Group-1 Prelims: తగ్గిన ప్రశ్నల కాఠిన్యం!

రాష్ట్రంలో 563 గ్రూప్‌-1 సర్వీసుల పోస్టులకు ఆదివారం నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పకడ్బందీ ఏర్పాట్ల మధ్య రాష్ట్రవ్యాప్తంగా 897 కేంద్రాల్లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరిగింది.

Updated : 10 Jun 2024 06:58 IST

లాజికల్, అరిత్‌మెటిక్‌కు ఎక్కువ సమయం
కటాఫ్‌ మార్కులు 75 ఉండే అవకాశముందని నిపుణుల అంచనా
ప్రశాంతంగా ముగిసిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌
74% హాజరైనట్లు కమిషన్‌ ప్రకటన 

హనుమకొండలోని ఆర్ట్స్, సైన్స్‌ కళాశాలలో పరీక్ష కేంద్రంలోకి వస్తున్న అభ్యర్థులను తనిఖీ చేస్తున్న సిబ్బంది 

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో 563 గ్రూప్‌-1 సర్వీసుల పోస్టులకు ఆదివారం నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పకడ్బందీ ఏర్పాట్ల మధ్య రాష్ట్రవ్యాప్తంగా 897 కేంద్రాల్లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరిగింది. పరీక్షకు మొత్తం 4.03 లక్షల మంది దరఖాస్తు చేయగా... 3.02 లక్షల మంది (దాదాపు 74%) హాజరయ్యారని టీజీపీఎస్సీ వెల్లడించింది. పూర్తి వివరాల మదింపు తర్వాత హాజరు గణాంకాల్లో స్వల్ప మార్పులు ఉంటాయంది. త్వరలోనే టీజీపీఎస్సీ వెబ్‌సైట్లో ప్రాథమిక కీ పొందుపరుస్తామని, గ్రూప్‌-1 ప్రధాన పరీక్షలు అక్టోబరు 21 నుంచి ప్రారంభమవుతాయంది. ప్రిలిమ్స్‌ ప్రారంభానికి అర గంట ముందుగానే గేట్లు మూసివేస్తామని కమిషన్‌ స్పష్టం చేయడంతో అభ్యర్థులు ఉదయం 9 నుంచే కేంద్రాల్లోకి వచ్చారు. ప్రస్తుత ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రం... గతంలో రద్దయిన రెండు ప్రశ్నపత్రాల కన్నా కొంత తేలికగా ఉన్నట్లు నిపుణులు తెలిపారు. ఇందులో అన్ని రంగాల నుంచి ప్రశ్నలు వచ్చాయన్నారు. ఓపెన్‌ కటాఫ్‌ మార్కులు 75 వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, తెలంగాణ వర్తమాన వ్యవహారాలు, రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన గృహజ్యోతి కింద నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకం, మహాలక్ష్మి కింద ఉచిత గ్యాస్‌ పథకాలపై ప్రశ్నలు వచ్చాయి. కొవాగ్జిన్‌ టీకాను ఉత్పత్తి చేసిన సంస్థ, కేంద్ర ప్రభుత్వ చట్టాలు, జీ-20, ఎన్నికల సంఘం కమిషనర్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్యంతర బడ్జెట్లపై ప్రశ్నలు అడిగారు. 

పరీక్ష మధ్యలో బయోమెట్రిక్‌... 

పరీక్ష మధ్యలో బయోమెట్రిక్‌ తీసుకోవడంతో అభ్యర్థులు కొంత ఇబ్బందికి గురయ్యారు. టీజీపీఎస్సీ జారీ చేసిన సూచనల ప్రకారం పరీక్ష ప్రారంభానికి ముందుగానే అభ్యర్థుల బయోమెట్రిక్‌ తీసుకుంటామని, ఒకవేళ కుదరకుంటే చివర్లో తీసుకున్న తర్వాతే పరీక్ష కేంద్రం విడిచి వెళ్లాలంది. అభ్యర్థులను ఉదయం 9 గంటల నుంచే లోనికి అనుమతించినప్పటికీ, పరీక్ష ప్రారంభమయ్యే వరకు బయోమెట్రిక్‌ తీసుకోలేదు. పరీక్ష మధ్యలో తీసుకోవడం, రెండు చేతుల చూపుడు వేళ్ల బయోమెట్రిక్‌ నమోదులో ఇబ్బందులు, సాంకేతిక సమస్యలతో సమయం కోల్పోయామని కొందరు అభ్యర్థులు తెలిపారు. సరిపడా సంఖ్యలో బయోమెట్రిక్‌ పరికరాలు లేకపోవడమే ఇందుకు కారణంగా ఆయా పరీక్షల కేంద్రాల సిబ్బంది తెలిపినట్లు వారు పేర్కొన్నారు. హైదరాబాద్‌ శివారులోని ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు అభ్యర్థులు ఇబ్బంది పడ్డారు. 

అధికారులు, సిబ్బందికి అభినందనలు 

జిల్లా కలెక్టర్లు, పోలీస్‌ కమిషనర్లు, ఎస్పీలు, రెవెన్యూ, పోలీసు, విద్యుత్తుశాఖల సిబ్బంది, టీజీఆర్‌టీసీ ఇతర విభాగాల సమన్వయంతో పరీక్ష ప్రశాంతంగా జరిగిందని టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్‌ నికోలస్‌ తెలిపారు. ప్రిలిమ్స్‌లో అభ్యర్థుల వ్యక్తిగత సమాచారంతో కూడిన ఓఎంఆర్‌ పత్రాలు ఇవ్వడంతోపాటు వారి బయోమెట్రిక్‌ను నమోదు చేశామన్నారు. అన్ని పరీక్ష కేంద్రాలను, స్ట్రాంగ్‌రూమ్‌లను సీసీ కెమెరాల ద్వారా కమిషన్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం ద్వారా పర్యవేక్షించినట్లు పేర్కొన్నారు. 

 50% మార్కులు దాటితే సేఫ్‌ జోన్‌ 

ప్రస్తుత ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రం... రద్దయిన గత రెండు పేపర్లతో పోల్చితే కొంత తేలికగా ఉంది. మొత్తం 150 ప్రశ్నల్లో... 25 ప్రశ్నలు అరిత్‌మెటిక్, లాజికల్, రీజనింగ్, క్వాంటిటేటివ్‌పై ఉన్నాయి. ఇవి ఎక్కువ సమయం తీసుకునేలా అడిగారు. మిగతా 125 ప్రశ్నలు జనరల్‌ అవేర్‌నెస్‌కు సంబంధించినవి. మొత్తానికి నాణ్యమైన ప్రశ్నలు వచ్చాయి. పాలిటీలో ప్రశ్నలు తేలికగా ఉన్నప్పటికీ, కొంత ఆలోచించేలా అడిగారు. అనాలసిస్‌ కన్నా ఫ్యాక్చువల్‌ ప్రశ్నలు ఎక్కువ వచ్చాయి. పరీక్షలో ఓపెన్‌ కటాఫ్‌ 70-75 వరకు ఉండే అవకాశముంది. రిజర్వుడు వర్గాల వారీగా చూస్తే 65-75 మధ్య ఉంటుందని అంచనా. మొత్తం మీద 150 మార్కుల్లో కనీసం 50% దాటితే సురక్షిత జోన్‌లో ఉన్నట్లుగా భావించి అభ్యర్థులు గ్రూప్‌-1 ప్రధాన పరీక్షలకు సన్నద్ధం కావచ్చు. శాస్త్ర, సాంకేతిక, అంతర్జాతీయ సంబంధాలు, పర్యావరణం.. ఇలా అన్ని రంగాల నుంచి ప్రశ్నలు వచ్చాయి. ఎస్సీ, ఎస్టీ, మహిళ, ట్రాన్స్‌జెండర్‌ వర్గాల చట్టాలు, సంక్షేమంపై పలు ప్రశ్నలున్నాయి. 

 బాల లత, డైరెక్టర్, సీఎస్‌బీ ఐఏఎస్‌ అకాడమీ 

  ప్రశ్నపత్రంలో సమతుల్యం

ప్రిలిమ్స్‌లో ప్రశ్నల ఎంపిక, కేటాయింపులో సమతుల్యం కనిపించింది. ప్రభుత్వ సర్వీసులకు వెళ్లే వారికి ఎలాంటి అర్హతలు ఉండాలో పరీక్షించేలా ప్రశ్నలు అడిగారు. కొన్ని సుదీర్ఘమైన ప్రశ్నలు వచ్చాయి. వీటిని చదవడంతోపాటు జవాబులు గుర్తించేందుకు ఎక్కువ సమయం పట్టేలా ఉన్నాయి. ఇటీవల ఏపీపీఎస్సీ ప్రశ్నపత్రంతో పోల్చితే... టీజీపీఎస్సీ ప్రశ్నపత్రంలో తేలిక, మధ్యస్తం, కాఠిన్యం... ఇలా అన్ని ప్రశ్నలు ఉండేలా సమతుల్యం పాటించారు. కొన్ని ప్రశ్నలకు ఆలోచించి జవాబులు గుర్తించేలా ఉన్నాయి. ఓపెన్‌ క్యాటగిరీలో 78 మార్కులు కటాఫ్‌గా ఉండే అవకాశాలున్నాయి. 

 గోపాలకృష్ణ, డైరెక్టర్, బ్రెయిన్‌ట్రీ 


తండ్రి పేరుకు బదులు భర్త పేరుందని పరీక్షకు నిరాకరణ 

ఆదిలాబాద్‌ పాలనాప్రాంగణం, న్యూస్‌టుడే: ఓ అభ్యర్థిని ఆధార్‌కార్డులో తండ్రి పేరుకు బదులు భర్త పేరు ఉండటంతో... ఆమెను లోనికి అనుమతించని ఘటన ఆదిలాబాద్‌ పట్టణం చావర పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రిలిమ్స్‌ పరీక్ష కేంద్రంలో చోటుచేసుకుంది. పాత కార్డుంటే తెచ్చుకోవాలని సూచించినా... దాన్ని తెచ్చేందుకు రెండు నిమిషాలు ఆలస్యమైంది. పట్టణంలోని రాంనగర్‌కు చెందిన ఆమెకు దరఖాస్తు చేసుకున్నప్పుడు పెళ్లి కాకపోవడంతో తన తండ్రి పేరును ప్రస్తావించారు. ప్రస్తుతం పెళ్లయి ఆధార్‌లో మార్పులు చేసుకున్నారు. ఆమె ఇది వరకే జేఎల్‌కి ఎంపికయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని