Telangana Formation Day: వైభవంగా రాష్ట్ర అవతరణ ఉత్సవాలు

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను జూన్‌ 2న ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి తెలిపారు. ఆదివారం ఉదయం గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ రాష్ట్ర సాధన అమరులకు సీఎం రేవంత్‌రెడ్డి నివాళులు అర్పించిన అనంతరం సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారన్నారు.

Published : 28 May 2024 04:32 IST

2న గన్‌పార్కు వద్ద అమరవీరులకు సీఎం నివాళులు
పరేడ్‌ గ్రౌండ్స్‌లో రాష్ట్ర గీతం ఆవిష్కరణ, సీఎం ప్రసంగం
సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై  భారీ సాంస్కృతిక కార్యక్రమాలు
ఏర్పాట్లపై సీఎస్‌ సమీక్ష

సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్స్‌లో రాష్ట్ర అవతరణ వేడుకల ఏర్పాట్లను పరిశీలిస్తున్న సీఎస్‌ శాంతికుమారి,
డీజీపీ రవిగుప్తా, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టర్‌ దివ్య ఇతర ఉన్నతాధికారులు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను జూన్‌ 2న ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి తెలిపారు. ఆదివారం ఉదయం గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ రాష్ట్ర సాధన అమరులకు సీఎం రేవంత్‌రెడ్డి నివాళులు అర్పించిన అనంతరం సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. ఆయా ఏర్పాట్లపై సోమవారం డా.బీఆర్‌ అంబేడ్కర్‌ సచివాలయంలో వివిధ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులతో సీఎస్‌ శాంతికుమారి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా సీఎస్‌ మాట్లాడుతూ... ‘‘ఉదయం సీఎం రేవంత్‌రెడ్డి పరేడ్‌ గ్రౌండ్స్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత సీఎం సందేశం ఉంటుంది. సాయంత్రం 7గంటల నుంచి రాత్రి 9గంటల వరకు ట్యాంక్‌బండ్‌పై రాష్ట్రంలోని అన్ని కళారూపాలతో పెద్ద ఎత్తున కార్నివాల్‌ ఉంటుంది. శిక్షణ పొందుతున్న 5,000 మంది పోలీస్‌ అధికారులు బ్యాండ్‌తో పాల్గొంటారు. దాదాపు 80 స్టాళ్లను ఏర్పాటు చేసి హస్తకళలు, చేనేత, స్వయం సహాయక బృందాలు తయారు చేసిన వస్తువులను ప్రదర్శనలో ఉంచుతారు. నగరంలోని పేరొందిన హోటళ్లు ఫుడ్‌ స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నాయి. కార్యక్రమానికి హాజరయ్యే నగర పౌరులతో వచ్చే పిల్లలకు పలు క్రీడలతో కూడిన వినోదశాలను ఏర్పాటు చేశాం. సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం బాణసంచా ప్రదర్శన, లేజర్‌ షో ఉంటాయి. ఆ రోజు అన్ని ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్‌ దీపాలతో అలంకరించాలి’’ అని ఆదేశించారు. సమావేశంలో డీజీపీ రవిగుప్తా, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు దానకిశోర్, శైలజా రామయ్యర్, శ్రీనివాసరాజు, జీఏడీ కార్యదర్శి రఘునందన్‌రావు, అదనపు డీజీలు సంజయ్‌కుమార్‌ జైన్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, సమాచార శాఖ స్పెషల్‌ కమిషనర్‌ హనుమంతరావు, ఎన్‌పీడీసీఎల్‌ ఎండీ ముషారఫ్, హెచ్‌ఎండీఏ అదనపు కమిషనర్‌ ఆమ్రపాలి తదితరులు పాల్గొన్నారు. 

జూన్‌ 2న గ్రామం నుంచి రాష్ట్రస్థాయి వరకూ అన్ని ప్రభుత్వ విభాగాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని సీఎస్‌ ఎ.శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీపీలు, మేయర్లు, మున్సిపల్, జడ్పీ, డీసీసీబీ, డీసీఎంఎస్‌ ఛైర్‌పర్సన్లు, అన్ని శాఖల విభాగాధిపతులు పాల్గొనాలని కోరారు. ఎక్కడా ప్లాస్టిక్‌ జెండాలను వాడొద్దని స్పష్టంచేశారు. 

పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఏర్పాట్ల పరిశీలన 

కంటోన్మెంట్, న్యూస్‌టుడే: సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లను వివిధ శాఖల అధికారులతో కలిసి సోమవారం సీఎస్‌ శాంతికుమారి పరిశీలించారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా కార్యక్రమం సజావుగా జరిగేలా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. వేదిక, బారికేడింగ్, విద్యుత్తు, మంచినీటి సరఫరా, ఎల్‌ఈడీ స్క్రీన్ల ఏర్పాటు తదితరాలపై ఆరా తీశారు. బందోబస్తు, ట్రాఫిక్, వీఐపీల రాకపోకలకు అంతరాయం కలగకుండా చేపడుతున్న చర్యలు, వాహనాల పార్కింగ్‌ వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట డీజీపీ రవిగుప్తా, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు శైలజా రామయ్యర్, శ్రీనివాసరాజు, జీఏడీ కార్యదర్శి రఘునందన్‌రావు, అదనపు డీజీ సంజయ్‌కుమార్, సమాచార శాఖ స్పెషల్‌ కమిషనర్‌ హనుమంతరావు తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని