Southwest monsoon: ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్‌ జిల్లాల్లో భారీ వర్షాలు

నైరుతి రుతుపవనాలు గురువారం నాటికి రాష్ట్రంలో అటు భద్రాచలం, ఇటు మెదక్‌ వరకు విస్తరించాయి. ఆ ప్రభావంతో బుధవారం రాత్రి నుంచి తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.

Updated : 07 Jun 2024 06:18 IST

నేడు.. రేపు.. ఎల్లుండి ఓ మోస్తరు వానలు
10వ తేదీన భారీ వర్షసూచన
మహబూబ్‌నగర్, వరంగల్‌ పరిధిలోనూ వానలు
అలంపూర్‌లో అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షం
రాష్ట్రవ్యాప్తంగా పిడుగుపాటుకు తొమ్మిది మంది మృతి
మెదక్‌ వరకూ నైరుతి విస్తరణ
నేడు.. రేపు.. ఎల్లుండి ఓ మోస్తరు వర్షాలు

నిర్మల్‌ జిల్లా సారంగాపూర్‌ మండలం లక్ష్మీనగర్‌తండాలో ఈదురుగాలులకు ఎగిరిపోయి
చెట్టును ఆనుకుని నిలిచిన ఓ ఇంటి పైకప్పు రేకులు

ఈనాడు, హైదరాబాద్‌: నైరుతి రుతుపవనాలు గురువారం నాటికి రాష్ట్రంలో అటు భద్రాచలం, ఇటు మెదక్‌ వరకు విస్తరించాయి. ఆ ప్రభావంతో బుధవారం రాత్రి నుంచి తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్‌ జిల్లాల్లో గురువారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురవగా, మహబూబ్‌నగర్, వరంగల్‌ జిల్లాల పరిధిలో అక్కడక్కడా జల్లులు కురిశాయి. పిడుగుపాటుతో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో నలుగురు, ఉమ్మడి మెదక్‌ జిల్లాలో నలుగురు, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఒక్కరు మృత్యువాతపడ్డారు. ఈదురుగాలుల కారణంగా పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్తు స్తంభాలు విరిగిపడటం, ఇళ్ల పైకప్పులు ఎగిరిపోవడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. బుధవారం రాత్రి నుంచి గురువారం వరకు అత్యధికంగా జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లో 10 సెం.మీటర్ల వర్షపాతం నమోదయింది. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లో 8, దేవరకొండ 7, నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి 7 సెం.మీటర్ల వర్షపాతం నమోదయింది. ఈ కారణంగా రాష్ట్రంలో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కన్నా తక్కువగా నమోదయ్యాయి. 


కుమురంభీం జిల్లా బెజ్జూరు మండలంలోని సోమిని-సుశ్మీర్‌లో రోడ్డుకు అడ్డంగా పడిన చెట్టు, నిలిచిన బస్సు

చెట్టుపై పిడుగుపడి.. 

  • మెదక్‌ జిల్లా హవేలిఘనపూర్‌ మండలం శమ్నాపూర్‌ గ్రామానికి చెందిన రైతు శెట్టబోయిన సిద్ధయ్య(48) పశువుల కొట్టం నిర్మించే క్రమంలో తుంగ కోసం అదే గ్రామానికి చెందిన నందు(23)ను వెంటబెట్టుకుని గురువారం ఉదయం గ్రామ శివారులోని అటవీ ప్రాంతానికి వెళ్లాడు. వర్షం రావడంతో ఇద్దరూ చెట్టు కిందకు వెళ్లారు. చెట్టుపై పిడుగు పడడంతో అక్కడికక్కడే మరణించారు. పొలాల్లో పని చేస్తుండగా పిడుగు పడటంతో మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండలం పీర్లతండాకు చెందిన డలావత్‌ గెమ్యానాయక్‌ (55), కర్ణాటకకు చెందిన కూలీ బిల్లిపురం గోపాల్‌ (40) మరణించారు.
  • ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం డొంగార్‌గాం గ్రామానికి చెందిన భార్యాభర్తలు అనక సంతోష్‌(26), అనక స్వప్న(23) గురువారం పొలానికి వెళ్లారు. సాయంత్రం వర్షం కురవడంతో తలదాచుకునేందుకు సమీపంలోని పాకలోకి వెళ్లారు. పాక పక్కనే ఉన్న టేకు చెట్టుపై పిడుగు పడటంతో ఆ ధాటికి భార్యాభర్తలు పాకలోనే ప్రాణాలొదిలారు.
  • నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌ మండలం కాల్వ గ్రామానికి చెందిన యువ రైతు ముడారపు ప్రవీణ్‌(26) పొలం దున్నుతుండగా పిడుగుపాటుకు గురయ్యాడు. ఆసుపత్రికి తరలించేలోపే మృత్యువాత పడ్డాడు. తానూరు మండలం ఎల్వత్‌కు చెందిన మాగీర్వాడ్‌ శ్రీ(13) గ్రామ శివారులో మేకలు మేపి ఇంటికి తిరిగి వస్తుండగా సమీపంలో పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. 
  • నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ మండలం పెద్దాపూర్‌ గ్రామానికి చెందిన జంగిలి ఈదమ్మ  పొలంలో పత్తి విత్తనాలు వేసేందుకు కుమార్తె జంగమ్మ (40), అల్లుడు కృష్ణయ్యతో కలిసి వెళ్లారు. వర్షం రావడంతో సమీపంలోని ఓ చెట్టు కిందికి వెళ్లారు. చెట్టుపై పిడుగుపడగా జంగమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. కృష్ణయ్య, ఈదమ్మ ఆపస్మారక స్థితికి చేరుకున్నారు.

మూడు రోజులపాటు.. 

రుతుపవనాల ప్రభావంతో శుక్ర, శని, ఆదివారాల్లో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్, మెదక్, మహబూబ్‌నగర్‌ జిల్లాల పరిధిలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నెల 10న భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రాబోయే నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించొచ్చని అంచనా వేస్తున్నట్టు తెలిపింది.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని