Telangana: బ్యారేజీల ఇన్వెస్టిగేషన్స్‌ భారం ప్రభుత్వానిదే

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ(ఎన్‌.డి.ఎస్‌.ఎ.) సూచించిన ఇన్వెస్టిగేషన్స్‌ చేయించడానికి అయ్యే వ్యయ భారాన్ని ప్రభుత్వమే భరించాలని నిర్ణయం తీసుకుంది.

Updated : 26 May 2024 05:37 IST

తాత్కాలిక మరమ్మతుల ఖర్చు నిర్మాణ సంస్థలే భరించాలి

ఈనాడు, హైదరాబాద్‌: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ(ఎన్‌.డి.ఎస్‌.ఎ.) సూచించిన ఇన్వెస్టిగేషన్స్‌ చేయించడానికి అయ్యే వ్యయ భారాన్ని ప్రభుత్వమే భరించాలని నిర్ణయం తీసుకుంది. ఒప్పందం ప్రకారం చేసిన పనులకు సంబంధించిన తాత్కాలిక మరమ్మతులకు అయ్యే ఖర్చును మాత్రం నిర్మాణ సంస్థలే భరించాలని సూచించినట్లు తెలిసింది. ఒప్పందం ప్రకారం పనులు పూర్తయ్యాయా లేదా.. డిఫెక్ట్‌ లయబిలిటీ పీరియడ్‌లో ఉందా లేదా (నిర్మాణం పూర్తయిన తర్వాత రెండేళ్ల వరకు ఏదైనా సమస్య వస్తే నిర్మాణ సంస్థదే బాధ్యత).. ఆపరేషన్స్‌ అండ్‌ మెయింటెనెన్స్‌(ఓ అండ్‌ ఎం)కు ఒప్పందం జరిగిందా లేదా లాంటి అంశాలన్నింటినీ పక్కనపెట్టి ఎన్‌.డి.ఎస్‌.ఎ. సూచించిన మేరకు తాత్కాలిక మరమ్మతులు, అవసరమైన ఇన్వెస్టిగేషన్స్‌ చేయించడంపైనే దృష్టి సారించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. దీనిపై ముఖ్యమంత్రి వద్ద, మంత్రి వద్ద, నీటిపారుదల శాఖ అధికారుల వద్ద చర్చలు జరిగాయి.

డిజైన్‌లో లోపం కాబట్టి.. తమ బాధ్యత లేదని, పని పూర్తయినట్లు 2021 మార్చి 15నే ధ్రువీకరణ ఇచ్చిన నేపథ్యంలో రెండేళ్లు గడిచాయని.. ఇప్పుడు తమది బాధ్యత కాదని మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ సంస్థ.. నీటిపారుదల శాఖకు లేఖలు రాసింది. అయితే ఒప్పందం ఇంకా కొనసాగుతుండటం, 2022 మార్చి వరకు గడువు పొడిగింపు తీసుకున్నారని ఈఎన్‌సీకి ప్రాజెక్టు చీఫ్‌ ఇంజినీర్‌ రాసిన లేఖ ముఖ్యమంత్రి వద్ద జరిగిన సమావేశంలో చర్చకు వచ్చాయి. ఈ నేపథ్యంలో నిర్మాణ సంస్థే పనులు చేయాలని స్పష్టంగా చెప్పినట్లు నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశం తర్వాత మేడిగడ్డ బ్యారేజీలో తాత్కాలిక మరమ్మతు పనులను నిర్మాణ సంస్థ ఎల్‌ అండ్‌ టీ చేపట్టింది. సీసీ బ్లాకులను పునరుద్ధరించడం.. ఎగువ, దిగువ భాగాలను మొత్తం శుభ్రం చేయడం.. బుంగలను ఇసుక బస్తాలతో పూడ్చడం లాంటి పనులతోపాటు ఏడో బ్లాక్‌లో గేట్లను పైకెత్తే పనులను చేపట్టింది. ఈ పనిలో ఎల్‌ అండ్‌ టీ వాటా 80 శాతం కాగా.. పీఈఎస్‌ అనే సంస్థది 20 శాతం. ఈ సంస్థే గేట్లను అమర్చే పని చేసినట్లు తెలిసింది. 15వ గేటును పైకెత్తగా, 16వ గేటు ఎత్తడానికి ప్రయత్నించిన సమయంలో సమస్య రావడంతో నిలిపివేశారు. రెండు గేట్లను పూర్తిగా తొలగించడంతోపాటు మిగిలిన గేట్లను పైకెత్తడం, ఇందులో ఏమైనా సమస్య వస్తే తొలగించడం చేయాల్సి ఉంది. 

పరీక్షల వివరాలు తెలపనున్న సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌ నిపుణులు 

కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీర్ల విజ్ఞప్తి మేరకు పుణెలోని సెంట్రల్‌ వాటర్‌ అండ్‌ పవర్‌ రీసెర్చ్‌ స్టేషన్‌(సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌) నిపుణుల బృందం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించి వెళ్లింది. చేయాల్సిన పరీక్షలు, అందుకయ్యే వ్యయం వివరాలను త్వరలోనే ఈ బృందం అందజేయనుంది. మరోవైపు, మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్‌ కాంక్రీటు స్ట్రక్చర్‌కు జియో ఫిజికల్, జియో టెక్నికల్‌ ఇన్వెస్టిగేషన్స్‌ను దిల్లీలోని సి.ఎస్‌.ఎం.ఆర్‌.ఎస్‌.(సెంట్రల్‌ సాయిల్‌ అండ్‌ మెటీరియల్స్‌ రీసెర్చ్‌ స్టేషన్‌) సంస్థతో చేయించాలని ప్రాజెక్టు చీఫ్‌ ఇంజినీర్‌కు ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌(ఓ అండ్‌ ఎం) సూచించారు. ఈ సంస్థ పేరును కూడా ఎన్‌.డి.ఎస్‌.ఎ. సిఫారసు చేసింది. ఈ పరీక్షలు చేయించడానికి రూ.2.46 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. మూడు బ్యారేజీలకు ఎన్‌.డి.ఎస్‌.ఎ. సూచించిన పరీక్షలన్నీ చేయించడానికి భారీగానే ఖర్చు చేయాల్సి ఉంటుందని నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని