలకు సోనియా గాంధీ

తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు సోనియా గాంధీ ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు.

Updated : 31 May 2024 05:45 IST

ముఖ్య అతిథిగా హాజరవుతారని ముఖ్యమంత్రి వెల్లడి
కేసీఆర్‌కు సీఎం ప్రత్యేక ఆహ్వానం
2న పరేడ్‌ గ్రౌండ్‌లో ఉత్సవాలు
సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై సాంస్కృతిక ప్రదర్శనలు
5 వేల మందితో ‘ఫ్లాగ్‌ వాక్‌’

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు సోనియా గాంధీ ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. జూన్‌ 2న ఉదయం 10 గంటలకు పరేడ్‌ గ్రౌండ్‌లో రాష్ట్ర అవతరణ వేడుకలు, సాయంత్రం తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాలకు హాజరు కావాలంటూ మాజీ సీఎం కేసీఆర్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యక్తిగత ఆహ్వాన లేఖ పంపారు. ఈ లేఖతో పాటు ఆహ్వాన పత్రికను ఆయనకు స్వయంగా అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రొటోకాల్‌ విభాగం సలహాదారు హర్కర వేణుగోపాల్‌ను, డైరెక్టర్‌ అరవింద్‌ సింగ్‌ను ఆదేశించారు. గజ్వేల్‌ ఫాంహౌస్‌లో కేసీఆర్‌కు ఆహ్వాన పత్రిక, లేఖ అందించనున్నామని హర్కర వేణుగోపాల్‌ తెలిపారు. 

అమరులకు నివాళులతో ప్రారంభం

  • తొలుత 2వ తేదీన ఉదయం 9.30 గంటలకు గన్‌పార్క్‌లో అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణాలర్పించిన వారికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాళులు అర్పిస్తారు. 
  • ఉదయం 10 గంటలకు పరేడ్‌ గ్రౌండ్‌లో జాతీయ పతాకాన్ని సీఎం ఆవిష్కరిస్తారు.పోలీసు బలగాల పరేడ్, మార్చ్‌పాస్ట్, వందన స్వీకార కార్యక్రమం ఉంటాయి. రాష్ట్ర అధికారిక గీతాన్ని ఆవిష్కరిస్తారు.  
  • అనంతరం సోనియా గాంధీ, ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. 
  • పోలీసు సిబ్బందికి, ఉత్తమ ఉద్యోగులకు అవార్డుల ప్రదానంతో ఉత్సవాలు ముగుస్తాయి.

ట్యాంక్‌బండ్‌పై జయ జయహే తెలంగాణ

  • సాయంత్రం 6.30 గంటలకు ట్యాంక్‌బండ్‌పై రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు ప్రారంభమవుతాయి. అక్కడ హస్తకళలు, ప్రత్యేక ఉత్పత్తులు, వివిధ రకాల ఫుడ్‌ స్టాల్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. 
  • సాయంత్రం 6.30 గంటలకు స్టాళ్లను ముఖ్యమంత్రి సందర్శిస్తారు.
  • అనంతరం తెలంగాణ కళారూపాల ప్రదర్శనకు అద్దం పట్టే కార్నివాల్‌ నిర్వహిస్తారు. దాదాపు 700 మంది కళాకారులు ఇందులో పాల్గొంటారు.  
  • అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన వేదికపై 70 నిమిషాల పాటు వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు నిర్వహిస్తారు. 
  • జాతీయ జెండాలతో ట్యాంక్‌బండ్‌పై ఒక చివరి నుంచి మరో చివరి వరకు భారీ ఫ్లాగ్‌ వాక్‌ నిర్వహిస్తారు. దాదాపు 5 వేల మంది ఇందులో పాల్గొంటారు. ఈ ఫ్లాగ్‌ వాక్‌ జరుగుతున్నంతసేపు 13.30 నిమిషాల పాటు సాగే పూర్తి నిడివితో ఉన్న ‘జయ జయహే తెలంగాణ’ గీతం ఆలపిస్తారు. 
  • గీత రచయిత అందెశ్రీ, సంగీత దర్శకుడు  కీరవాణిలను సన్మానిస్తారు.
  • రాత్రి 8.50 గంటలకు పది నిమిషాల పాటు బాణసంచా కాల్చే కార్యక్రమంతో వేడుకలను ముగిస్తారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని